ట్రావెలింగ్ అంటే.. యువతే ఎక్కువగా గుర్తుకొస్తుంది. టూర్లు ప్లాన్ చేయాలన్నా, సరదాగా సరికొత్త ప్రాంతాలను చుట్టిరావాలన్నా.. యూత్ ఎప్పుడూ ముందుంటుంది. అదే సమయంలో పెద్దవాళ్లు కూడా విహారయాత్రలకు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా, కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. బుకింగ్స్.కామ్ తాజాగా 32వేల మందితో సర్వే నిర్వహించి.. అనేక విషయాలు వెల్లడించింది. 75 శాతం మంది భారతీయ తల్లిదండ్రులు.. ఏటా ఏదో ఒక టూర్ ప్లాన్ చేస్తున్నారట. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారట. 72 శాతం మంది.. ఇలా కుటుంబం కోసం ప్రయాణాలకు సిద్ధమవుతున్నారట. ఇక మానసిక స్థితిని మెరుగుపరచుకోవడానికి 71 శాతం మంది ప్రయాణాలు కడుతుండగా.. విశ్రాంతి కోసం 68 శాతం మంది ట్రావెలింగ్‌ను ఎంచుకుంటున్నారట.
భారతీయులు ఎక్కువగా ఆసియాలో పర్యటించేందుకే మొగ్గుచూపుతున్నారు. 62 శాతం మంది సొంత ఖండాన్ని చుట్టిరావడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. యూరప్‌కు 55 శాతం మంది ఓటేయగా.. ఉత్తర అమెరికాను సందర్శించేందుకు 26 శాతం మంది ఇష్టపడుతున్నట్టు చెప్పారు. ఇక 98 శాతం మంది భారతదేశంలోనే ప్రయాణించాలని ఆలోచిస్తుండగా.. 90శాతం మంది అంతర్జాతీయ పర్యటనలకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. వీరిలో ఎక్కువశాతం కుటుంబ బాధ్యతలు, భావోద్వేగ సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి ప్రయాణాలు కడుతున్నారు. అంతేకాదు, పిల్లలకు ఈ విశాల ప్రపంచాన్ని పరిచయం చేయడానికీ ట్రావెలింగ్‌ను ఎంచుకుంటున్నారు. 92 శాతం మంది తమ పిల్లలకు విభిన్న సంస్కృతులపై అవగాహన కల్పించడానికి టూర్లు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.
ఇక సోలో ట్రావెలింగ్‌లోనూ పెద్దవాళ్లు ముందుంటున్నారు. 79 శాతం మంది తల్లిదండ్రులు.. ఒంటరి ప్రయాణాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట. తమను తాము రీచార్జ్ చేసుకోవడానికి, తమకోసం తాము సమయం కేటాయించుకోవడానికి ఇలా ఒంటరి ప్రయాణాలను ఆశ్రయిస్తున్నారు. అదే సమయంలో.. బడ్జెట్ విషయంలోనూ పక్కాగా ఉంటున్నారు. ప్రయాణాల్లో తెలివిగా ఖర్చు పెడుతున్నారు. ఇలా.. 70 శాతం మంది ఖర్చులను తగ్గించుకోవడానికి ఆఫ్ సీజన్లో ప్రయాణించడానికి ఇష్టపడుతున్నారు. ఇక యూత్‌కు తీసిపోకుండా టెక్నాలజీనీ అందిపుచ్చుకుంటున్నారు. 88 శాతం మంది డిస్కౌంట్లు, తక్కువ రేట్లను కనుక్కోడానికి డిజిటల్ సాధనాలను ఉపయోగిస్తున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను కూడా వీళ్లు బాగానే విశ్వసిస్తున్నారు. 91 శాతం మంది ఏఐ సహాయం తీసుకుంటున్నామనీ, 88 శాతం మంది టూర్‌ను బాగా ప్లాన్ చేసుకోవడానికి ఏఐని ఆశ్రయిస్తున్నామని చెప్పుకొచ్చారు.