DCC | నల్గొండ డీసీసీ అధ్యక్ష పీఠం పున్న కైలాస్ నేతను వరించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఏఐసీసీ శనివారం ఏఐసీసీ శనివారం రాత్రి డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యూత్ కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డికి చివరకు నిరాశే ఎదురైంది. మంత్రి కోమటిరెడ్డి అనుచరుడు అయిన గుమ్మలకు పదవి దక్కుతుందని ఆశించినా.. సీనియర్ నేత జానారెడ్డి చక్రం తిప్పడంతో పున్న కైలాస్ నేత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియాకమయ్యారు. నల్గొండలోని మంత్రి వ్యక్తిగత క్యాంప్ కార్యాలయంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిసారి డీసీసీ పోస్ట్ అడిగినా.. మంత్రి కోమటిరెడ్డి అనుచరడనే పేరు, కులం తనకు అడ్డుగా వచ్చిందన్నారు. కులం నా డీసీసీ పదవిని లాక్కుందని. కాంగ్రెస్ పార్టీలో వార్డు మెంబర్ కాకున్నా డీసీసీ కావొవచ్చునన్నారు. సీనియారిటీ, నా సర్వీస్ ఎందుకు పనికిరాలేదని.. ఎవరిని నొప్పించకుండా రాజకీయాలు చేస్తే పక్కకు పెట్టారన్నారు. అవసరమైనప్పుడు 5వేలమందితో ర్యాలీ తీశానని.. మా నాన్న ఎమ్మెల్యే నో, ఎంపీ నో అయితే నాకు ఎమ్మెల్యే పదవి వచ్చేదంటూ వ్యాఖ్యానించారు. తాను నమ్మిన కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఇది కాదని.. రెడ్డి కులం డీసీసీకి అడ్డు అయితే వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. పార్టీ లైన్ దాటకుండా పని చేయడం కోమటిరెడ్డి నేర్పారని.. అదే పద్ధతిలో రాజకీయాలు ఉంటాయన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి నల్లగొండలో సభ పెడితే తానే ముందున్నానన్నారు. భుజం మీద చేయి వేసి రేవంత్‌రెడ్డి తన గొంతుకోశాడని.. సీఎం దగ్గర ఉన్న పటేల్ రమేశ్ రెడ్డికి పర్యాటక కార్పొరేషన్ పదవి వచ్చిందన్నారు. రేవంత్‌కు దగ్గరగా ఉన్న చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీర్ రెడ్డి ఇద్దరు ఎంపీలు అయ్యారని.. నియోజకవర్గం మొత్తం నా పేరు డీసీసీకి ఓకే అన్నారని.. అధిష్టానం మాత్రం కులం పేరు చెప్పి అడ్డుకుందని ఆరోపించారు. తన తర్వాత వచ్చిన 20 మంది కి కార్పొరేషన్ పదవులు ఇచ్చారని.. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇస్తానని చెప్పినా వద్దని చెప్పానన్నారు. గత రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్‌లో వలస నాయకులకే పెద్దపీట వేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నష్టం చేసే వాళ్లను రోడ్డు మీద దొరికిచ్చుకుని కొడతామని.. కోమటిరెడ్డి తలుచుకుంటే 24 గంటల్లో ఆర్టీసీ చైర్మన్ పదవి తనకు వస్తుందన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి తాను సపోర్ట్ చేయలేదని.. ఎవరినీ బ్లాక్ మెయిల్ చేయలేదన్నారు. తనకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరుతున్నానని.. దేవుడిలా నమ్ముకున్న నాయకుడే న్యాయం చేస్తాడని భావిస్తున్నానన్నారు. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయినా జెండా వదల్లేదని.. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఇద్దరికీ చెబుతున్నామని.. పార్టీకి నష్టం చేసేవారిని వెంట తిప్పుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమన్నారు. బీసీ సర్పంచుల విషయంలో పార్టీ పరంగా 50 శాతం రిజర్వేషన్లు ఇస్తామని.. కాంగ్రెస్ పార్టీలో ఎవరి వెంట తిరిగితే వాళ్ల బ్యాచ్ అంటున్నారని.. రేవంత్ వెంట తిరిగితే నాకు ఎమ్మెల్యే, ఎంపీ పదవి వచ్చేదన్నారు. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందన్నారు.
ఇదిలా ఉండగా.. నల్లగొండ జిల్లా పదవికి ఐదుగురు పోటీపడ్డారు. తాము పార్టీకి అందిస్తున్న సేవలను వివరిస్తూ.. అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకున్నారు. కొండటే మల్లయ్య (ఎస్సీ), పున్న కైలాష్ నేత (బీసీ), గుమ్మల మోహన్ రెడ్డి (ఓసీ) చామల శ్రీను (బీసీ), దైదా రవీందర్ (ఎస్సీ) డీసీసీ పదవి కోసం పోటీపడ్డారు. అయితే, నల్లగొండ మున్సిపల్మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, అబ్బగోని రమేశ్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, గుమ్మల మోహన్ రెడ్డి మద్దతు ప్రకటించారు. అయితే, సామాజిక సమీకరణల దృష్ట్యా బీసీలకే డీసీసీ అధ్యక్ష పీఠం కేటాయించే అవకాశం ఉందని సైతం వార్తలు వచ్చాయి. ఊహించినట్లుగానే డీసీసీ అధ్యక్ష పదవిని కాంగ్రెస్ హైకమాండ్ బీసీలకు కేటాయించింది.