ప్రతి మనిషికీ నిండు నూరేళ్లు బతకాలనే కోరిక ఉంటుంది. ఆహారపు అలవాట్లను కొద్దిగా సరిచేసుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది! ఎలాగో తెలుసా? కొన్ని రకాల ఆహార పదార్థాలు దేహంలో జీవక్రియలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. దీంతో వయసు పైబడక ముందే వృద్ధాప్యం పలకరిస్తున్నది. ఇన్ఫ్లమేషన్, కణాలలోని కొలాజన్ దెబ్బతినడం, ఆక్సిడేషన్ పెరగడం, ఆరోగ్యవంతమైన జీవక్రియల్లో మార్పులు కలుగజేసే ఆరు రకాల ఆహార పదార్థాలను తరచుగా తీసుకోవడం.. ఇవన్నీ ముదిమిని ముందుకు తెస్తాయనిని నిపుణులు చెబుతున్నారు. అందాన్ని పెంచుకుంటూ, ఆరోగ్యాన్ని కాపాడుకొంటూ, యవ్వనాన్ని ఇంకొంచెం ఎక్కువకాలం పెంచుకోవాలంటే తప్పకుండా వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
పంచదార పానియాలు : పంచదార కలిపి తయారు చేసిన పళ్ల రసాలు తాగితే రక్తంలో చక్కెర స్థాయులు ఒక్కసారిగా పెరుగుతాయి. దీనివల్ల చర్మ కణజాలంలో ఉండే కొలాజన్ బలహీనపడుతుంది. అందువల్ల చర్మం ముడతలుపడి ముసలితనాన్ని ముందే తెస్తుంది.
వేపుళ్లు : బాగా వేయించిన ఆహారం తింటే.. ట్రాన్స్ ఫ్యాట్ వల్ల చర్మం ఆరోగ్యాన్ని కోల్పోతుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్కు కారణమవుతుంది.
మద్యం : ఆల్కహాల్ని అధికంగా తీసుకోవడం వల్ల చర్మంలో నీరు తగ్గి పొడిబారిపోతుంది. ఆల్కహాల్ ప్రభావంతో కొలాజన్ ఉత్పత్తి తగ్గుతుంది. లివర్ పనితీరుపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ కారణాల వల్ల వృద్ధాప్యం తొందరగా వస్తుంది.
ప్యాక్ చేసిన ఆహారం: రంగు, రుచి పెంచేందుకు, నిల్వ చేసేందుకు, ఆకట్టుకునే రంగు కోసం ప్యాక్ చేసిన ఆహారంలో కొన్ని రసాయనాలను ఉపయోగిస్తారు. అలాగే వీటిలో కార్బొహైడ్రేట్లు, ట్రాన్స్ఫ్యాట్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరుగుదలకు, ఆక్సిడేషన్ చర్యలు పెరగడానికి కారణమవుతాయి.
ప్రాసెస్ చేసిన మాంసం: మాంసాన్ని ప్రాసెస్ చేసేందుకు నైట్రేట్స్, సోడియం, నిల్వ చేసేందుకు రసాయనాలు ఉపయోగిస్తారు. ఇవి కూడా ఇన్ఫ్లమేషన్, ఆక్సిడేషన్ను పెంచుతాయి.
ప్రాసెస్ చేసిన పిండి పదార్థాలు: ప్రాసెస్ చేసిన ధాన్యాలతో చేసిన ఆహారం తినడం వల్ల రక్తంలోకి ఒక్కసారిగా చక్కెరలు వచ్చి చేరతాయి. ఇవి కూడా కొలాజన్ని నష్టపరుస్తాయి.