అత్యధిక పోషకాలు ఉండే ఆహారం గుడ్డు. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. పైగా సమతులాహారం కూడా. అందుకే గుడ్డు అన్ని వయసుల ఆడవారికీ అవసరమైన ఆహారం. అన్ని దశల్లో దీనిని తినాలని వైద్యులు చెబుతున్నారు. మెదడు పని తీరుని, ఎముకల పటుత్వాన్ని, చర్మ సౌందర్యాన్ని, అన్నిరకాల రోగాల నుంచి కాపాడే వ్యాధి నిరోధకతను పెంపొందించే పోషకాలు గుడ్డులో పుష్కలంగా ఉన్నాయి.
కంటికి మేలు తెల్లసొన, పచ్చ సొనలో లూటిన్, జియాంగ్జంతిన్ యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రెటీనా ఆరోగ్యంగా ఉండేందుకు, వయసుతో వచ్చే కంటి సమస్యలను నివారించేందుకు ఉపయోగపడతాయి.
పీరియడ్ ప్రాబ్లమ్స్‌కు చెక్ పచ్చ సొనలో కొలిన్, విటమిన్ బి12, ఫోలేట్, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. వీటి వల్ల పునరుత్పత్తి అవయవాలు, వాటి ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందులో ఉండే కొవ్వులు హార్మోన్ల సమతుల్యతకు దోహదపడతాయి. పీరియడ్స్ సకాలంలో వచ్చేలా ఈ పోషకాలు మేలు చేస్తాయి.
బలమైన కండరాలు గుడ్డు తింటే కండరాలు బలపడతాయి. బక్కగా ఉన్నవారు రెగ్యులర్‌గా ఎగ్ తీసుకుంటే శారీరక శక్తి పెరుగుతుంది. గాయాలు, పుండ్ల బారినపడ్డవారికి చర్మం, కండ ఏర్పడేందుకు కావాల్సిన ప్రొటీన్లను సమకూరుస్తుంది.
ఎముకలకు పుష్టి గుడ్డులో క్యాల్షియం, ఫాస్పరస్, సెలీనియం లాంటి ఖనిజ లవణాలుంటాయి. ఇవి శరీర జీవ క్రియలు సాధారణంగా ఉండేందుకు ఉపయోగపడతాయి. స్త్రీలలో వయసుతోపాటు ఎముకలు బోలుగా మారతాయి. గుడ్డు తరచుగా తినడం వల్ల ఈ సమస్య రాకుండా ఉంటుంది.
బరువు తగ్గడానికి అధిక బరువుతో ఉన్నవాళ్లు ఉదయం గుడ్డు తినడం వల్ల ఎక్కువ కార్బోహైడ్రేట్లను తప్పించుకోవచ్చు. అందువల్ల శరీరంలోని కొవ్వు తగ్గుతుంది. బాడీ మాస్ ఇండెక్స్ మెరుగవుతుంది.
మానసిక ఆరోగ్యానికి మహిళలు అనేక బాధ్యతలను ఏక కాలంలో నిర్వర్తించాల్సి ఉంటుంది. వీటన్నిటినీ సమన్వయం చేసుకునే సందర్భంలో ఒత్తిడికి గురవ్వడం సహజమే. ఈ ఒత్తిడి వల్ల కలిగే మతి మరుపు, మానసిక అనారోగ్యాలను గుడ్డు తగ్గిస్తుంది. గుడ్డులోని పోషకాల వల్ల ఆరోగ్యంగా ఉంటారు. మెదడు పనితీరు చురుగ్గా ఉంటుంది. పనులను తేలిగ్గా చేసుకోగలిగితే ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అందుకే రోజుకో గుడ్డు తీసుకోవడం అలవాటుగా మార్చుకోవడం మంచిది.