అలసటగా ఉన్నప్పుడు కొందరు ఎనర్జీ డ్రింక్స్‌ను ఆశ్రయిస్తుంటారు. వాటిని తాగి, తక్షణ చురుకుదనం పొందుతారు. అయితే, ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారిలో ఆరోగ్య సమస్యలు మరింత పెంచుతుందని హెచ్చరిస్తున్నారు.
ఎనర్జీ డ్రింక్స్ తాత్కాలికంగా శక్తిని, చురుకుదనాన్ని పెంచుతాయి. అదే సమయంలో గుండె ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఇదే విషయాన్ని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెబుతున్నది. ఎందుకంటే.. చాలారకాల ఎనర్జీ డ్రింక్స్‌లలో కెఫిన్ స్థాయులు అధికంగా ఉంటాయి. ఇతర సమ్మేళనాలతో కలిసి.. హృదయ స్పందన రేటుపై ప్రభావం చూపుతాయి. రక్తపోటు పెరుగుదలకూ దారితీస్తాయి. గుండె లయకు అంతరాయం కలిగించడంతోపాటు గుండెను ఒత్తిడికి గురిచేస్తాయి. గుండె కణాల పనితీరునూ మార్చేస్తాయి. ఇక ఎనర్జీ డ్రింక్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు అధికమయ్యే అవకాశం ఉన్నదని పలు అధ్యయనాలు తేల్చాయి కూడా.
సాధారణంగా రోజుకు 400 మిల్లీగ్రాముల కంటే తక్కువ కెఫిన్ తీసుకోవాలని నిపుణులు సిఫారసు చేస్తున్నారు. అంటే, దాదాపు నాలుగు చిన్న కప్పుల కాఫీ సరిపోతుందని అంటున్నారు. గుండె సమస్యలు ఉన్నవారు ఎనర్జీ డ్రింక్స్‌ను పూర్తిగా నివారించాలని సూచిస్తున్నారు. ఎనర్జీ డ్రింక్‌లోని పదార్థాలను అర్థం చేసుకోవడం కూడా ముఖ్యమే. తద్వారా మీ ఆరోగ్యానికి అనుకూలమైన డ్రింక్స్‌ను ఎంచుకోవచ్చు. ఇక కార్బొనేటెడ్ ఎనర్జీ డ్రింక్స్‌కు బదులుగా.. ఆరోగ్యకరమైన వాటిని తీసుకోవచ్చు. తగినంత నిద్రపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తినడంతోపాటు నిత్యం హైడ్రేటెడ్‌గా ఉండటం వల్ల కొత్త శక్తిని పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.