బాల్యంలో బొమ్మలతో ఎంత ఎక్కువసేపు ఆడుకుంటే పెద్దయ్యాక అంత పరిపూర్ణ వ్యక్తులుగా తయారవుతారని మానసిక నిపుణులు చెబుతున్నారు. పసివాళ్లు బొమ్మల్ని స్నేహితుల్లా భావిస్తారు. మాట్లాడతారు. కోప్పడతారు. లాలిస్తారు. ఆడిస్తారు. ఇవన్నీ వారిలో ‘సోషల్ స్కిల్స్’ను వృద్ధి చేస్తాయనేది శాస్త్రవేత్తల మాట.
బొమ్మలాట రోజూ ఒకేలా ఆడుకోరు కదా! నేడు స్కూల్ ఆట, రేపు పెండ్లి ఆట, ఎల్లుండి సూపర్‌మ్యాన్ ఆట. వైవిధ్యం పెరగాలంటే సృజన పెరగాలి. ఇదో రకమైన మానసిక కసరత్తు కూడా.
కొందరు పిల్లల్లో మొహమాటం ఎక్కువ. కొత్తవారితో మాట్లాడాలంటే ఇబ్బంది పడతారు. బొమ్మ ఆ బిడియాన్ని పోగొడుతుంది. భావ ప్రకటనకు అవకాశం కల్పిస్తుంది.
ముక్కలను పేర్చి ఓ ఆకృతి ఇవ్వడం, కిచెన్ సెట్లోని పాత్రలను చక్కగా సర్దడం, ఆ తర్వాత జాగ్రత్తగా దాచు
కోవడం.. ఇవన్నీ పిల్లల్లో బాధ్యతను పెంచే పనులే.
ఆట అంటే.. మనదైన ఊహాలోకంలోకి వెళ్లిపోవడం. ఓ కొత్త వాతావరణాన్ని సృష్టించుకోవడం. దీనికి బోలెడంత ఏకాగ్రత కావాలి. బొమ్మల జగత్తు ఆ సమయంలో ఐడియా బ్యాంక్‌లా పనిచేస్తుంది.
బొమ్మలతో మాట్లాడాలన్నా, భావాలు పంచుకోవాలన్నా.. ఎంతోకొంత పద సంపద కావాలి. దీంతో పిల్లలు కన్నవాళ్ల భాషను జాగ్రత్తగా గమనిస్తారు. తమకు అవసరమైన ముడిసరుకును అందులోంచి ఏరుకుంటారు.
చిన్నప్పుడు నాన్న కొనిచ్చిన విమానం బొమ్మ నాలో పైలట్ కావాలనే ఆకాంక్షను పెంచింది, పుట్టిన రోజు తాతయ్య గిఫ్ట్ ఇచ్చిన తుపాకి బొమ్మ సైన్యంలో చేరాలనే ఆలోచనకు స్ఫూర్తి.. అని చాలామంది చెబుతుంటారు. ఈ మాట నిజం.
..కాకపోతే హింసాత్మకమైన ఆలోచనలు రేకెత్తించే బొమ్మలు కొనివ్వకండి. హానికర రసాయనాలతో చేసినవీ వద్దు. పదునైన ఆయుధాల్లాంటివి అసలే వద్దు. మరీ సున్నితమైనవి ఎక్కువ కాలం మన్నిక రావు. ఈసారి పిల్లల కోసం బొమ్మల షాపింగ్‌కు వెళ్లినప్పుడు ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకోండి.