ఎంత డైట్ చేసినా, వ్యాయామం చేసినా బరువు తగ్గడం లేదని బాధపడుతున్నారా? అయితే మీ సమస్యకు పరిష్కారం మీ డీఎన్ఏలోనే ఉండొచ్చు! అయితే, ఏం చేయాలి? ఏముందీ.. ఇప్పుడు కొత్తగా ‘డీఎన్ఏ డైట్’ ట్రెండ్ మొదలైంది. ఇది మీ శరీరానికి ఏది సరిపోతుందో? ఏది సరిపోదో? మీ జన్యువుల ఆధారంగా చెబుతుంది.
ఫిట్నెస్ ఫ్రీక్స్‌కి మాత్రమే కాదు.. ఈ మధ్య అందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. చాలామంది రకరకాల డైట్లు ఫాలో అవుతున్నారు. వ్యాయామాలు చేస్తున్నారు. ఎక్కువ గంటలు తిండి మానేయడం (intermittent fasting) నుంచి కీటో డైట్ వరకు అన్నీ తెగ ప్రయత్నించేస్తున్నారు. అయినా కొంతమందిలో మాత్రం ఫలితం కనిపించదు. ఇలాంటి వారిని డీఎన్ఏ డైట్ ట్రై చేయమని చెబుతున్నారు నిపుణులు. జన్యువుల స్వభావం ఆధారంగా మన శరీరానికి ఏది మంచిదో, ఏది కాదో ఆహార ప్రణాళిక రూపొందిస్తారు. అంటే, మీ కోసం ప్రత్యేకంగా మీ జన్యువులే మెనూ సూచిస్తాయన్నమాట. శరీరంలో ఏయే పోషకాలు తక్కువగా ఉన్నాయి.. ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, కొవ్వు.. మొదలైనవాటిని మీ శరీరం ఎలా జీర్ణం చేసుకుంటుంది లాంటి విషయాలను ఇది మీకు తెలియజేస్తుంది. దీన్ని శాస్త్ర పరిభాషలో న్యూట్రిజెనోమిక్స్ అంటున్నారు.
డైట్ ఫాలో అవ్వాలనుకునే వ్యక్తి ఉమ్మి నమూనాను సలైవా కలెక్షన్ కిట్‌తో సేకరించి ల్యాబ్‌లో మెషిన్లతో ప్రాసెస్ చేస్తారు. జన్యుపరమైన డేటా ఆధారంగా, న్యూట్రిజెనోమిక్స్ ప్రొఫైల్‌ను తయారుచేస్తారు. ఇందులో ఏ ఆహారాలను తినకూడదు, ఏ పదార్థాలు ఈ వ్యక్తికి బాగా పనిచేస్తాయి లాంటి డైట్ వివరాలు ఉంటాయి. మీ జీవనశైలి, ప్రస్తుత ఆహార అలవాట్లు, కుటుంబ చరిత్ర, శారీరక శ్రమ తదితర విషయాలు కూడా సేకరిస్తారు. ఒక జెనెటిక్ కౌన్సెలర్ దీనికి మార్గనిర్దేశం చేస్తారు. ఆపై ఒక న్యూట్రిషనిస్ట్ ఈ వివరాల ఆధారంగా మీకు ప్రత్యేకమైన డైట్ ప్లాన్‌ను సూచిస్తారు.
డీఎన్ఏ డైట్‌ను వెల్నెస్ పరిశ్రమలో ఒక శాస్త్రీయ విధానంగా చెబుతున్నారు నిపుణులు. ఇది మీ శరీరం లక్షణాలను డీ కోడ్ చేస్తుంది. మీ శరీరంలోని గ్లూకోజ్ స్థాయులు, కాలేయం, గుండె పనితీరు వాటికి సంబంధించిన సమస్యలను అంచనావేసి డైట్ ప్లాన్ సూచిస్తుంది. ఫిట్‌నెస్‌పై ఆసక్తి ఉన్న యువత.. ముఖ్యంగా మిలీనియల్స్, జెన్-జీ ఈ డీఎన్ఏ డైట్‌ను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. గుండె జబ్బులు, మధుమేహం లాంటి రుగ్మతలకు సంబంధించి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారు కూడా డీఎన్ఏ డైట్‌ను ఆశ్రయిస్తున్నారు. మెట్రో సిటీస్‌లో ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ నయా డైట్ విధానాన్ని చాలామంది స్వాగతిస్తున్నారు కూడా!