నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టేస్తుందని నానుడి. ఈ డిజిటల్ యుగంలో అబద్ధం రోడ్డెక్కక ముందే.. పుకార్లు సోషల్ మీడియాలో కోడై కూస్తున్నాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో అసత్యాలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఏ కాస్త ఏమరుపాటుగా ఉన్నా దేశానికి ద్రోహం చేసినవాళ్లు అవుతారు.
భావోద్వేగాలు రెచ్చగొట్టే పోస్టులు చేయకుండా ఉండటం ఉత్తమం. సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న సైనికులపై అవాకులు చెవాకులూ పేలడం నైతికత అనిపించుకోదు. పైగా, డిజిటల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా సబబు కాదు. ముఖ్యంగా ఈ పరిస్థితులు యుద్ధానికి దారితీస్తే మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరి.