ఒక జాతి అస్తిత్వం దాని సంస్కృతిలో సమ్మిళితమై ఉంటుంది. ప్రజల వేషభాషలు, జీవనవిధానం, వేడుకలు, పండుగలు దానికి ప్రతీకలు. ఆ విధంగా తెలంగాణ అస్తిత్వ పతాక బతుకమ్మ. తరాల నుంచీ ఆ సంప్రదాయాన్ని భుజాన మోస్తున్న వారంతా ఈ మట్టికి వారసులే. అలాంటి అసలు సిసలైన వారసురాలే ద్యావనపల్లి లింగమ్మ. తొంభయ్యేండ్ల పై బడిన వయసున్న ఆమెకు వందేండ్లకు పూర్వపు బతుకమ్మ పాటలు వందలు వచ్చు. అచ్చంగా ఆమె చెప్పిన పాటలతోనే తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ పుస్తకమూ అచ్చేసింది. ‘అఆలు రానిదాన్ని వందల పాటలు పాడితిని.. వందల పుస్తకాలు చదివేటోళ్లు ఒక్క పాటన్న నేర్వరా తల్లి..’ అంటున్న ఆమెతో జిందగీ కలబోసుకున్న సంగతులు..
Bathukamma | నా పేరు ద్యావనపల్లి లింగమ్మ. నాకు తొంబై ఏండ్ల పైన వయసుంటది. ఇగ, పాటలంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ పాడుతున్న. ఒడ్లు దంచాలంటే పాట, ఇసుర్రాయి పాట, పెండ్లి పాట, గడపల్ల పాట, బిడ్డ పుడితే పాట, నాట్లేసే చోట పాట, కలుపు తీసే చోట పాట… ఇట్ల ఎన్ని పాటలు పాడుతుంటిమో లెక్కే లేదు. ఒక్కొక్కప్పుడు ఒక్కో రకం పాటలు పాడుతుంటిమి. బతుకమ్మ పండుగొచ్చిందంటే పాటల పండుగే అచ్చినట్టుండేది. మా తల్లిగారి ఊళ్ల, మా అత్తగారి ఊళ్ల అన్ని చోట్ల పండుగంటే పాటంటే నేనే ముందుండేది. ఎక్కడ పాట పాడిన ఏ తల్లి కన్నదమ్మ నిన్ను అంటుంటిరి. అంత ఇష్టంతోని పాడుతుంటిని, అందరు నాతోటి పాడుతుండె. ఇంతకీ నేను పుట్టిన ఊరు అప్పటి కరీంనగర్ జిల్లా రామగుండం దగ్గరి ఎగులాసపురం, మా అత్తగారి ఊరు వెల్గటూర్ దగ్గరి చెగ్గాం.
మా చిన్నప్పుడు చవితి పండుగ (వినాయక చవితి) అయిన తెల్లారి నుంచి బతుకమ్మ ఆట మొదలు పెట్టేది. ఇన్ని పూలు తెంపి సిబ్బి (వెదురు పుల్లలతో అల్లిన బుట్ట)ల పోసి మధ్యలో పెట్టుకొని చుట్టు తిరుగుకుంట పాటలు పాడేది. చీకటి పడకముందే ఆడపిల్లలంత ఒక్క చోటికి చేరేది. ఇగ ఆ రోజు మొదలు పెట్టి మళ్లీ సద్దుల బతుకమ్మ దాక… అంటే 35 రోజులు మేం అప్పట్ల బతుకమ్మ ఆడేటోళ్లం. అప్పుడు బతుకమ్మ అంటే ఎన్నో రోజుల సంబురం. మా అమ్మమ్మ వాళ్లది మంథని. అక్కడోళ్లకు బాగ పాటలస్తయ్. మా అమ్మ కూడ మంచిగనే పాడేది.
ఆమె దగ్గర కొన్ని నేర్చుకున్న. మా ఊళ్ల జంగాలోళ్లు, వీధి బాగోతులు, ఒగ్గు కథలు, హరి కథలు, బుర్ర కథలు చెప్పేటోళ్లు వచ్చి కథలు చెబుతుండె. అవ్వన్నీ వింటుంటిమి. ఇగ, విన్న కథలన్ని పాటలు కట్టి పాడుతుంటిని. మా చిన్నప్పుడు ఒక ముసలోడు మంచిగ పాడుతుండే. రోజుకు అరసోలుడు జొన్నలిత్తె పాటలు జెప్పేది. ఆయన ఎన్క మేం పాడుతుంటిమి. ఇంకో ముసలవ్వ కూడా వచ్చేది… గట్కకు జొన్నలిత్తే పాటలు జెప్పేది. అప్పుడు తిననీకి సరిపడ బువ్వెక్కడిది. ఇట్ల పాటలు జెప్పి ఇంత గట్క జేస్కొని తాగుతుండేటోళ్లు. అట్ల అందరి దగ్గర పాటలు నేర్చుకున్న.
ఎక్కడికి పోయిన పాటలు పాడిన. రామాయణం పాట, భారతం పాట, సతీ సావిత్రి పాట, అనసూయ పాట… ఇట్ల ఎన్నో పురాణాలు, కథలన్నింటిని పాటలు కట్టి పాడేది. బతుకమ్మ నెలకు పైన సాగేది కదా… పాటలు కూడా అట్లనే. రామాయణం పాట ఇయాల మొదలు పెడితే నెలంత సాగేది. కథ కదా… ఇయాల కొంత జెప్పుడు మళ్లీ రేపు పాడుడు… అట్ల రోజుల కొద్దీ పాటలు పాడుతుంటిమి. ఎల్లమ్మ పాట, మల్లన్న దేవుడి పాట, మల్లన్న దేవుడి పెండ్లి పాట, ఎములాడ రాజన్న పాట, ధర్మపురి నరసన్న పాట.. ఇట్ల మేం కొలిచే దేవుళ్లందరి కథలు పాటలు పాడుతుంటిని. అందుకే ఎన్ని పాటలస్తయ్యంటే లెక్కజెప్పలేను. వందలు వందలు పాడొచ్చు. మా అబ్బాయి సత్యనారాయణ కొన్ని పాటలు జెప్పిచ్చుకొని అందరికీ పనికస్తయ్యని పుస్తకమేయించిండు. నా ఇద్దరు బిడ్డలు కూడా ఈ పాటలు పాడుతరు. నీకేం పాట ఇష్టమని అడుగుతుంటరు… అన్ని పాటలు నాకిష్టమే. పాటంటేనే ఇష్టం.
బతుకమ్మ పండుగంటే నెల రోజుల ముందు మొదలు పెడుతుంటిమని జెప్పిన కదా. బతుకమ్మ పేర్చుడు మాత్రం ఇప్పటి లెక్కనే అమావాస్య రోజే మొదలు. బతుకమ్మలు పెట్టనీకి బాయి కూడా అవ్వాళనే తవ్వేటోళ్లం. ఇగ మా మామ కులపు పెద్ద. దాంతోని మా ఇంటి ముందే బాయి తవ్వి బతుకమ్మలు పెడుతుండె. అంటే గుండ్రంగా బాయి లెక్క తవ్వి, అందుల మధ్యల వెంపలి చెట్టు నాటి, చుట్టూ గద్దెల్కెక్క అలుకుదుము. ఆ గద్దెల మీద బతుకమ్మలు పెట్టుకుంటరు. అయితే ఒక ఏడాది నా బిడ్డ కొడుకు ఏడాది పిలగాడు సచ్చిపోయిండు. అదే ఏడాది అమ్మ కూడా దూరమైంది.
ఇగ, నా మనసు ఎట్లుంటది. ఆడబుద్ధి కాలె. బతుకమ్మ పేర్చబుద్ధి కాలే. సప్పుడు చేయక ఉన్నా. ఊళ్ల వాళ్లు ఆడుతరు గదా… సద్దుల బతుకమ్మ రోజు కూడా ఆట సప్పుడైతలేదు. ఇదేంది అని చూద్దును గదా… అందరు అక్కడ బతుకమ్మలు పెట్టుకొని ఉత్తగనే నిలవడ్డరు. ఏమైందంటే పాట చెప్పేటోళ్లు లేరన్నరు. ఇగ, కష్టమో నష్టమో ఏం చేస్త అనుకొని దేవుడికి మొక్కి పాట నేనే చెప్పిన. అట్ల మనసెట్లున్న బతుకమ్మ పాట మాత్రం విడువలే.
అప్పట్లో చప్పట్లు కొట్టుకుంట ఆటాడేది. ఇప్పుడేందో కొత్తగ కోలలచ్చినయి. మునుపు మన దగ్గర లేదు ఇది. సద్దుల బతుకమ్మ రోజు చిన్న బతుకమ్మను చేతిల పట్టుకొని పెద్ద బతుకమ్మకు పూలు, అక్షింతలు, పసుపు, కుంకుమ వేసుకుంట తిరిగేటోళ్లం. అప్పుడో పాట ఉంటది. గౌరమ్మ పాటలని ఉంటయి. బతుకమ్మలు చెరువులో కలిపేటప్పుడు పాట పాడుకునేటోళ్లం. అదో ఆనందం. ఇప్పుడు ఆడోళ్లు చెరువు దగ్గరికే పోతలేరు. ఇగ పాటలేడ. నాకు అఆలు కూడా రావు.
ఒక్క పుస్తకం గూడ చదవలే. కానీ బతుకమ్మ అంటే ఇష్టం. మంచిగ ఆడుకోవాల్నని ఎన్నో పాటలు నేర్చుకున్న. మరి ఇప్పుడు అందరు చదువుకున్నోళ్ల్లే. వందల పుస్తకాలు చదివినోళ్లే. పాడాల్ననుకుంటే రావానమ్మ! ఒక్క పాటన్న నేర్వకపోతే ఎట్ల తల్లి! పండుగంటే బతుకమ్మ జేస్తున్నరు. కొత్త చీరలు కడుతున్నరు. సొమ్ములేసుకుంటున్నరు. పాట మాత్రం పాడతలేరు. మైకుల పాటకు మనం ఆడుడేంది. ఆ దేవుడు నోరిచ్చిండు.. చేతులు కాళ్లిచ్చిండు. సక్కక పాడుకుంట ఆటాడాలె. లేకపోతే అదేం బతుకమ్మ సంబురం!! అయిన అట్ల ఏవో పాటలకు ఆడితే మనకు తరాల నుంచి వచ్చే పాటలు, ఆచారాలు ముందటోళ్లకు ఎట్ల తెలుస్తయ్ చెప్పుర్రి.
– లక్ష్మీహరిత ఇంద్రగంటి
– జి.భాస్కర్