చాలామందికి నిద్రలేవగానే విపరీతమైన దాహం వేస్తుంది. దాంతో ముఖం కడుక్కున్న వెంటనే నీళ్లు తాగుతారు. అయితే, ఇలా దాహం వేయకున్నా.. రోజును నీరు తాగడంతో ప్రారంభించడం చాలామందికి అలవాటే! దీని వెనక ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను వైద్య నిపుణులు వివరిస్తున్నారు. నిద్రపోతున్న సమయంలో కూడా శరీరంలోని కొన్ని అవయవాలు పనిచేస్తూనే ఉంటాయి. దాంతోపాటు శ్వాస తీసుకోవడం, చెమట ద్వారా కూడా శరీరం నీటిని కోల్పోతుంది. ఫలితంగా నిద్రనుంచి మేల్కొన్న తర్వాత, నీరు తాగడం వల్ల.. శరీరం కోల్పోయిన ద్రవాలను తిరిగి పొందవచ్చు. ఇలా ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల జీవక్రియ మరింత మెరుగుపడుతుంది. ఈ ప్రభావాన్ని ‘థర్మోజెనిసిస్’గా వ్యవహరిస్తారు.
శరీరం నీటిని జీర్ణం చేసి, పీల్చుకునేటప్పుడు ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుందట. అంతేకాదు.. మూత్రపిండాలు మెరుగ్గా పనిచేయడానికి కూడా ఈ అలవాటు దోహదం చేస్తుంది. పరగడుపున నీళ్లు తాగడం వల్ల శరీరంలోని కాలుష్య కారకాలు ఎక్కువ మొత్తంలో బయటికి వెళ్లిపోతాయి. నిద్రలోనూ మెదడు పనిచేస్తూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే! దాంతో డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఫలితంగా, తలనొప్పి, ఏకాగ్రత దెబ్బతినడం, ఆసక్తి తగ్గిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అదే నిద్రలోంచి లేవగానే ఓ గ్లాసు నీళ్లు తాగితే.. మెదడు హైడ్రేటెడ్‌గా మారిపోతుంది. తలనొప్పి, అలసటకు.. తగినంత నీరు తాగకపోవడానికీ ప్రత్యక్ష సంబంధం ఉంటుందని పలు సర్వేల్లోనూ తేలింది.