ఇది బర్లకు సైతం తిరుగుబాటు పాఠం నేర్పిన కథ. అధికార కాంగ్రెస్ పార్టీ ఆగడాలపై మర్లవడ్డ కూరాకుల కుటుంబం కథ. తలుగు తెంపుకొని పారిపోయే దొంగబర్లనూ దారికితెచ్చే దట్టమైన పలుగు కథ. అవును.. అధికార పార్టీ ఎమ్మెల్యే ఏది చెప్పినా ‘జీ హుజూర్’ అనే వ్యవస్థపై బర్లను తోలి నిరసన తెలిపిన కూరాకుల లలిత కథ. తమ పేరుతో వచ్చిన సబ్సిడీ గొర్లను దొంగలెవరో కాజేస్తే తిరగబడి తిరిగి సాధించిన ఒక సాధారణ మహిళ.. ఇవ్వాళ భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బర్లను తోలి నిరసనరూపాలకే కొత్త అర్థాన్ని ఇచ్చిన లలితకథ ఆమె మాటల్లోనే…
నా పేరు కూరాకుల లలిత. మా ఆయన పేరు ఓదెలు. నేను ఏడో తరగద్దాక చదువుకున్న. మా తల్లిగారిది జంగేడు పక్కన్నే ఉన్న వేశాలపల్లి. మాది మంజూర్‌నగర్ (జయశంకర్-భూపాలపల్లి జిల్లా). నాకు ఇద్దరు పిల్లలు. వాళ్లు చదువుకుంటున్నరు. మా ఆయన (ఓదెలు) ఆరోగ్యం బాగాలేకపోతే కష్టపడి బతికిచ్చుకున్నం. బర్ల పాలమ్మి బతుకుతాన్నం. యాభై అరవై ఏండ్ల సంది మా అత్తామామల (కూరాకుల రాజయ్య, కొమురమ్మ) కాలం నుంచి ఉంటాన్నం. సంవత్సరం కింద 20 గుంటల భూమిని ఆక్రమించుకున్నరు. అప్పుడు మస్తు గోసపుచ్చుకున్నరు.
అప్పుడు పోలీసోళ్లు పొద్దున 4 గంటలకు తీసుకొనిపోయి.. మళ్లా రాత్రి 8 గంటలకు వదిలిపెట్టేది. అండ్ల షెడ్డు.. ఇండ్ల షెడ్డు.. రెండు షెడ్లు కూలగొట్టిర్రు. గోడ పెట్టిండ్లు. మళ్లా రెండు లక్షలు పెట్టి ఇంకో షెడ్డు వేసుకున్నం. మమ్ముల పోలీస్ స్టేషన్ల కూసోబెట్టి.. వాళ్లకు బిల్డింగ్ కట్టిచ్చిర్రు. ఇగో ఇప్పుడు మళ్లా 8 గుంటలల్ల బర్ల షెడ్డుకు ఎసరుపెట్టిర్రు. ఈ యేసుకున్న షెడ్డు దారిల ఉన్నదంటార్రు. అసలు వాళ్ల పేరు మీద భూమిలేదు. దారిలేదు. మాది పొత్తుల భూమి అయితే. మా బావ మా ఆయన సంతకాలు పెట్టి అమ్ముకున్నడు. మా బావ అమ్మిందిపోను. ఇంకా 20 గుంటల భూమి. దాన్ని కూడా కబ్జా పెట్టిర్రు.
ఉన్న భూమిని కబ్జాపెట్టిర్రు. గోడ పెట్టిర్రు. ఏమన్నంటే ‘మిమ్ములను సంపుతం. మీరు ఈడుండి ఏంజేత్తార్రు. ఎక్కడికైనా పోయి బతుకుతేంది?’ అని బెదిరిచ్చుడే. అన్యాయం చేసేటోళ్ల దిక్కే పోలీసోళ్లు. ఎమ్మెల్యే చెప్పినట్టే పోలీసోళ్లు.. మున్సిపాలిటోళ్లు ఇనుడు. ‘మీకు ఈడ ఏంలేదు. ఎప్పుడు పొమ్మంటే అప్పుడు పోవాలె’ అని భయపెట్టుడు. ‘మాకు గుంట భూమి లేకవోయినా బతుకుతలేమా?’ అని మున్సిపాలిటీ అధికారులు బెదిరిచ్చుడు. ‘సారూ… నీకు నౌకరి ఉన్నది. బతుకుతాన్నవు. మేం బర్లపాలమ్మి బతికేటోళ్లం. యేడ కట్టేసుకోవాలె?’ అంటే జవాబియ్యరు. ‘ఇగో మేం కూలగొడ్తాంటే అడ్డం వస్తే మిమ్ములను తొక్చిచ్చి కూలగొడ్తం.. మాంటే నాలుగు రోజులు జైళ్ల ఉంటం. తరువాత వత్తం’ అని అంతమాటన్నడు.
నాలుగు బర్లను పట్టుకొని… వాటితోని తిరిగి… కష్టపడి పాలు అమ్ముకొని బతికేటోళ్లం. పట్టా మా పేరు మీద లేకపోతే 12 ఏండ్ల కింద తురకాయిన (సర్వర్ మొయినోద్దిన్ పట్టాదార్)కు రూ.15 లక్షలు కట్టినం. రిజిష్టర్ చేస్తా అన్నాంక కొద్ది రోజులకే ఆ తురకాయిన ఆరోగ్యం బాగాలేక దవాఖానల ఉండి కొన్ని రోజులకు సచ్చిపోయిండు. వాళ్ల కొడుకు ‘మా నాయిన పేరు మీంచి నా మీద ఎక్కిచ్చుకొని మీ పేరు మీద ఎక్కిస్త’నని చెప్పిండు. ఆ అప్లికేషన్ ఇచ్చినా ఎమ్మార్వో ఆఫీసుల పక్కకు పడేస్తాండ్లు.
మున్సిపాలిటీ నుంచి వచ్చిన అధికారులు ‘ఎమ్మెల్యే సారు చెప్తేనే మేము కూలగొడుతాన్నం. ఎమ్మెల్యే సారు కమిషనర్‌కు చెప్పిండు… కమిషనర్ మాకు చెప్పిండు అందుకనే కొట్టం కూలగొట్టినం’ అని చెప్పిర్రు. ఎప్పటిసందో ఉన్నం. సంవత్సరం కింద రెండు షెడ్లు కూలగొట్టిర్రు. రెండు లక్షలు ఖర్చుపెట్టుకున్నం. ఎవల తెరువుకు పోకుంట మా బతుకు మేం బతుకుతుంటే ఇప్పుడు మల్లా కూలగొట్టిర్రు. ఎందుకు కూలగొట్టిర్రంటే ఎమ్మెల్యే కూలగొట్టుమంటే కూలగొట్టినం అని ఆఫీసర్లు చెప్పిర్రు. మరేం జేయాలె.. బర్లను యాడగట్టేయాలె? ఎమ్మెల్యే ఇంటికాడనే కట్టేత్తనని తోలుకపోయిన. మా పనేందో మేమేందో. మా ఆయన ఏ పార్టీల తిరగడు. మేం ఏ పార్టీకాదు. బర్ల పనిచేసుకొని బతుకుతాన్నం. పార్టీ పగల్లేవు. ఏం లేవు. మేం ఎవలకు అన్యాయం చేయలె. కావాల్నంటే తెలుసుకోర్రి.
పోంగపోయింది.. గిదన్న (8 గుంటల భూమి) ఉంటదికదా అని బర్ల పట్టుకొని బతుకుతాంటే ఎప్పుడు లేంది ఇప్పుడు స్కూలని పెడ్తార్రు. మేం ‘ఓనర్ సర్టిఫికెట్తోని డాకుమెంట్ చేయించుకున్నం. ఓనరు సర్టిఫికెట్ పెట్టి 9 గుంటలు రిజిస్టర్ చేయించుకున్నం. అది చెల్లదు అంటార్రు. మేం రిజిస్ట్రేషన్ చేయించుకున్న దాంట్లనే షెడ్డు యేసుకున్నం. ఎప్పుడులేంది రోడ్డు… స్కూల్ అంటార్రు. స్కూల్ ఎక్కడున్నది? మా కొట్టమెక్కడున్నది? మొన్న మున్సిపాలిటీ కమిషనర్ పంపిచ్చిండని ఒకసారొచ్చిండు. ‘అమ్మా… మీ షెడ్డు కాడికి ఏమిరాం స్కూల్ వరకే దారేత్తానం’ అన్నడు. నిజమే కావచ్చు అనుకున్నం. కానీ, ఇంత పనిజేస్తరని అనుకోలేదు. నోరులేని పసులకు నీడ లేకుంట చేసిండ్లు. మాకు న్యాయం జేయాలంటే పోలీసాఫీసరు ‘వాళ్లను లోపల ఎయిపో!’ అంటున్నడు. అనంగనే మా ఆయనను దొబ్బుకొని పోతాంటే కోపం ఆపుకోలేక ఒక మాటన్న ‘ఆయన ఆరోగ్యంగ లేడు. ఏమన్నయితే మర్యాద దక్కది! మీరు పోలీసోళ్లు అని చూడ… ఏమి చూడ’ అనన్న. మీరెన్ని బూతులు తిట్టినా ఓపిక పట్టుకొని ఉంటాన్న.
అందరూ ఎమ్మెల్యే అంటార్రని ఆ సారు దగ్గరికి పోయినం. మా ముంగట మంచిగనే మాట్లాడిండు. వాళ్ల (ఆఫీసర్ల)కు ‘చిన్నప్పటి నుంచి తెలిసిన పొల్లగాడు. ఏదో ఆడికి పోయి సూడుర్రి’ అని మాట్లాడిండు. కానీ, ఎన్కకెల్లి చేసేది జేత్తాండు. మున్సిపాలిటీ ఆఫీసుల ఉన్నాయనే మాకు చెప్పిండు ‘ఎమ్మెల్యే చెప్తేనే మేం చేస్తానం’ అని చెప్పవట్టే. ‘ఎమ్మెల్యేసారు చెప్పినంక మేం చేయకపోతే ఎట్లుంటది? అని అంటాడ్లు. మాకు న్యాయం కావాలె.
ఇద్వరకు గట్లనే చేసిర్రు. మాకు గోర్లు వచ్చినయి. మా ఆయన పేరు మీద దొంగ సంతకాలు పెట్టుకొని ఎవలో తీస్కున్నరు. మేం బర్ల లోన్ పెట్టుకుంటమని ఆఫీసు కాడికి పోయినం. పోతే ‘గొర్ల లోను పెట్టుకున్నవ్. మళ్లా బర్లలోన్ కావాల్నా?’ అని ఆఫీసర్లు అన్నరు. గొర్లు రాలేదనే ఇప్పుడు బర్లలోన్ తీసుకుంట అని చెప్పిన. ‘ఇగో గొర్లు తీస్కున్నట్టుగా సంతకాలున్నయి. ఇండ్ల మీ ఆయన (ఓదెలు) ఫొటో లేదు కానీ, సంతకం కూడా ఉన్నది కదా!’ అన్నరు. అయితే… రూ.56వేల డీడీ తీసినం. ఎప్పుడు అడిగినా వత్తయి.. వత్తయి అనుడే కని రాలేదు. గట్టిగ అడుగుతే మళ్లొచ్చినప్పుడు ఇత్తమన్నరు. కానీ, ఇంత మోసం జరిగిందని మొత్తం కాయితాలు పట్టుకొని కంప్లెంట్ ఇచ్చినం. ఆఫీసోళ్లు ఏం జేయలేదు. మా ఆయన పేరు మీద దొంగ సంతకాలు పెట్టి తీసుకున్నోళ్లు ఎవలో వాళ్లకు సంగతి చెప్పుండ్లి సారూ అంటే… ఆ ఆఫీసుల ఎవలు ఇన్లే! అందరూ ఆ దొంగలదిక్కే మాట్లాడిండ్లు. అప్పుడు నేను కలెక్టర్ కాడికి పోయిన. అప్పుడు మాకు కలెక్టర్ సారు న్యాయం చేసిండు. 21 గొర్లు వచ్చినయి.
– నూర శ్రీనివాస్
అమ్ముల తిరుపతి, భూపాలపల్లి