e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 23, 2021
Home చింతన చెడుపై రణం మంచి తరుణం

చెడుపై రణం మంచి తరుణం

చెడు చీడ. దానికి విరుగుడు మంచి. ముందు చెడు చెడుగుడు ఆడుతున్నట్టుగా కనిపించొచ్చు. కానీ, అంతిమ విజయం మాత్రం మంచిదే! ఆ విజయం దశను మార్చేస్తుంది. కొత్తదిశను నిర్దేశిస్తుంది. యుగాలుగా చెడుపై మంచి సాధిస్తున్న విజయాలకు వేదికగా నిలుస్తున్న రోజు ఇది. అందుకే విజయ దశమి అయింది. ఆ గెలుపులను ప్రసాదించింది ఆదిపరాశక్తి. ఆమే అపరాజిత.. మమ పాలిత!

దేవీ నవరాత్రుల వైభవం, దసరా సంబురం ఈనాటిది కాదు! సత్య యుగంలో మొదలైన నిత్య వసంతం ఇది. మహిషాసురుడు వర గర్వితుడు. లోకాన్ని పీడించడమే కర్తవ్యంగా భావించాడు. మహిషుడి తపశ్శక్తి అమోఘం.

- Advertisement -

అతడిని ఎదిరించే శక్తి దేవతలకు లేదు. ఆది పరాశక్తి పూనుకున్నది. పలు రూపాలు ధరించింది. తొమ్మిది రోజులు పోరాడింది. అంతిమంగా మహిషుడిని అంతమొందించింది. ముల్లోకాలకూ ముప్పు తప్పింది. చెడు పరదాలు తొలగిపోయాయి. మంచి సరదాలు మొదలయ్యాయి. అదే దసరా! సర్వత్రా సంతోషం. అది పరాశక్తి అనుగ్రహం. నాటి నుంచి శరన్నవరాత్రుల వేళ.. అమ్మవారి లీలలను రోజుకో రూపంతో గుర్తుచేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. దానికి కొనసాగింపుగా దసరా రోజు అమ్మను రాజరాజేశ్వరిగా, అపరాజితగా ఆరాధించడం సంప్రదాయమైంది.

త్రేతాయుగం.. మంచి, చెడు మధ్య సముద్రమంత దూరం ఉంది. చెడును పడగొట్టడానికి రాముడు సంద్రం దాటాడు. రావణుడితో యుద్ధం చేశాడు. అస్త్రశస్ర్తాలు ఎన్ని ప్రయోగించినా దశకంఠుడు పడిపోవడం లేదు. ఆదిశక్తి అండ తనకు కావాలనిపించింది రాముడికి. అపరాజితను మనసారా ఆరాధించాడు. విల్లు ఎక్కుపెట్టాడు. బాణం గురిపెట్టాడు. నారి సంధించి విడిచాడు. రామబాణం విల్లు వీడింది. రావణుడి ప్రాణం దేహం వదిలింది. ఆనాడు విజయ దశమి. రాముడు చేసిన అపరాజిత పూజ మంచిని గెలిపించింది. చెడును ఓడించింది. రాముడికి విజయం చేకూర్చింది. సీత దర్శనమైంది.

ద్వాపర యుగం.. మంచి, చెడు ఓ ఇంట్లో జొచ్చాయి. మంచిని నమ్ముకున్నది పాండవులు. చెడును పారించింది కౌరవులు. పాండవుల వనవాసం ముగిసింది. ఏడాది అజ్ఞాతవాసం చివరికొచ్చింది. మంచిని మరోసారి వంచించడానికి చెడు వచ్చింది. పాండవుల జాడ కనిపెట్టడానికి బయల్దేరారు కౌరవులు. విరాట రాజ్యంలోని గోవులను తరలించుకుపోవాలన్నది వాళ్ల ఎత్తు. తమకు ఆశ్రయమిచ్చిన విరాటరాజును కాపాడటం కర్తవ్యంగా భావించారు పాండవులు. అదే మంచితనం. వారికి మూలధనం. ఆ రోజు దశమి. విజయ దశమి. అపరాజితాదేవి ఆరాధన చేశాడు బృహన్నలగా ఉన్న అర్జునుడు. శమీ వృక్షంపై దాచిన తన గాండీవాన్ని ధరించాడు. కౌరవసేనలపై ఒంటిరిగా పోరుకు సిద్ధమయ్యాడు. అమ్మ అనుగ్రహంతో శత్రు సైన్యాన్ని దౌడు తీయించాడు. చివరకు మంచిదే గెలుపైంది. ఆ ఒక్క రోజే కాదు.. నాటి నుంచి కురుక్షేత్ర యుద్ధం ముగిసే దాకా పాండవులదే పైచేయి. చెడు పతనమైంది. మంచితనానిది విజయమైంది.

ఇది కలియుగం.. మంచి, చెడు ఒక ఒంట్లో తిష్ఠవేశాయి. ఆ రెండిటి మధ్యా నిరంతర యుద్ధం కొనసాగుతున్నది. చెడు గెలిచిందా.. ఆ మనిషి మహిషుడవుతాడు. మంచి నిలిచిందా మనీషిగా మిగిలిపోతాడు. అయితే, చెడును గుర్తించడం తేలికే! దానిని అధిగమించడమే కష్టం. అందుకు మనోబలం కావాలి. ఆధ్యాత్మిక మార్గం కావాలి. దైవీశక్తి సాయంతో మనలోని మలినాలను ప్రక్షాళన చేసుకోవాలి. అందుకు విజయదశమి కన్నా సరైన తరుణం ఏముంటుంది? దసరా నాడు అమ్మవారిని ‘అపరాజిత’గా ఆరాధించాలని ధర్మసింధు చెబుతున్నది. ఆ తల్లిని పూజిస్తే అపజయం అన్న మాట ఉండదు. పరాశక్తి దయతో మనలోని చెడుపై విజయం సాధిద్దాం. దశ మార్చుకుందాం. విజయ దశమి అర్థాన్ని సార్థకం చేసుకుందాం.

కణ్వస

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement