రాత్రి భోజనం ఆలస్యమైతే.. మధుమేహం ముప్పు అధికమవుతుందని ఇటీవలి ఓ అధ్యయనం హెచ్చరించింది. సాయంత్రం 5 గంటలలోపే డిన్నర్ చేయడం ఆరోగ్యానికి మంచిదని.. యూనివర్సిటీ ఆఫ్ ఒబెర్టా దె కాటలున్యా (యూఓసీ), కొలంబియా యానివర్సిటీ నిర్వహించిన సర్వే తేల్చింది. ‘న్యూట్రిషన్ అండ్ డయాబెటిస్’లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. ఈ సందర్భంగా సర్వే ప్రతినిధులు మాట్లాడుతూ.. సాయంత్రం 5 దాటిన తర్వాత తీసుకునే కేలరీల్లో 45 శాతానికి పైగా రక్తంలో చక్కెర స్థాయులను తీవ్రంగా ప్రభావితం చేస్తాయట. ఫలితంగా, మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం వల్ల గ్లూకోజ్ జీవక్రియకు, ఇన్సులిన్ పనితీరుకు ఆటంకంగా మారుతుందట.
రాత్రిపూట శరీరంలో ఇన్సులిన్ తక్కువగా ఉండటం వల్ల.. గ్లూకోజ్‌ను శోషించే శక్తి తగ్గుతుందని, ఇది మధుమేహానికి దారితీస్తుందని చెబుతున్నారు. ఇదేకాకుండా.. ఆలస్యంగా డిన్నర్ చేయడం వల్ల బరువు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయట. ఇక ఆలస్యంగా తినడం వల్ల జీర్ణ సమస్యలు, ఛాతిలో మంట, అజీర్తి, గ్యాస్, ఉబ్బరం లాంటి ఇబ్బందులూ పలకరిస్తాయి. ఫలితంగా, నిద్రలేమితోపాటు మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. తిన్న వెంటనే నిద్రించడం వల్ల గుండె వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుందని సర్వే ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. అందుకే, వీలైనంత తొందరగా రాత్రి భోజనం ముగించాలని చెబుతున్నారు. సాయంత్రం 5 గంటల్లోపే భోజనం పూర్తిచేయాలని సలహా ఇస్తున్నారు.