కాపురంలో చిన్నచిన్న కలహాలు కామనే! భార్యాభర్తలన్నాక అభిప్రాయభేదాలు రావడం సహజమే! అలాంటప్పుడు ఎవరో ఒకరు రాజీపడాల్సిందే! సర్దుకొని పోవాల్సిందే! కానీ, చాలామంది జెన్-జీ జంటల్లో ఇలాంటి మనస్తత్వాలు కనిపించడంలేదు. కాపురం విషయంలో వారు ఎవరూ కాంప్రమైజ్ కావట్లేదు. ఎదుటివారిపై ఆధిపత్యం చెలాయించాలనే చూస్తున్నారు. బంధానికి బీటలు తెచ్చుకుంటూ.. అనుబంధాన్ని తెంపేసుకుంటున్నారు. అలాంటివారికి మానసిక నిపుణులు కొన్ని సలహాలు అందిస్తున్నారు.
కొందరి నోటికి హద్దూ అదుపూ అనేది ఉండదు. చిన్న గొడవైనా.. పెద్దపెద్దగా అరుస్తారు. భాగస్వామిపై మాటల దాడికి దిగుతారు. లేనిపోనివి అనేస్తారు. దాంతో, ఎదుటివారు కూడా రియాక్ట్ అవుతారు. ఫలితంగా గొడవ మరింత పెద్దదవుతుంది. అలాకాకుండా ఉండాలంటే.. నోరు అదుపులో పెట్టుకోవాలి. గొడవ పడినప్పుడు మాటల్ని పొదుపుగా వాడాలి. అన్నిటికీ మించి, దంపతుల్లో ఎవరో ఒకరు సైలెంట్‌గా ఉండాలి. అప్పుడు ఎదుటివారి కోపం తగ్గుతుంది. గొడవ సద్దుమణుగుతుంది. ఇక ఓపిక, సహనం వంటబట్టించుకోవడానికి యోగా, ధ్యానం లాంటివి ఆశ్రయించాలి.
ఇప్పటితరంలో భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తున్నారు. ఆర్థికంగా ఒకరిపై ఆధారపడాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు. పొదుపు-ఖర్చుల విషయాల్లోనూ ఎవరి నిర్ణయాలు వాళ్లే తీసుకుంటున్నారు. తమ ఆర్థిక విషయాల్లో భాగస్వామి తలదూర్చడాన్ని కొందరు సహించలేకపోతున్నారు. దాంతో, ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతున్నది. అది విడాకుల దాకా వెళ్తున్నది. కాబట్టి, ఎవరెంత సంపాదించినా.. మొత్తం ఉమ్మడిగానే చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఖర్చులు, పొదుపులు, పెట్టుబడులు.. అన్ని విషయాలనూ పంచుకోవాలని సూచిస్తున్నారు. రుణాల చెల్లింపు, ఆస్తుల కొనుగోలు మొదలైన అంశాల్లోనూ.. ఇద్దరూ ఒకే మాట మీద ఉండాలనీ, అప్పుడే ఇద్దరూ బాధ్యతాయుతంగా వ్యవహరించే అవకాశముంటుందని అంటున్నారు.
నవతరం.. బాధ్యతలను ఓ బరువుగా చూస్తున్నది. ఇంటి వ్యవహారాల్లోనూ అవగాహన ఉండటం లేదు. ఇక పరిణతితో ఆలోచించ లేకపోడం, అభిప్రాయాలను గౌరవించక పోవడం కూడా.. దంపతుల మధ్య కలతలకు కారణం అవుతున్నాయి. అవి చిలికిచిలికి గాలివానలా మారుతున్నాయి. విడాకుల దాకా తీసుకెళ్తున్నాయి. అలా కావొద్దంటే.. పెళ్లి తర్వాత బరువు-బాధ్యతలను సమానంగా స్వీకరించాలి. భార్యాభర్తలిద్దరూ ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవాలి. ఈ విషయంలో ఒకరు మొండిగా ఉన్నా, మరొకరు ఓ మెట్టు దిగాలి. అప్పుడే గొడవలు సద్దుమణుగుతాయి.