ఒకటి, రెండు, మూడు.. ఎనిమిది, తొమ్మిది – నెలలునిండుతున్నకొద్దీ కాబోయే తల్లిని ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఆ కీలక సమయంలో తనను తాను కాపాడుకోవాలి, బిడ్డనూ రక్షించుకోవాలి. ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా పెద్ద ప్రాణానికి కష్టం, చిన్న ప్రాణానికి గండం. అందులోనూ మారుమూల ప్రాంతాల్లో..సరైన వైద్య సౌకర్యం ఉండదు. ఏ సమస్య వచ్చినా ఎగుడుదిగుడు దారిలో మైళ్ల దూరం ప్రయాణించాలి. గమ్యానికి చేరేలోపే ఏమైనా జరగవచ్చు. గర్భిణులను ఆ ప్రసవ గండం నుంచి గట్టెక్కించేందుకు ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం ప్రారంభించిన ఓ కార్యక్రమం నాలుగున్నరేండ్లలో ఐదువేల మంది
అమ్మలకు భరోసా ఇచ్చింది.
ఒక్క పిలుపు చాలు. వైద్య సిబ్బంది వెంటనే స్పందిస్తారు. సమస్య మూలాలు తెలుసుకుంటారు. సమాచారాన్ని విశ్లేషిస్తారు. తగిన సలహాలు ఇస్తారు. నిండు గర్భిణికి అండగా నిలుస్తారు. అవసరమైతే అంబులెన్స్ పంపుతారు. సురక్షితమైన డెలివరీ తర్వాత.. బాలింత చేతికి బంగారుకొండను అందిస్తారు.
ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో గర్భిణులకు ప్రసవ సమయంలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా.. అధికారులు ఓ వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో ‘తల్లి పిలుపు’ పేరుతో ప్రత్యేకించి ఓ కాల్‌సెంటర్ ఏర్పాటు చేశారు.
జిల్లాలోని ప్రతి గర్భిణి ఆరోగ్య సమాచారమూ ఇక్కడ నమోదు అవుతుంది. నవమాసాల ప్రగతి నివేదిక కూడా సిద్ధంగా ఉంటుంది. ఆ డేటా ఆధారంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారి పట్ల మరింత శ్రద్ధ తీసుకుంటారు. నాలుగున్నరేండ్ల క్రితం.. మహిళా దినోత్సవం రోజున ప్రారంభమైన ‘తల్లి పిలుపు’ ఇప్పటి వరకూ ఐదువేల మంది గర్భిణులకు సాయం అందించింది. సురక్షితమైన ప్రసూతికి భరోసా ఇచ్చింది.
గిరిజన ప్రాంతాల్లో పోషక విలువల లోపం ఎక్కువ. గర్భిణులలో రక్తహీనత సర్వ సాధారణం. దీంతో ప్రసవ సమయంలో రక్తం కొరత తీవ్రంగా వేధిస్తుంది. కొన్నిసార్లు పరిస్థితి ప్రాణాంతకంగానూ మారుతుంది. పురిటి నొప్పుల సమయంలో గర్భిణులు ఈ సమస్యను అధిగమించేలా ‘తల్లి పిలుపు’ తొలి నుంచే చర్యలు తీసుకుంటుంది. కాబట్టే, ఈ నాలుగున్నర సంవత్సరాల్లో 900 మందికి సకాలంలో రక్తం అందింది. అంతేకాదు.. ఐరన్ లోపం, అధిక రక్తపోటు తదితర సమస్యలు కాబోయే తల్లిని తీవ్రంగా వేధిస్తాయి. పొట్టలోని బిడ్డ ఎదుగుదలను తెలుసుకోవాలన్నా, లోపాలను గుర్తించి తగిన చికిత్స అందించాలన్నా.. స్కానింగ్ తప్పనిసరి. కానీ, మారుమూల ప్రజలకు ఆ ఆధునిక సౌకర్యం అందని పండే. ఫలితంగా, ప్రసూతి మరణాల రేటు ఎక్కువగా ఉండేది. తల్లి పిలుపు రాకతో పరిస్థితి మారిపోయింది. కాబోయే తల్లులు 3,5,7,9 నెలల్లో స్కానింగ్ చేయించుకునేలా కాల్‌సెంటర్ సిబ్బంది ప్రోత్సహిస్తారు. ప్రాణాలను నిలబెట్టే టీకాల గురించీ వారికి తెలియజేస్తారు. హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారికి రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. రిమ్స్ బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తం అందేలా చర్యలు తీసుకుంటారు.
‘తల్లి పిలుపు’ విభాగంలో ఐదుగురు సిబ్బంది ఉంటారు. గర్భిణుల వివరాలను ఫోన్ నంబరు సహా.. నమోదు చేసు కుంటారు. వారానికోసారి కాబోయే అమ్మలకు ఫోన్ చేసి గర్భిణి నేపథ్యాన్ని బట్టి.. తెలుగు, హిందీ, మరాఠీ, గోండి భాషల్లో యోగక్షేమాలు తెలుసుకుంటారు. దగ్గర్లోని సర్కారు ఆసుపత్రుల వివరాలను తెలియజేస్తారు. క్రమం తప్పకుండా హిమోగ్లోబిన్, థైరాయిడ్, బీపీ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రభుత్వం ఇప్పటికే ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా గర్భిణులు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందిస్తున్నది. ఆ విషయాన్ని కూడా కాల్‌సెంటర్ సిబ్బంది వివరిస్తారు. ఫలితంగా బిడ్డలకు పుష్కలంగా తల్లిపాలు అందుతాయి. గర్భిణులు నేరుగా కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
‘తల్లి పిలుపు’ ఎన్నో ప్రాణాలు నిలబెట్టింది. మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గాయని వైద్యాధికారులు అంగీకరించారు. రవాణా సమస్యలు సరిగాలేని మారుమూల గ్రామాల్లోని నిండు గర్భిణులను ప్రసవానికి పదిరోజుల ముందుగానే దవాఖానలో చేరేలా ఒప్పిస్తున్నారు. అవసరమైతే తక్షణ వైద్యం కోసం 102, 108 అంబులెన్స్‌ల ద్వారా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ‘ప్రతి గర్భిణిని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. పండంటి బిడ్డను చేతిలో పెట్టి సురక్షితంగా ఇంటికి పంపుతాం’ అంటారు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నరేందర్ రాథోడ్. సౌకర్యాల లేమి, పేదరికం కారణంగా ఏ ఒక్క శిశువూ అల్పాయువుతో మరణించకూడదు. ఆ సంకల్పమే ‘తల్లి పిలుపు’ దిశగా అడుగులు వేయించింది. ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం దేశానికి ఇస్తున్న కొత్త పిలుపు ఇది!
భాకే రఘునాథ్‌రావు