సంపాదన ఎంత పెరిగినా.. అప్పుల తిప్పలు మాత్రం తప్పడం లేదు. ఇంటి కోసమో.. కారు కొనడానికో.. వ్యక్తిగత అవసరాలకో రుణాలు తీసుకోవాల్సి వస్తున్నది. ఇలాంటి సందర్భాల్లో వడ్డీరేట్ల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే.. ఈ వడ్డీరేట్లే రుణగ్రహీతలపై ఆర్థిక భారం పెరిగేలా చేస్తాయి. ప్రస్తుతం బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు.. రెండు రకాల వడ్డీ రేట్లను వసూలు చేస్తున్నాయి. అవి.. ఫిక్స్డ్ వడ్డీరేటు, ఫ్లోటింగ్ వడ్డీరేటు. అప్పులు చేయడంలో ఆరితేరినవారికి వీటి గురించి తెలిసినా.. కొత్తవారికి కొంచెం కొత్తగానే అనిపిస్తాయి. పూర్తిగా తెలుసుకుంటేనే.. ఆ తర్వాత ఆర్థికభారం పడకుండా కాపాడతాయి.
ఈ వడ్డీరేట్లు ఎప్పుడూ స్థిరంగానే ఉంటాయి. లోన్ తీసుకున్నప్పటి నుంచి.. టెన్యూర్ ముగిసేవరకు వడ్డీరేటు ఒకేరకంగా ఉంటుంది. ప్రతినెలా చెల్లించాల్సిన ఈఎంఐ కూడా అంతే ఉంటుంది. కాబట్టి, నెలకు ఎంత ఈఎంఐ కట్టాలో ముందే అవగాహన ఉంటుంది. ముఖ్యంగా.. ఎక్కువ రోజులు టెన్యూర్ లోన్ల కోసం ఈ ఫిక్స్డ్ వడ్డీరేట్లు
బాగుంటాయి.
ఇవి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. ఫిక్స్డ్ రేట్ల కంటే తక్కువగా ఉండే ఈ ఫ్లోటింగ్ వడ్డీరేట్లు.. దీర్ఘకాలిక రుణాలకు ప్రయోజనకరంగా ఉంటాయి. సుదీర్ఘకాలంలో వడ్డీరేటు తగ్గింపుల నుంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. ఆర్బీఐ రెపో రేటును తగ్గించినప్పుడు, బెంచ్మార్క్ రేటు తగ్గినప్పుడు ఫ్లోటింగ్ రేటు కూడా తగ్గుతుంది. అంటే.. ఇంటి రుణంపై వడ్డీరేటు కూడా తగ్గుతుంది. దాంతో, నెలనెలా కట్టాల్సిన ఈఎంఐ కూడా తక్కువ అవుతుంది. అంతేకాదు, పలు బ్యాంకులు/ఆర్థిక సంస్థలు.. రుణాలను ముందస్తుగా చెల్లిస్తే పెనాల్టీని వసూలు చేస్తుంటాయి.
వడ్డీరేట్లో తీసుకున్న రుణాలకు ఈ సమస్య ఉండదు. కాబట్టి, ఎలాంటి ఇబ్బంది లేకుండానే రుణాలను ముందస్తుగా తీర్చే అవకాశం ఉంటుంది. అదే సమయంలో.. ఫ్లోటింగ్ వడ్డీరేట్లకు కొన్ని ప్రతికూలతలు కూడా ఉంటాయి. ఆర్బీఐ రెపోరేటు పెంచినప్పుడు, బెంచ్మార్క్ రేటు కూడా పెరుగుతుంది. అప్పుడు మీరు చెల్లించాల్సిన వడ్డీ రేటుతోపాటు ఈఎంఐ లేదా రుణ కాలవ్యవధి పెరుగుతుంది.
ఇది.. తక్కువ ఆదాయ వర్గాలకు ఇబ్బందికరంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈఎంఐ డిఫాల్ట్ అయితే.. క్రెడిట్ స్కోరు తగ్గిపోతుంది. అందుకే ఫ్లోటింగ్ వడ్డీ రేటుతో లోన్ తీసుకునేటప్పుడు అన్ని విషయాలూ ముందుగానే చూసుకోవాలి.
.. ఈ రెండిట్లో ఏ వడ్డీరేటును ఎంచుకోవాలనేది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా అప్పులు తిరిగి చెల్లించగలిగే సామర్థ్యం, రుణగ్రహీతల ఆర్థిక స్తోమతను బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. దీర్ఘకాలిక ప్రణాళికలు ఉన్నవారు, ప్రతినెలా చెల్లించే ఈఎంఐ మారకూడదని అనుకునేవారికి ఫిక్స్డ్ వడ్డీరేటు బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకుల్లో వడ్డీరేట్లు తగ్గే అవకాశాలు ఉన్నప్పుడు, తక్కువ సమయంలోనే రుణాలు తీర్చేస్తామని అనుకునేవారు ఫ్లోటింగ్ వడ్డీరేట్లు ఎంచుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.