ఇంటి పెరటిలో గానీ, టెర్రస్ పైనగానీ, అపార్ట్మెంట్ బాల్కనీల్లో గానీ పెంచుకోవడానికి క్యాలీఫ్లవర్ అనువుగా ఉంటుంది. అనేక పోషకాలతో నిండిన ఈ కాయగూరను ఏడాదంతా తినొచ్చు. విటమిన్ సి, కెతోపాటు పొటాషియం, మాంగనీస్, ప్రొటీన్లు అధికంగా లభించే క్యాలీఫ్లవర్.. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. హృదయ సంబంధిత వ్యాధులు, వివిధ రకాల క్యాన్సర్ల ప్రభావాన్నీ తగ్గిస్తుంది. ఇలాంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే క్యాలీఫ్లవర్‌ను ఇంటివద్దే సులభంగా పెంచేయొచ్చు. సెప్టెంబర్ -అక్టోబర్ మధ్యలో విత్తనాలు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
కాబట్టి, మార్కెట్లో అందుబాటులో ఉన్న క్యాలీఫ్లవర్ విత్తనాలు, మొక్కలు తెచ్చి నాటుకుంటే సరిపోతుంది. మొక్కను నాటిన 55 నుంచి 60 రోజుల్లోనే క్యాలీఫ్లవర్ తయారవుతుంది. అయితే, క్యాలీఫ్లవర్ పెరిగేందుకు సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉండే మట్టి అవసరం. 6.0 నుంచి7.0 మధ్య పీహెచ్ పరిధిలో ఈ మొక్క బాగా పెరుగుతుంది. క్యాలీఫ్లవర్ పువ్వు తెల్లగా, మచ్చలు లేకుండా ఉండాలంటే.. పెరుగుతున్న పువ్వులోకి సూర్యరశ్మి చేరకుండా జాగ్రత్త పడాలి. ఇందుకోసం పువ్వు చుట్టూ ఉండే ఆకులలో చివరి వరుస ఆకులను రబ్బరు బ్యాండ్‌తో కట్టాలి. పువ్వు సరైన పరిమాణంలో పెరిగిన తర్వాత కోసుకోవాలి.