మహిళల్లో సాధారణంగా కనిపించే సమస్య.. థైరాయిడ్. మారుతున్న ఆహారపు అలవాట్లు, హార్మోన్లలో మార్పులు, జీవనశైలి లోపాలు.. ఈ సమస్య రావడానికి ఎన్నో కారణాలు. ఒకప్పుడు పెద్దవారిలోనే కనిపించేది. ఇప్పుడు పిల్లలనూ వేధిస్తున్నది. దాంతో, చిన్నప్పటి నుంచే మందులు వాడాల్సిన పరిస్థితి వస్తున్నది. అయితే, థైరాయిడ్ సమస్యకు యోగాతో చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు నిపుణులు. ప్రాథమిక దశలో ఉన్న ఈ సమస్యను.. కొన్ని ఆసనాలతో కట్టడి చేయొచ్చని అంటున్నారు.
సూర్య నమస్కారం: అత్యంత సాధారణమైన ఈ యోగాసనం.. శరీరం మొత్తాన్నీ ఉత్తేజపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గొంతు, మెడ ప్రాంతాన్ని సున్నితంగా సాగదీస్తూ చేసే సూర్యనమస్కారం.. థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా సాధన చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది.
సర్వాంగాసనం: థైరాయిడ్ గ్రంథిని ఉత్తేజపరచడంలో, థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని నియంత్రించడంలో సర్వాంగాసనం సాయపడుతుంది. ఈ ఆసనం.. కాళ్ల నుండి తల వరకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. థైరాయిడ్ సమస్యలను నిర్మూలిస్తుంది. సింహాసనం: గొంతును సున్నితంగా సాగదీస్తూ.. థైరాయిడ్ గ్రంథిని నేరుగా ప్రేరేపిస్తుంది సింహాసనం. థైరాయిడ్ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపే ఒత్తిడి, ఆందోళనను చిత్తు చేస్తుంది. నిత్యం సాధన చేస్తే.. గొంతు కండరాలు బలంగా తయారవుతాయి. హార్మోన్ల సమతుల్యత మెరుగుపడుతుంది. మత్స్యాసనం: ఈ ఆసనం.. మెడను సాగదీసి థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపిస్తుంది. ఒత్తిడి స్థాయులను నియంత్రిస్తుంది. కండరాలు, కీళ్లను దృఢంగా మారుస్తుంది. శరీరానికి కావాల్సిన విశ్రాంతిని ఇవ్వడంతోపాటు థైరాయిడ్ లోపం వల్ల కలిగే మానసిక కల్లోలం, నిరాశను నివారించడంలో సాయపడుతుంది.
యోగాతో పాటు కొన్ని సూచనలు పాటించినప్పుడే.. మంచి ఫలితం కనిపిస్తుంది. ఖాళీ కడుపుతోనే యోగా చేయాలి. థైరాయిడ్ మందులను యోగా భర్తీ చేయదు. మందులకు మద్దతుగానే ఆసనాలను అభ్యసించాలి.సమతుల ఆహారం, తగినంత నిద్రతోపాటు సమయానికి మందులు తీసుకోవడం ముఖ్యం.