విరాట్, అనుష్కాశర్మ ఫిట్‌నెస్‌పై ఏదైనా పోస్ట్ పెడితే చాలు.. కోట్లల్లో వ్యూస్, లక్షల్లో కామెంట్స్ వచ్చిపడతాయి. వాళ్లు సెలెబ్రిటీలే కావొచ్చు! అంతకన్నా.. వాళ్లలా నాజూకుగా ఉండాలని అందరి తపన. ఫిట్‌నెస్‌ని కాపాడుకోవడం కోసం వాళ్లిద్దరూ ఏం చేస్తున్నారా? అనే కుతూహలం!! కానీ, ఎంతమంది కపుల్స్ విరుష్క జంటలా కలిసి కసరత్తులు చేస్తున్నారు? కలిసి జీవితం పంచుకుంటున్న ఆలుమగలు ఒక్కటిగా ఫిట్నెస్ కాపాడుకోవడంపై ఎందుకు దృష్టిసారించడం లేదు? సంసారం సరదాగా సాగాలన్నా, దాంపత్య సుఖం పరిపూర్ణంగా అనుభవించాలన్నా.. మీరు ఫిటో కపుల్స్ (fitouples) జాబితాలో చేరిపోవాల్సిందే! అదేనండి.. ఫిట్ కపుల్స్ అన్నమాట. ఇప్పుడిదో కొత్త ట్రెండ్. ‘లవ్.. స్వెట్.. రిప్స్’ అంటూ రిలేషన్షిప్ గోల్స్‌ని కొత్తగా సెట్ చేసుకుంటున్నారు. భాగస్వామితో కలిసి వర్కవుట్స్ చేస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించుకునేందుకు ట్రెండీగా ముందుకొస్తున్నారు!!
భర్త ఫిట్నెస్ ఫ్రీక్ అయితే.. కచ్చితంగా భార్య కూడా అలానే ఉండాలని కోరుకోవడం సహజం. నాజూగ్గా ఉన్న భార్య.. తన భర్త పొట్టలేకుండా ఫిట్‌గా ఉండాలని అనుకోవడమూ కామనే! కానీ, భాగస్వామి అందుకు విరుద్ధంగా ఉంటే? పార్ట్నర్ నిరాశ చెందకుండా ఉండలేరు. నేటి తరం తమ మధ్య ఇలాంటి గ్యాప్ రావొద్దని కోరుకుంటున్నది. పెళ్లయి ఏండ్లు గడుస్తున్నా.. పిల్లలు పుట్టినా ఫర్వాలేదు.. ‘లెట్స్ ఫిట్ టుగెదర్’ అంటూ పార్ట్నర్కి చాలెంజ్ చేస్తున్నారు. సెలెబ్రిటీలే కాదు.. మనం ఎందుకు ఫిట్నెస్ ఫ్రీక్స్‌గా ఉండకూడదని సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. జంటలుగా జిమ్ అనుభవాల్ని పంచుకుంటున్నారు. తమ భాగస్వామి ఫిట్‌గా ఉండాలని కోరుకుంటూనే.. తామూ హాట్‌గా కనిపించేందుకు మగువలు ఆసక్తి చూపుతున్నారు.
రిలేషన్లో ఉన్నా.. పెళ్లి చేసుకున్నా… ఇరువురికీ కామన్‌గా కొన్ని గోల్స్ ఉంటాయి. సేవింగ్స్ చేయాలి.. కారు కొనుక్కోవాలి.. అవుట్ డోర్ ట్రిప్ వెళ్లాలి.. ఇలా భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. ఇప్పుడీ ప్లానింగ్‌లో ‘ఫిట్నెస్’ కూడా ప్రధానాంశంగా మారింది. ఈ నెలలో ఇన్ని కిలోలు తగ్గాలంటూ ‘చెక్ లిస్ట్’ పెట్టుకుంటున్నాయి యంగ్ కపుల్స్. ఇన్ని కేలరీలు తగ్గించాలని.. భాగస్వామితో పోటీ పడుతున్నారు. ‘రిలేషన్షిప్ గోల్స్’లో తగ్గేదే లేదంటూ భర్తని ప్రోత్సహిస్తూ.. కంప్లీట్ ఉమెన్‌గా సంతృప్తికరమైన జీవనశైలిని అలవర్చుకుంటున్నారు మహిళలు. ఇదే విషయంపై ఫిట్నెస్ నిపుణులు ఏం చెబుతున్నారంటే.. ‘కపుల్స్ కలిసి వర్క్‌వుట్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య చక్కని అవగాహన ఏర్పడుతుంది. కొత్త ప్రేమ చిగురిస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకునే వైఖరి కూడా అలవడుతుంది. అంతేకాదు. ఆడుతూపాడుతూ కసరత్తులు చేసే క్రమంలో జరిగే టచ్చింగులు హగ్గింగులకు దారితీస్తాయి, తద్వారా కొత్త అను‘రాగం’ పల్లవిస్తుందని’ విశ్లేషిస్తున్నారు.
జంటలు కలిసి వ్యాయామం చేయడం ద్వారా ఎండార్ఫిన్, డోపమైన్ లాంటి హార్మోన్లు విడుదల అవుతాయి. కలిసి ఎక్సర్సైజులు చేసే క్రమంలో అడ్రినల్ గ్రంథి ప్రేరేపిత మవుతుంది. ఆ సమయంలో కలిగే మూడ్స్‌ను రోజంతా ఉంచుతుంది. అంతేకాదు కలిసి చేసే సాధనలు.. జ్ఞాపకశక్తిని కూడా పెంచుతాయని సైకోథెరపిస్టులు చెబుతున్నారు.
నయా జనరేషన్ రిలేషన్లో ఉన్నా, మూడుముళ్లతో ఒక్కటైనా.. కొంతకాలానికే ఒకరికొకరు బోర్ కొట్టేస్తున్నారు. దానికి కారణం రొటీన్ లైఫ్! ఈ రోజుల్లో ఆలుమగలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండటంతో.. ప్రైవసీకి పెద్ద ఆపదొచ్చిపడింది. యాంత్రికంగా బతికేస్తున్నారు. భార్య కౌగిలి కోరుకున్న భర్త వారాంతం వరకు వెయిట్ చేయాల్సి వస్తున్నది. భర్త ముద్దు ఆశించే భార్య పరిస్థితీ అలాగే ఉంటున్నది. ఈ ఎడబాటుకు విరుగుడు జంటగా ఫిట్నెస్ మంత్రాన్ని ఉపాసించడమే! ఓ అరగంట ఇద్దరూ కలిసి కసరత్తులు చేస్తే రోజంతా కిక్ వస్తుంది. గదిలో ఓ మూలన ఉన్న ట్రెడ్‌మిల్‌పై చెమటలు కక్కేలా పరుగులు తీస్తే శారీరకంగా సత్తువ వస్తుందంతే! అదే అరగంట పార్ట్నర్తో కలిసి జాలీగా జాగింగ్ చేస్తే ఒక్క టికెట్ మీద రెండు హిట్ సినిమాలు చూసిన అనుభూతి కలుగుతుంది. వర్కవుట్స్ చేసే క్రమంలో మాటల్లో చెప్పలేని మతలబులెన్నో అసంకల్పితంగా జరిగిపోతాయి. భార్య పుష్ అప్స్ చేస్తుంటే.. భర్త ఆమెకు సపోర్ట్ చేస్తాడు. భర్త బస్కీలు తీస్తుంటే.. భార్య అతగాడి భుజాలపై చేతులేసి లేవదీసే సీను.. రకరకాల పాజిటివ్ హార్మోన్స్‌ను పుట్టిస్తుంది. ఇలా రోజుకో గంటపాటు వ్యాయామ పర్వం సలపగలిగితే.. అనారోగ్యం సలుపుడు ఉండదు.
పెండ్లయిపోయింది… జాబ్ చేస్తున్నాం.. పిల్లలు కూడా పుట్టేశారు… ఇంకా మనం స్లిమ్‌గా, ఫిట్‌గా ఉండి చేసేదేముంది? అని నిన్నటి తరం ఆలోచనకు స్వస్తి పలకండి. మారుతున్న కాలానికి తగ్గట్టు అప్డేట్ అవ్వాలి. ఫిట్నెస్ విషయంలో మీ పిల్లలకు స్ఫూర్తిగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండటంతోపాటు ఫిట్‌గా కనిపించడం కూడా ఈ రోజుల్లో చాలా అవసరం. కార్పొరేట్ కొలువుల్లో అంచెలంచెలుగా ఎదగాలంటే తెలివితేటలు మాత్రమే ఉంటే సరిపోదు. ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలంటే శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండాలి. పెద్ద పదవి వచ్చేనాటికి ‘నా ఒంట్లో శక్తి లేద’ని కుదేలైతే.. ఇన్నాళ్ల సక్సెస్ఫుల్ కెరీర్‌కు ఫుల్స్టాప్ పడ్డట్టే! అలా కాకూడదూ అంటే.. ఫిట్నెస్ పెంపొందించుకోవడం ఒక్కటే మార్గం! ఒంటరిగా చేసే భారీ కసరత్తుల కన్నా, జంటగా చేసే చిన్నచిన్న వర్కవుట్లు ఎక్కువగా వర్కవుట్ అవుతాయని నిపుణుల మాట! మరెందుకు ఆలస్యం.. కపుల్ వర్కవుట్స్‌కు ఇవాళ్టి నుంచే శ్రీకారం చుట్టండి.
తన పవర్ఫుల్ షాట్స్‌తో విరాట్.. చక్కని నటనతో అనుష్క.. ఇరువురూ కలిసి చేస్తున్న ప్రయాణం కపుల్స్‌కి ఎంతో ప్రేరణ. అందుకే వారికి కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో వారేం పోస్ట్ చేసినా… క్షణాల్లో ట్రెండింగ్‌గా మారిపోతుంది. ముఖ్యంగా వాళ్లు చెప్పే ఫిట్నెస్ చిట్కాలకు తిరుగులేదు. జిమ్‌కు వెళ్లినా కలిసే వెళ్తారిద్దరూ. యోగాసనాలు కూడా కలిసే వేస్తారట. దీనివల్ల తామెంతో ఫ్రెష్‌గా, సంతోషంగా ఉన్నామని అనుష్క చెప్పుకొచ్చింది. ఇదే విషయాన్ని విరాట్ కూడా తన సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నా సరే.. ఇద్దరూ కలిసి సైక్లింగ్, రన్నింగ్, వర్కవుట్లు చేయడం ఎంతో హాయినిస్తుందన్న విరుష్క చిట్కాలు ఆచరించదగ్గవి.