‘దీర్ఘాయుష్మాన్ భవ’ అని దీవించకుండానే.. జపాన్‌వాసులు ఎక్కువకాలం జీవించేస్తున్నారు. మిగతా ప్రపంచంతో పోలిస్తే.. సగటున 20 ఏండ్లు అధికంగా బతుకుతున్నారు. అందులోనూ.. ‘ఒకినావా’ ద్వీప ప్రజలు మరింత ప్రత్యేకంగా నిలుస్తున్నారు. ఇక్కడ 100 ఏండ్లకు పైబడినవారు ఇంటికొకరు కనిపిస్తారు. ఆ వయసులోనూ ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. వీరి జీవనశైలిపై ఆహార – ఆరోగ్య నిపుణులు ఎన్నో ప్రయోగాలు, సర్వేలు నిర్వహించారు. ఒకినావా ప్రజల దీర్ఘాయువుకు వారి ఆహారపు అలవాట్లే ప్రధాన కారణమని గుర్తించారు. అయితే, ఒకినావా ప్రజల ఆహారాన్ని మన భారతీయ భోజనానికి అనుగుణంగా మార్చుకోవచ్చని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.
ఒకినావా ప్రజలు పోషకాలు ఎక్కువగా ఉండే కూరగాయలు, ఆకుకూరలతో కూడిన సమతుల ఆహారాన్ని తీసుకుంటారు. పండ్లు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చేపలు, బియ్యం, చిరుధాన్యాలు, టోఫు, సోయా, మిసోను కూడా భోజనంలో భాగం చేసుకుంటారు. ఇవన్నీ తక్కువ కొవ్వులు, తక్కువ చక్కెరలను కలిగి ఉండటంతోపాటు విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా అందిస్తాయి. వీటిలో ఆరోగ్యకరమైన కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫైబర్ ఎక్కువగా లభిస్తాయి. ఆహారంలో ఎక్కువ యాంటి ఆక్సిడెంట్లతో కూడిన పోషకాలు, తక్కువ కేలరీలు ఉండేలా చూసుకుంటారు. అందుకే, వాళ్లు వృద్ధాప్యంలోనూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపగలుగుతున్నారు. దీర్ఘకాల వ్యాధులు, గుండెజబ్బుల ముప్పు నుంచి తప్పించుకుంటున్నారు. తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్ ఉండే ఆహారం తీసుకోవడం వల్ల.. ఊబకాయ సమస్యలను ఊరవతలికి తరిమేస్తున్నారు.
భారతీయ వంటకాల్లో కొన్ని స్థానిక పదార్థాలను చేర్చడం ద్వారా.. ఒకినావా డైట్‌ను మనకు అనుగుణంగా మార్చుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. చిలగడదుంపలు, బంగాళాదుంపల వంటివి తక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలలో బచ్చలికూర, మెంతికూర, మునగాకు ఉండేలా చూసుకోవాలి. పొట్లకాయ, క్యారెట్, గుమ్మడికాయ వంటి కూరగాయలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. చిక్కుళ్లు, పప్పులతోపాటు సోయా ఉత్పత్తులనూ తీసుకోవాలి. బియ్యం, గోధుమకు బదులుగా.. బ్రౌన్ రైస్, చిరుధాన్యాలు (రాగులు, కొర్రలు, సజ్జలు), క్వినోవాకు ప్రాధాన్యం ఇవ్వాలి. వంటనూనెలను తక్కువగా వాడాలి.
ఆహార పదార్థాలు మార్చితే సరిపోదు.. ఆహార అలవాట్లనూ మార్చుకుంటేనే ఫలితం ఉంటుంది. ఇందుకోసం జపాన్వాసుల జీవనశైలిని అనుసరించాలి. ‘హరా హాచ్ బన్ మి’.. జపాన్‌లో సుప్రసిద్ధ సామెత. అంటే.. ‘ఆహారాన్ని తగిన మోతాదులోనే తినాలి’ అని అర్థం. కడుపులో 80 శాతం మాత్రమే నిండేలా ఆహారం తీసుకోవాలి. మిగతా 20 శాతం ఖాళీగా ఉంచాలి. అప్పుడే దీర్ఘాయువు పొందుతామని జపాన్‌వాసులు విశ్వసిస్తారు. అవసరమైన దానికంటే ఎక్కువ తినడం వల్ల కడుపుపై భారం పడుతుందని చెబుతారు.
ఇలాంటి ఆహారపు అలవాట్లతోపాటు సరైన జీవనశైలిని ఫాలో చేయడం వల్ల కొంతలో కొంతైనా మార్పు రావచ్చు. మనమూ ఆరోగ్యంగా ఉంటూ దీర్ఘాయువు సొంతం చేసుకోవచ్చు.