బీపీని అదుపు చేయడంలో వ్యాయామాన్ని మించిన ఔషధం లేదు. నిత్యం కనీసం అరగంట నడక, సైక్లింగ్, ఈత లాంటి ఎక్సర్సైజ్లు చేయడం ద్వారా.. బీపీ కంట్రోల్లో ఉంటుంది. తగినంత సమయం లేకుంటే.. కిరాణా దుకాణాలు, మందుల షాప్‌లకు నడిచే వెళ్లండి. ఆఫీస్, షాపింగ్ మాల్స్‌లో లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఎక్కడం అలవాటు చేసుకోండి. రక్తపోటు బాధితులతోపాటు మిగతావారు కూడా ఆహారంలో ఉప్పును తగ్గించుకోవడం ముఖ్యం. శరీరంలోకి సోడియం ఎక్కువగా చేరితే.. రక్తపోటు పెరుగుతుంది.
కాబట్టి, రుచి కోసం మామూలు సాల్ట్‌కు బదులుగా ఇతర సుగంధ మూలికలను వాడండి. అరటిపండ్లు.. అధిక రక్తపోటును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో పుష్కలంగా లభించే పొటాషియం.. శరీరంలోని అదనపు సోడియంను బయటికి పంపించడంలో సాయపడుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడితో బాధపడేవారిని ‘బీపీ’ ఇట్టే ఆవహిస్తుంది. కాబట్టి, ఒత్తిడిని తగ్గించుకోవాలి. యోగా, ధ్యానం లాంటివి జీవనశైలిలో భాగం చేసుకోవాలి. సంగీతం, ఇష్టమైన పాటలు విన్నా.. ఒత్తిడి చిత్తవుతుంది.
టీ, కాఫీలను ఎక్కువగా తాగితే.. శరీరంలో కెఫీన్ చేరుతుంది. కెఫీన్, ఆల్కహాల్లో ఉండే సమ్మేళనాలు.. రక్తపోటును ఎక్కువ చేస్తాయి. కాబట్టి, బీపీ కంట్రోల్లో ఉండాలంటే.. టీ, కాఫీలతోపాటు మద్యపానం మానేయాల్సిందే! డార్క్ చాక్లెట్ తిన్నా.. రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇందులో ఉండే మెగ్నీషియం ఫ్లేవనాయిడ్లు.. శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. తద్వారా రక్తపోటును తగ్గిస్తాయని పలు పరిశోధనలు రుజువు చేశాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా రక్తపోటును తగ్గించుకోవచ్చు. పండ్లు, కూరగాయలతోపాటు తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. బీపీ ఉన్నవారు చిలగడదుంపలు, పాలకూర ఎక్కువగా తినాలి.