ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే.. డైపర్లు వాడటం తప్పనిసరిగా మారింది. అయితే, వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇది.. చిన్నారుల్లో ర్యాషెస్ రావడానికి కారణం అవుతుంది. ముఖ్యంగా, సున్నితమైన చర్మం, 24 గంటలూ డైపర్లు వాడే పిల్లల్ని ఈ సమస్య అధికంగా వేధిస్తుంది. కొన్ని ఇంటి చిట్కాలతోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. పిల్లల చర్మాన్ని పొడిగా ఉంచడం ముఖ్యం. అందుకే, వారు టాయిలెట్ చేసిన వెంటనే.. డైపర్‌ను మార్చేయాలి.
మూత్ర విసర్జన చేసినా, చేయకపోయినా.. ప్రతి రెండుమూడు గంటలకు ఒకసారి డైపర్ మార్చడం మంచి పద్ధతి. ఇక డైపర్‌ను మార్చేటప్పుడు.. గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి. సున్నితమైన కాటన్‌తో తుడిచి.. శరీర అవయవాలకు గాలి తగిలేలా కాసేపు అలాగే వదిలేయాలి. చర్మం పూర్తిగా పొడిబారిన తర్వాతే కొత్త డైపర్ వేయాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కొన్నిసార్లు తడి వల్ల, వాతావరణంలోని తేమ వల్ల కూడా పిల్లలకు ర్యాషెస్ రావొచ్చు. అలాంటప్పుడు ఆయా ప్రదేశాల్లో కొబ్బరి నూనెను రాస్తే.. మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి నూనెలో పోషకాలు, యాంటి మైక్రోబియల్ గుణాలు పుష్కలం.
ఇవి డైపర్ వల్ల వచ్చే దద్దుర్లు, చికాకును తగ్గించడంలో సాయపడతాయి. మంట, దురద, అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. కొబ్బరి నూనెతోపాటు వాజిలిన్ ఉపయోగించినా మంచిదే! సమస్య మరీ ఎక్కువగా ఉంటే.. పిల్లల వైద్యులను సంప్రదించడం ఉత్తమం. వారు సిఫారసు చేసే బేబీ ర్యాష్ క్రీమ్స్తోనూ చిన్నారులకు ఉపశమనం కలుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైన సూచన.. పిల్లలను 24 గంటలూ డైపర్‌తో ఉంచడం మంచిదికాదు. రోజులో కొన్ని గంటలైనా.. వారిని డైపర్ లేకుండా ఉంచాలి.