ఆటల్లో అలసిపోవడం, నిద్రలేమి, ఇంటి వంటను ముట్టకపోవడం.. ఈ లక్షణాలన్నీ పిల్లల ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తాయి. వీటిని పట్టించుకోకుంటే తీవ్రమైన అనారోగ్యాలకు దారితీస్తాయి. అందుకే, ఈ కింది లక్షణాలు మీ పిల్లల్లో కనిపిస్తే వెంటనే జాగ్రత్తపడండి. వైద్య నిపుణులను సంప్రదించి.. సరైన చికిత్స చేయించండి.
నిద్ర పోకుంటే..
స్కూల్, ట్యూషన్, ఆటలు.. ఈ రోజుల్లో పిల్లలు రోజంతా తీరిక లేకుండా గడుపుతున్నారు. దాంతో శారీరకంగా, మానసికంగా త్వరగా అలసిపోతున్నారు. చాలా త్వరగానే నిద్రలోకి జారుకుంటారు. కనీసం ఎనిమిది గంటలైనా ప్రశాంతంగా నిద్రపోతారు. అలాకాకుండా.. మీ పిల్లలు రాత్రిపూట సరిగ్గా నిద్రపోవడం లేదంటే.. వారిలో ఏవో ఆరోగ్య సమస్యలు ఉన్నట్టే! నిద్రలేమి.. వారి మానసిక స్థితిని, మానసిక ప్రవర్తననూ ప్రభావితం చేస్తుంది. అందుకే, మీ పిల్లలు ప్రశాంతంగా నిద్రపోతున్నారా? లేదా? అన్నది గమనించండి. అంతేకాదు.. పీడకలలు, నిద్రలో ఉలిక్కిపడి లేవడాలు కూడా పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నదని చెప్పే సంకేతాలే!
అలసిపోతే అంతే!
‘శారీరక శ్రమ’ అనేది పిల్లలపై అంతగా ప్రభావం చూపదు. రోజంతా ఉరుకులు, పరుగులతో ఆటల్లో మునిగి తేలినా.. వారిలో అలసట అస్సలు కనిపించదు. అలాకాకుండా, మీ పిల్లలు ఆటల్లో దిగిన అరగంటకే అలసిపోవడం.. ఒక్క ఫ్లోర్ మెట్లెక్కినా ఎగశ్వాస పీల్చుకోవడం వంటివి చేస్తే ఆలోచించాల్సిందే! ఇలా పిల్లలు అసాధారణంగా అలసిపోవడం.. ఓ అరుదైన అనారోగ్య లక్షణం. ఆస్తమా, హృదయ సంబంధ సమస్యలకు సంకేతం! రక్తహీనత, శ్వాసకోశ ఇబ్బందులున్నా.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి పిల్లలు ఆటల్లో ఎంతసేపటికి అలసిపోతున్నారు? ఎన్ని ఫ్లోర్లు ఎక్కి, దిగ గలుగుతున్నారు? అనే విషయాలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.
అక్కడే పెరిగితే..
పిల్లలు సన్నగా ఉన్నా.. బొద్దుగా ఉన్నా ఓకే! కానీ, కేవలం నడుము, పిరుదుల దగ్గరే ఎక్కువ లావుగా ఉంటే మాత్రం.. డేంజర్ బెల్స్ మోగుతున్నట్లే! పిల్లలు ఇలా ఉంటే.. రాబోయే రోజుల్లో వారు ఊబకాయం బారినపడే ప్రమాదం ఉంది. వారి ఎదుగుదలపైనా ఈ లక్షణం ప్రభావం చూపుతుంది. మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులనూ సూచిస్తుంది. కాబట్టి మీ పిల్లలు నడుము భాగంలోనే ఎక్కువ లావుగా కనిపిస్తే.. ముందుజాగ్రత్త పడాల్సిందే!
బయటి ఫుడ్డే బెస్ట్ అంటే..
పిల్లలు ఇంటి ఆహారం కన్నా.. బయటి ఫుడ్డునే ఎక్కువ ఇష్టపడతారు. ఇది సహజమే! అయితే, అప్పుడప్పుడూ బయట తినడం సరే! కానీ, ఇంటి ఆహారాన్ని ఏమాత్రం ఇష్టపడకుండా, కేవలం బయటి ఆహారాన్ని మాత్రమే తింటున్నారంటే.. వారి మానసిక ఆరోగ్యంపై ఓ కన్నేయాల్సిందే! పోషకాహార లోపం, జీర్ణ సమస్యలు, భావోద్వేగాల సమస్యలు, మానసిక ఒత్తిడి వల్ల కొందరు పిల్లలు ఇంటి ఆహారాన్ని ఇష్టపడరు. కాబట్టి వారి ఆహారం విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి.