నా వయసు పద్దెనిమిది. డిగ్రీ చదువుతున్నా. నా ఎత్తు నాలుగున్నర అడుగులే. దీంతో నన్ను అందరూ ‘పొట్టి’ అని ఎగతాళి చేస్తున్నారు. చిన్నప్పుడు ఏమంత ఇబ్బందిగా అనిపించేది కాదు. కానీ, కాలేజ్‌కి వచ్చాక తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నాను. చదువుపై ధ్యాస ఉండటం లేదు. ఎత్తు పెరిగేందుకు మందులు ఉన్నాయని ఓ స్నేహితురాలు చెప్పింది. నిజమేనా?
– ఓ సోదరి
ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసం చాలా అవసరం. మనోబలంతోనే సమస్యలను అధిగమించగలం. యుక్తవయసుకు వచ్చేసరికి యువతీయువకుల పెరుగుదల మందగిస్తుంది. పోషకాహారం, కుటుంబ చరిత్ర, శారీరక శ్రమ.. తదితర అంశాలు మన ఎత్తును నిర్ధారిస్తాయి. ఆరోగ్యపరమైన కారణాల వల్ల కూడా ఓ దశలో పెరుగుదల ఆగిపోవచ్చు. వెంటనే, నిపుణులను సంప్రదించండి. కృత్రిమంగా ఎత్తును పెంచుకునే మార్గాలు కానీ, ఔషధాలు కానీ దాదాపుగా లేవు. ఉన్నా.. దుష్ఫలితాలే అధికం. నిజానికి లావు, సన్నం, ఎత్తు, పొట్టి.. ఇవన్నీ చిన్నచిన్న విషయాలు. భూమికి ఐదడుగుల ఎత్తు లేకపోయినా.. ప్రపంచ ప్రసిద్ధులైనవారు ఎంతోమంది. ఆ విజేతలను స్ఫూర్తిగా తీసుకోండి. ఇవాళ మిమ్మల్ని చూసి నవ్వినవారే.. రేపు మీకు అపార గౌరవం ఇస్తారు. చదువుపై దృష్టిపెట్టాల్సిన సమయమిది. లక్ష్యంపైనే ఫోకస్ చేయండి.