మా పిల్లవాడి వయసు ఆరు సంవత్సరాలు. కొంచెం నీరసంగా ఉంటున్నాడని డాక్టర్‌ను సంప్రదించాం. విటమిన్ డి, థైరాయిడ్, రక్త పరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో విటమిన్ డి చాలా తక్కువగా ఉందని తేలింది. విటమిన్-డి, కాల్షియం థెరపీ ఇచ్చారు. ఆ సమయంలో విటమిన్-డి గురించి తెలుసుకునే క్రమంలో.. పిల్లల్లో ఈ విటమిన్ లోపిస్తే కాళ్లు చేతులు వంకర పోవచ్చని ఒకచోట చదివాను. విటమిన్-డి లోపం అంత ప్రమాదకరమా? మా బాబుకు కాళ్లు చేతులు వంకర్లు పోయే ప్రమాదం ఉందా?
విటమిన్-డి లోపం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యే. విటమిన్- డి లోపం పిల్లలు, పెద్దల్లో సాధారణంగా కనిపించేదే. ఈ విటమిన్ లోపిస్తే ఎముకల్లో కాల్షియం సాంద్రత తగ్గుతుంది. అందువల్ల ఎముకల పటుత్వం కూడా తగ్గుతుంది. ఇక విటమిన్ డి లోపంతోపాటు రక్తంలో కాల్షియం లోపం కూడా సుదీర్ఘకాలంగా ఉన్నట్టయితే రికెట్స్ వ్యాధి బారినపడతారు. రికెట్స్ వ్యాధిగ్రస్తుల్లో ఎముకలు ఆకారాన్ని కోల్పోతాయి. వంకర్లు పోతాయి. ఆ లక్షణాలు మీ బిడ్డకు లేవు. ఒకవేళ ఉన్నా రికెట్స్ వ్యాధికి చికిత్స ఉంది.
విటమిన్- డి ఎముకల్లో కాల్షియం, ఫాస్పరస్ లవణాల సమతుల్యతను కాపాడుతుంది. ఎముకలు సరిగా ఎదగడానికి, బలంగా ఉండటానికి విటమిన్- డి దోహదం చేస్తుంది. ఎక్కువసేపు ఆరుబయట ఉదయపు నీరెండలో గడపకపోవడం, ఆటలు ఆడకపోవడం, విటమిన్ డి సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ లోపం తలెత్తుతుంది. ఈ రోజుల్లో పుట్టిన పిల్లలకు ఏడాదిలోపు విటమిన్- డి తగినంతగా తప్పనిసరిగా అందేలా చూడాలని చాలామంది డాక్టర్లు సూచిస్తున్నారు. విటమిన్- డి లోపం తలెత్తకుండా ఉండాలంటే పిల్లలను ఆరుబయట ఆటలు ఆడించాలి. అప్పుడు కూడా శరీరంపై సూర్యరశ్మి పడేలా చూసుకోవాలి. ఎండలో తగినంతగా గడిపితేనే మన శరీరం విటమిన్ డి తయారు చేసుకుంటుంది. పుట్టగొడుగులు, చేపలు, గుడ్డుసొన, కొన్నిరకాల రసాలు, ఓట్స్‌లో విటమిన్- డి పుష్కలంగా దొరుకుతుంది.
– డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్