గుసగుసలు పెట్టడంలో ఆడవాళ్లదే పైచేయి. పక్కవారికి ఏమాత్రం వినిపించకుండా.. వీళ్ల మాటలు సాగుతుంటాయి. ఎంత చిన్నగా మాట్లాడినా.. తోటి మహిళకు స్పష్టంగా వినిపిస్తాయి. మహిళల వినికిడి శక్తి ఎక్కువగా ఉండటమే దీనికి కారణమని తాజా పరిశోధన ఒకటి వెల్లడించింది. ఆడవాళ్లతో పోలిస్తే.. పురుషుల వినికిడి శక్తి తక్కువగా ఉంటుందని సదరు సర్వే తేల్చింది. ఇందుకు సంబంధించిన జీవసంబంధమైన వ్యత్యాసాన్ని.. ఈ అధ్యయనం హైలైట్ చేస్తున్నది. సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం.. ఏ శబ్దాన్నయినా పురుషులు – మహిళలు భిన్నంగా వింటారట. వయసు, స్థానికతతో సంబంధం లేకుండా.. పురుషుల కంటే మహిళలే మెరుగైన వినికిడి సామర్థ్యాన్ని కలిగి ఉంటారట. మహిళలు సగటున రెండు డెసిబెల్స్ స్పష్టమైన తేడాతో మెరుగైన వినికిడి శక్తిని కలిగి ఉంటారని పరిశోధకులు తేల్చారు. ఇందుకోసం ఐదు దేశాలలోని 13 విభిన్న సమూహాల నుంచి 448 మంది వినికిడి సామర్థ్యాన్ని పరిశీలించారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాలు మొదలుకొని కొండ ప్రాంతాల వారి వరకూ.. అపారమైన వైవిధ్యం కలిగిన ప్రాంతాల వారిని ఇందుకోసం ఎంచుకున్నారు. మహిళల లోపలి చెవి నిర్మాణంలో సూక్ష్మమైన తేడాలు ఉంటాయని, హార్మోన్ల తేడాలు కూడా ఈ వ్యత్యాసానికి కారణమని పరిశోధకులు కనుగొన్నారు. వయసుతోపాటు వినికిడి సామర్థ్యాలు తగ్గినప్పటికీ.. ఆడవాళ్లకు వారి వయసులోని పురుషుల కంటే మెరుగైన వినికిడి శక్తి ఉన్నట్లు వెల్లడించారు. పర్యావరణంపైనా దృష్టి పెట్టిన ఈ అధ్యయనం.. నివాస ప్రాంతాలను బట్టికూడా వినికిడి శక్తి మారుతుందని కనుగొన్నది. ఆండీస్ వంటి ఎత్తయిన పర్వత ప్రదేశాలలో నివసించేవారికి ఆక్సిజన్ స్థాయులు తక్కువగా అందుతాయి. కాబట్టి, వీళ్ల వినికిడి శక్తి తక్కువగా ఉంటుందట. అదే సమయంలో ఉష్ణమండల అడవులలో నివసించే వారు మెరుగైన వినికిడి శక్తి కలిగి ఉంటారని తేల్చారు. ఇక నగరవాసులు శబ్ద కాలుష్యానికి ఎక్కువగా గురవుతుంటారు. దాంతో వారి వినికిడి సామర్థ్యం తక్కువగా ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు.