జుట్టు రాలడానికి, మెరుపుని కోల్పోవడానికి కారణాలు ఎన్నో. ఒత్తిడి, కాలుష్యం, వాతావరణంలో తేడాలు.. అన్నీ కుదుళ్లపైనే ప్రభావం చూపుతాయి. అందుకే, జుట్టు సంరక్షణకు ఖరీదైన షాంపూలు, కండిషనర్లు వాడుతుంటారు. ఇందుకోసం వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు. అయితే, వంటింట్లో దొరికే బియ్యం నీటితోనే జుట్టును మెరిసేలా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
బియ్యం కడిగిన నీటిలో అమినో యాసిడ్లు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి జుట్టుకు సరైన పోషణను అందిస్తాయి. ఈ నీటికి రోజ్ వాటర్‌ను కూడా కలిపితే.. మరిన్ని అద్భుతమైన ప్రయోజనాలు అందుతాయి. ఇందుకోసం ముందుగా ఒక గ్లాసులో కొన్ని బియ్యం తీసుకొని, శుభ్రంగా కడగాలి. అందులోనే తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, తక్కువ గాఢత కలిగిన షాంపూ (ఒక టేబుల్ స్పూన్) వేసి బాగా కలపాలి. స్నానం చేసేటప్పుడు ఈ షాంపూ మిశ్రమాన్ని జుట్టుకు, కుదుళ్లకు బాగా పట్టించి.. మెల్లగా మసాజ్ చేయాలి.
జుట్టుపై కనీసం 10 నిమిషాలపాటు అలాగే ఉంచడం మంచిది. దీనివల్ల బియ్యం నీటిలోని పోషకాలన్నీ జుట్టు కుదుళ్ల లోపలికి చేరుతాయి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేయడం వల్ల జుట్టుకు సహజసిద్ధమైన మెరుపు వస్తుంది. జుట్టు కుదుళ్లు దృఢంగా మారి, వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. రోజ్ వాటర్ కూడా కలవడం వల్ల.. జుట్టు మరింత తేమగా మారి, చిక్కులు పడకుండా ఉంటుంది. జుట్టులోని మురికి కూడా తొలగిపోయి, చుండ్రు బాధ తప్పుతుంది.