చదివింది ప్రభుత్వ పాఠశాలలో.. అందుకే సర్కార్ బడులపై ఆమెకు ప్రేమ. అక్కడున్న విద్యార్థులకు ఏదో చేయాలనే తపన. ఆకలిగొన్న వారికి అన్నం పెట్టాలనే యోచన. బస్తీల్లో ఆనందం చూడాలన్న ఆకాంక్ష. ఈ మూడు లక్ష్యాలే తమిళనాడుకు చెందిన సారథ పిైళ్లెని సేవాబాటలోకి వచ్చేలా చేశాయి. కోడింగ్ జాబ్‌ను కాదని బస్తీవాసుల కేరింగ్ ముఖ్యమని భావించింది. ఉద్యోగానికి స్వస్తి పలికి.. హైదరాబాద్ బస్తీల్లోని పిల్లలకు అండగా నిలబడింది. ‘సెవన్ రేస్ ఫౌండేషన్’ నెలకొల్పి ఆ చిన్నారులకు విద్యాబుద్ధులు చెప్పిస్తున్నది. మహిళా సాధికారతకు కృషి చేస్తున్నది. దాతల సహకారంతో గల్లీ బతుకులను తీర్చిదిద్దుతున్న
‘సెవెన్ రేస్ ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలు డాక్టర్ సారథ పిైళ్లె జిందగీతో ముచ్చటించింది. ఆ విశేషాలు తన మాటల్లోనే..
మాది తమిళనాడులోని బూతపండి గ్రామం. మా నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడం వల్ల నా పాఠశాల చదువంతా ప్రభుత్వ పాఠశాలలోనే జరిగింది. ఎంసీఏ పూర్తి చేసిన నేను ఉద్యోగం కోసమని 2005లో హైదరాబాద్‌లో అడుగుపెట్టాను. టీ హబ్‌లో ఉద్యోగం చేస్తూనే సేవా కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. ఈ సమయంలోనే కొంతమంది అందించే సేవలు అర్హులకు చేరడం లేదని గ్రహించాను. నిజమైన నిరాశ్రయులకు తోడుగా నిలబడాలని నిర్ణయించుకొని ఉద్యోగానికి రాజీనామా చేశాను.
2016లో ‘సెవెన్ రేస్ ఫౌండేషన్’ ప్రారంభించాను. మొదట్లో ఇంట్లోనే వంట చేసుకొని, ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖాన, నిరాశ్రయుల కేంద్రాల్లో ఆహారం పంపిణీ చేస్తూ వచ్చాను. అలా ప్రతి రోజూ 400 మందికి ఆహారం అందించేదాన్ని. తర్వాత ప్రభుత్వ పాఠశాలలను బాగుచేయాలని నిర్ణయించుకొని మల్కాజిగిరి ప్రాంతంలో కొన్ని పాఠశాలలను సందర్శించాను. చాలా బడుల్లో కనీస అవసరాలు లేవనిపించింది. చదువుకునే రోజుల్లో నేను చూసిన సమస్యలే ఇంకా ఉండటం గ్రహించాను.

ఆలస్యం చేయకుండా మా సంస్థ తరఫున వాటర్ ట్యాంకులు కట్టించాను. మూత్రశాలలు నిర్మించాను. దాంతోపాటు ఏటా అందులోని విద్యార్థులకు నోట్‌బుక్స్, స్టేషనరీ, మెడికల్ కిట్లు అందించడం మొదలు పెట్టాను. ఇలా మొత్తం పది పాఠశాలలను బాగు చేశాను. ప్రభుత్వ పాఠశాలలంటే మంచి దృక్పథం కలిగేలా నా వంతు ప్రయత్నం చేశాను.

సర్కార్ బడుల్లో చదువుకునే వారంతా బస్తీవాసులు, పేద కుటుంబాలకు చెందినవారే ఉంటారు. మధ్యాహ్న భోజనం దొరుకుతుందని బడికి వచ్చే నిర్భాగ్యులనూ చూశాను. వారి దయనీయ పరిస్థితులు నన్ను బస్తీ బాట పట్టేలా చేశాయి. అక్కడ ఆ చిన్నారుల కుటుంబాలను చూసి బాధేసింది. ఎవరేమి చెప్పినా వింటారు కానీ, వాళ్ల హక్కుల గురించి మాత్రం ప్రశ్నించరు. దీనికి కారణం వారికి చదువులేకపోవడమే! అందుకే బస్తీ పిల్లల చదువు ఆగొద్దని భావించాను.

కరోనా సమయంలో ఇద్దరు పిల్లలకు పై చదువుల కోసమని ఆర్థిక సాయం చేశాను. ఇద్దరితో మొదలైన చేయూత నేడు 300 మందికి అందుతున్నది. ఇంటర్మీడియెట్, డిగ్రీ చదివే వరకు విద్యార్థులకు అండగా ఉంటూ, ఆర్థిక సహకారం అందిస్తున్నాను. ఇక కరోనా కాలంలో బస్తీవాసుల పరిస్థితి దారుణంగా ఉండేది. చేతిలో పని ఉండకపోయేది. కరోనా గురించి అవగాహనా అంతంత మాత్రమే! ఆ ప్రాంతాలకు అధికారులు కూడా అంతగా వచ్చేవారు కాదు! ఈ క్రమంలో పలు బస్తీల్లో మా సంస్థ నుంచి దాదాపు ముప్పై వేల వరకు కొవిడ్ కిట్లు అందించాం. దీంతోపాటు నిత్యావసరాలు కూడా పంపిణీ చేశాం.
ఇలా బస్తీల్లో నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న తరుణంలో సైదాబాద్ సమీపంలోని సింగరేణి కాలనీలో చాలామంది పిల్లలు చదువుకు దూరంగా ఉన్నారన్న సంగతి తెలిసింది. వారికి ప్రాథమిక విద్యను అందించాలని భావించి సాక్షర్ పేరుతో 6 సెంటర్లు ఏర్పాటు చేశాం. సుమారు 500 మందికి ఉచిత విద్యను అందిస్తున్నాం. అలా కొంతమంది ఓపెన్ స్కూలింగ్‌లో పదో తరగతి పరీక్షలు రాసి, పైచదువులకు వెళ్లారు. ఇప్పుడు ఆ బస్తీలో అందరు పిల్లలూ చదువుతున్నారు. మరోవైపు దివ్యాంగ మహిళల సాధికారత కోసం 354 మందికి టైలరింగ్ నేర్పించి, కుట్టుమిషిన్లు అందించాం. మరికొంత మంది ముందుకు రావడంతో టైలరింగ్ సెంటర్ నెలకొల్పి ఉచితంగా శిక్షణ అందిస్తున్నాం.
మా సంస్థ సేవా కార్యక్రమాల్ని కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయలేదు. అవసరం ఉన్నచోటల్లా సాయం అందిస్తున్నాం. ఉద్యోగం వదులుకోవద్దని ఇంట్లో వాళ్లు చెప్పినా అప్పుడు వినలేదు. ప్రస్తుతం మా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి మావాళ్లు గర్వపడుతున్నారు. ఈ సంస్థను ప్రారంభించింది నేనే అయినా ఈ కార్యక్రమాలను తమవంతుగా సహకరించేవారే దీనికి అసలైన అంబాసిడర్లు. ప్రారంభంలో కొత్త ప్రాంతం, పైగా తెలుగు రాదు. కాబట్టి చాలా ఇబ్బంది పడ్డాను. అయినా కూడా అందరి సహకారంతో సేవా కార్యక్రమాలు ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు సాగుతున్నాయి.
మా సంస్థకు పలు అవార్డులూ వచ్చాయి. అయితే అవి అందుకున్నప్పుడు కలిగే ఆనందం కన్నా.. పిల్లల ముఖాల్లో సంతోషం చూసినప్పుడు ఎక్కువ ఆనందం కలుగుతుంది. ఏవైనా వస్తువులు పంచినప్పుడు ఆ పిల్లలు గట్టిగా వాటేసుకున్నప్పుడు కలిగే అనుభూతిని మాటల్లో చెప్పలేను. హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో ఏదైనా కంపెనీ పెట్టాలనుకున్నాను. కానీ, స్వచ్ఛంద సంస్థ నెలకొల్పాను. మా సంస్థ సేవలను మరింత విస్తరించాలన్నదే నా లక్ష్యం.
– రాజు పిల్లనగోయిన