ఇంట్లో ..! అమ్మ కాకరకాయ వండిందంటే చాలు ‘అమ్మో! ఆ చేదు మేము తినలేమ’ంటూ స్విగ్గీలో నచ్చిన ఐటం ఆర్డర్ పెట్టుకుంటాం. లేదంటే అప్పటిప్పుడు వేరే కూరైనా వండించుకొని తింటాం. కానీ మన శరీరానికి కాకరకాయ ఎంతో మేలు చేస్తుంది. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కాకరకాయది ప్రథమస్థానం. మన శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తుల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించడమే కాకుండా శరీరంలోని కొలెస్ట్రాల్‌ను కాకరకాయ నియంత్రిస్తుంది. కాకరకాయలో ఉన్న విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ లాంటి పోషకాలు యాంటి ఆక్సిడెంట్లుగా మారి వానాకాలంలో జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడుతాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్లు, దురదతో బాధపడేవారికి ఉపశమాన్ని కలిగిస్తాయి. కాకరకాయ కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా శరీరంలోని ట్యాక్సిన్స్‌ని మూత్రం రూపంలో బయటికి పంపిస్తుంది.