తెలంగాణ పాడే బతుకమ్మ పాట దశదిశలా ప్రతిధ్వనిస్తున్నది. ఇక్కడ ఆడే కోలల చప్పుడు నలు దిక్కులా మార్మోగుతున్నది. పూలతల్లికి పట్టం కట్టే తంతు సరిహద్దులుదాటి కొనసాగుతున్నది. పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో జరిగే తీరొక్కపూల జాతరనూ, వేడుకలో ఆడిపాడే వేల మంది ఆడబిడ్డలనూ చూస్తే ఇది మరాఠా వాడా? తెలంగాణ నేలా? అన్న అనుమానం తప్పక తలెత్తుతుంది. వేల బతుకమ్మలు, లక్షల మంది ప్రజలు… సంబురంగా చేసుకునే అక్కడి సందడిని ఎవరైనా కళ్లారా చూసి తీరాల్సిందే! బతుకమ్మ ఉత్సవాన్ని వైభవంగా జరుపుకొనే మహారాష్ట్రలోని తెలంగాణ బిడ్డలతో ‘జిందగీ’ మాట కలిపింది. పండుగ గురించి ఆసక్తికరమైన ముచ్చట్లెన్నో తెలుసుకుంది.
తెలంగాణలో బతుకమ్మ ఓ ఉత్సవం. ఇక్కడి నేలా నీరూ గాలీ… ఆ తల్లిని తమలో నింపుకొంటాయి. ఆ మట్టిలో పుట్టిన మనుషులు మదినిండా ఆమెను నిలుపుకొంటారు. అందుకే ఏ దేశమేగినా అన్నట్టు తామెక్కడ ఉన్నా ఆమెను వీళ్లు మరచిపోరు. తామే కాదు, తమ తర్వాతి తరాలకూ వారసత్వ సంపదలా ఆ వేడుకను అందిస్తారు. ముఖ్యంగా సమైక్య పాలనలో తరాల నాడు ఇక్కడి బిడ్డలు బతుకుదెరువు కోసం ముంబయి, భీవండి ప్రాంతాలకు తరలి వెళ్లారు. స్వరాష్ట్ర సాధన తర్వాత అందులో 25 శాతానికి పైగా తరలి వచ్చినా, మన వాళ్ల సంఖ్య అక్కడ గణనీయమే. అందుకే మహారాష్ట్ర గడ్డ మీద మన బిడ్డలు జరుపుకొనే ఈ పండుగ తెలంగాణ వైభవాన్ని చాటుతుంది. ముంబయి తెలుగు కల్చరల్ అసోసియేషన్, భీవండి అఖిల పద్మశాలీ సమాజం… మహారాష్ట్రలో ప్రముఖంగా బతుకమ్మ వేడుకను జరుపుతున్న సంఘాల్లో తొలి వరుసలో ఉన్నాయి. వాటి అధ్యక్షులు తమ ప్రాంతంలో జరిగే ఈ వేడుకల్లోని విశేషాలను పంచుకున్నారిలా…
కత్తెర శంకరయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్
ముంబయి తెలుగు కల్చరల్ అసోసియేషన్
నార్త్ ముంబయి ప్రాంతంలో మల్లాద్ నుంచి దహిసర్ వరకూ 25 బస్తీల్లో తెలుగువారు నివసిస్తున్నారు. దాదాపు 50 వేల మంది తెలుగువారు ఉంటారిక్కడ. అందులో తెలంగాణ ప్రాంతం నుంచి తరలివచ్చిన వాళ్ల సంఖ్యే ఎక్కువ. అందుకే తొలి నుంచీ ఇక్కడి ప్రతి బస్తీలోనూ బతుకమ్మ ఆటలు ఆడుతుంటారు. నవరాత్రుల్లో ఇక్కడి వీధుల్లో బతుకమ్మ పాటలు మార్మోగుతుంటాయి. అయితే మన వాళ్లందరినీ ఒక దగ్గరికి తీసుకురావాలన్న లక్ష్యంతో నాలుగేండ్ల క్రితం ప్రత్యేకంగా తెలుగు వారికోసం ‘ముంబయి తెలుగు కల్చరల్ అసోసియేషన్’ను ఏర్పాటు చేశాం. ఆ తర్వాత మేం చేసిన తొలి పండుగ బతుకమ్మే. ఇందుకోసం ముందుగా మేం ఒక పెద్ద గ్రౌండ్‌ను ఎంచుకుంటాం. అక్కడే ఒక నీటి కుంటనూ ఏర్పాటు చేసుకుంటాం. సద్దుల బతుకమ్మ రోజు కానీ, దాని ముందు వచ్చే ఆదివారం కానీ అందరూ కలిసి బతుకమ్మ ఆడేలా తేదీని ఎంచుకుంటాం. ఎందుకంటే ప్రతి రోజూ కలిసి ఆడటానికి ఇక్కడ చాలామంది భార్యాభర్తలు ఇద్దరూ పనులు, ఉద్యోగాలకు వెళ్లే వాళ్లే.
ఇక, తేదీ నిర్ణయించుకున్నా మన వాళ్లు ఒక్కో బస్తీ నుంచి ఒక్కో బతుకమ్మను పేర్చుకుని వస్తారు. ఆడవాళ్లందరూ సరదాగా ప్రాంతానికో రంగు అనుకొని ఆ చీరలు కట్టుకుంటారు. ఇక ఒక్కో బతుకమ్మ వేదిక ముందుకు చేరుతుండగానే డప్పుల చప్పుళ్లు, నృత్యాలతో ఆహ్వానం పలుకుతూ లోపలికి తెచ్చుకుంటాం. లోపల గ్రూపులుగా మహిళలంతా ఆడుతుంటారు. మా దగ్గర గాజుల నర్సారెడ్డి అని ఓ మంచి గాయకుడు ఉన్నారు. తెలంగాణలో గద్దర్ అన్నలాగా చాలా మంచిగ పాటలు పాడతారు. ఆయన బృందం కూడా ఈ వేడుకకు వస్తుంది. ఆయన మైక్‌లో పాడుతుంటే ఆడవాళ్లందరూ అనుసరిస్తూ పాడతారు. డీజే చప్పుళ్లు ఇక ఉండనే ఉంటాయి. బతుకమ్మలకు ప్రైజులు కూడా ఇస్తాం. క్రితం ఏడాది వేడుకకు ఆరువేల మందికి భోజనాలు పెట్టాం. ప్రభుత్వం కూడా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. మా లోకల్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వచ్చి ఆటలో భాగమవుతారు. చాలా గౌరవంగా చూస్తారు. త్వరలో మన వాళ్ల కోసం కమ్యూనిటీ భవనం కట్టాలని అనుకుంటున్నాం. ఈసారి 28వ తేదీన మా కార్యక్రమం ఉంది. ఈ వేడుకల్ని చూసిన వాళ్లెవరైనా ఇది తెలంగాణ కాదంటే నమ్మలేరు.
పొట్టబత్తిని రామకృష్ణ, అధ్యక్షుడు
అఖిల పద్మశాలి సమాజం, భీవండి
తెలంగాణకీ భీవండికీ తరాల సంబంధం ఉంది. నేత మగ్గాల సడుగులిరిగిన నేపథ్యంలోనే ఇక్కడి పవర్‌లూమ్స్ మీద పనిచేసేందుకు ఊళ్లు వదిలి కుటుంబాలకు కుటుంబాలు తరలి వచ్చినై. అందులోనూ నేతనే వృత్తిగా పెట్టుకున్న పద్మశాలీ సామాజిక వర్గం వారు అత్యధికులు. అయితే తెలంగాణ స్వరాష్ట్ర కల నెరవేరాక నాకు తెలిసి ఇదే ప్రాంతం నుంచి పాతిక శాతానికి పైగా ప్రజలు వెనక్కు మళ్లారు. మా నల్లగొండ ప్రాంతానికి మంచి నీళ్లు, సాగు నీళ్లు రావడం కానివ్వండి, భువనగిరి, సిరిసిల్లల్లో పవర్‌లూమ్స్ ఏర్పాటు కానివ్వండి, వరంగల్‌లో టెక్స్టైల్ పార్కు పురుడు పోసుకోవడం కానివ్వండి… కేసీఆర్ సార్ ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చిన అనేక మార్పుల వల్ల ఇక్కడి వాళ్లకు తెలంగాణ నేల మీద ఆశ ఏర్పడింది. మళ్లీ మన ఊళ్లకి వెళ్లి బతకొచ్చనే ధైర్యం వచ్చింది. దీంతో గడచిన పదేండ్లలో ఒక్క మా భీవండి నుంచే 50 వేల నుంచి 75 వేల మంది తిరిగి తెలంగాణకు తరలి వెళ్లారు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది పవర్‌లూమ్స్‌లో సాంచాలు నడపడం, రిపేర్లు చేయడంలాంటి పనులు చేస్తుంటారు. అయితే, ఈ తిరుగు వలసలకు నేను ఉదాహరణ కూడా చెప్పగలను. 1994లో నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలలో 15 వేల మందిదాకా తెలుగు పిల్లలు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 5 వేలు కూడా దాటదు.
ఇక, ప్రస్తుతం కూడా భీవండిలో 2 లక్షల మంది మా సామాజిక వర్గం వారు ఉన్నారు. వీళ్లు కాక, మన తెలంగాణకు చెందిన వేరే వర్గాల వాళ్లు మరో పది వేల మంది దాకా ఉంటారు. అందుకే ఇక్కడ 200 చోట్ల బతుకమ్మ ఆడుతారు. పెద్ద వాళ్లందరూ పాటలు చెబుతుంటే మిగిలిన వాళ్లు పాడుతుంటారు. సద్దుల బతుకమ్మ నాడు మా దగ్గర వరాల చెరువులో నిమజ్జనం చేస్తాం. ఇక్కడ రెండు మూడు ఘాట్లు ఉంటాయి. మున్సిపాలిటీ, పోలీస్, ట్రాఫిక్ విభాగాలు ఈ వేడుక కోసం పనిచేస్తాయి. మా దగ్గర రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి దాకా లీడర్లందరూ వస్తారు. మేము, మాలాంటి ఇతర సంఘాల వాళ్లు మంచినీళ్లు, జ్యూసులు, స్నాక్స్‌లాంటివి ఇక్కడ ఆడేవాళ్ల కోసం పంచుతాం. మన పండుగ అంటే ఇక్కడ ఉండే మరాఠీలు, గుజరాతీలకు కూడా సరదానే. వాళ్లు కూడా బతుకమ్మ ఆడుతారు. వాళ్ల తరహాలో దాండియా, గర్భా నృత్యాలనూ ఇక్కడ మనం చూడొచ్చు. పోయిన ఏడాది భీవండిలో మొత్తం 5 వేల బతుకమ్మలు వచ్చాయి. మేం అందులో 500 బతుకమ్మలకు బహుమతులు అందించాం. మన సంప్రదాయాల్ని ప్రోత్సహించుకోవడానికి, మేమంతా కలిసి కట్టుగా ఉండటానికి ఈ బతుకమ్మ పండుగ మంచి అవకాశం. అందుకే మా పిల్లలతోనూ బతుకమ్మ ఆడిస్తున్నాం.
వేరే రాష్ర్టాల వాళ్లు కూడా పేరుస్తారు!
బతుకమ్మ పేర్చేందుకు ఏమేం కావాలో అన్నీ మా భీవండిలో దొరుకుతాయి. ఈ పండుగ సీజన్లో అచ్చంగా బతుకమ్మ పువ్వులు అమ్మేందుకే స్టాల్స్ వెలుస్తాయి. గునక, గుమ్మడి, పోడ, బొండు మల్లె, అసిరమ్మ, పట్నం పొత్తులు, గోరంటలు… ఇట్ల మన ఊళ్లలో దొరికే పువ్వులన్నీ వీళ్లు పట్టుకొస్తారు. తంగేడు పువ్వు, రొట్ట కూడా తెస్తారు. అంతెందుకు బతుకమ్మ పేర్చే ముందు పళ్లెంలో మనం పరుచుకునే గుమ్మడి ఆకులు కూడా తెచ్చిపెడతారు. మేం కూడా తల్లి గుమ్మడిలో ఉండే బొడ్డెమ్మను గౌరమ్మగా పెట్టుకుంటాం. సత్తు నివేదన చేస్తాం. మహారాష్ట్ర ప్రాంతంలో మలీద సత్తు అని ఒకటి ప్రత్యేకంగా చేస్తాం. అంటే రొట్టె చేసి దాన్ని మళ్లీ మిక్సీ పట్టి సత్తు చేస్తాం అన్నమాట. మరో చిత్రమైన విషయం ఏమిటంటే, మన రాష్ట్రం కాని వాళ్లకు కూడా ఇక్కడ బతుకమ్మ పేర్చడం వచ్చు. అంటే వాళ్లు మాతో కలిసి ఎన్నో ఏళ్ల నుంచి పండుగ చేసుకుంటారు కదా అందుకు. ఆడేవాళ్లలో కొత్త వాళ్లకి బతుకమ్మ పేర్చడం రాకపోతే వీళ్లలో కొందరు కొంత సొమ్ము తీసుకొని పేర్చి ఇస్తారు కూడా. ఎక్కడ ఉన్నా మన సంప్రదాయాలు పాటించాలని మా అమ్మానాన్నా నేర్పించారు. అందుకే మేం ఎంతో భక్తితో బతుకమ్మ ఆడతాం.