శరీరానికి అవసరమయ్యే శక్తిని కార్బొహైడ్రేట్లు అందిస్తాయి. అయితే మధుమేహం ఉన్నవారిలో కార్బొహైడ్రేట్ల వినియోగం పూర్తిస్థాయిలో జరగదు. దాంతో చక్కెర నిల్వలు పేరుకు పోతాయి. అసలు, ఎలాంటి కార్బొహైడ్రేట్లు తినాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి.. అన్న విషయం మీద మధుమేహ రోగులకు అవగాహన అవసరం.
సింపుల్ కార్బొహైడ్రేట్స్
ఈ కార్బొహైడ్రేట్లలో మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్ కలిగిన షుగర్లు (ఫ్రక్టోజ్, గ్లూకోజ్) ఉంటాయి. ఈ కార్బొహైడ్రేట్లను శరీరం శక్తి కోసం త్వరగా, సులువుగా వినియోగించుకుంటుంది. ఇవి బ్లడ్ షుగర్ స్థాయులను వేగంగా పెంచుతాయి. అలాగే, పాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ విడుదల కూడా పెరుగుతుంది. దీనివల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది.
కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్స్
ఇందులో సంక్లిష్ట రసాయన నిర్మాణాలు ఉంటాయి. అంటే మూడు లేదా అంతకన్నా ఎక్కువ షుగర్లు ఉంటాయి. ఒలిగోసాకరైడ్స్, పాలీసాకరైడ్స్.. మొదలైనవి ఉండటం వల్ల జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అయితే, బ్లడ్ షుగర్‌పై వీటి ప్రభావం నిదానంగా కనిపిస్తుంది. మరోరకమైన కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్స్.. అంటే వైట్ బ్రెడ్, ఆలుగడ్డల్లో పిండిపదార్థాలు ఎక్కువగానూ, పీచు పదార్థాలు తక్కువగా ఉంటాయి. వీటిని తినడం తగ్గించాలి.
సాధ్యమైనంత వరకూ .. కార్బొహైడ్రేట్లను తక్కువ మోతాదులో తీసుకోవాలి. తిన్నా, నాణ్యమైన కార్బొహైడ్రేట్లనే ఎంచుకోవాలి. అప్పుడు అవి బ్లడ్ షుగర్ స్థాయిని, బరువును తగ్గిస్తాయి. బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉండాలంటే పొట్టు తీయని ధాన్యం, బీన్స్, మోరంగడ్డ మొదలైనవి తినాలి. ఇవి కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్స్ అయినా పీచు పుష్కలం. దాంతోపాటు వ్యాయామం తప్పనిసరి. ఆహార నియంత్రణ లేకుండా మందులపైనే ఆధారపడితే దుష్ర్పభావాలు తప్పవు.
–మయూరి ఆవుల, న్యూట్రిషనిస్ట్,
Mayuri@trudiet.in