కనుబొమలు.. ముఖారవిందాన్ని మరో మెట్టు ఎక్కిస్తాయి. అందుకే, చాలామంది అందంగా కనిపించడానికి వీటిని పొందికగా తీర్చిదిద్దుకుంటారు. అయితే, కనుబొమలు.. ఆరోగ్య రహస్యాలనూ బయటపెడతాయని నిపుణులు అంటున్నారు. వెంట్రుకల మందం, పొడవుతోపాటు వాటి బలాన్ని బట్టి, మనిషి ఆరోగ్యాన్ని అంచనావేయొచ్చని అంటున్నారు. కనుబొమలు చాలా నెమ్మదిగా పెరుగుతాయి. కాబట్టి, అవి శరీరంలోని అంతర్లీన ఆరోగ్య సమస్యలను బహిర్గతం చేస్తాయట. వాటిలో మార్పులను జాగ్రత్తగా గమనిస్తే.. పలు సమస్యలను ముందే గుర్తించొచ్చని చెబుతున్నారు.
కనుబొమలు సన్నబడటం, చిన్నగా, పెళుసుగా మారడం అనేది.. పోషకాహార లోపానికి సంకేతం కావచ్చు. ఆరోగ్యకరమైన వెంట్రుకల పెరుగుదలకు బయోటిన్, ఐరన్, జింక్, విటమిన్ డితోపాటు ప్రొటీన్ లాంటి పోషకాలు ఎంతో అవసరం. ఇవి లేకపోతే.. వెంట్రుకలు బలహీనపడటం, రాలిపోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా.. వెంట్రుకలు తిరిగి ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది.
హైపర్ థైరాయిడిజం ఉన్నట్లయితే.. వెంట్రుకలు పెళుసుగా మారి, ఇట్టే రాలిపోతుంటాయి. ఈ విషయాన్ని జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ ట్రాన్స్లేషన్ ఎండోక్రినాలజీలో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. నియంత్రించలేని హైపోథైరాయిడిజం.. గణనీయమైన వెంట్రుకల నష్టానికి కారణమవుతుందని తేల్చింది. థైరాయిడ్‌కు సరైన చికిత్సతో హార్మోన్ల సమతుల్యతను పునరుద్ధరించొచ్చు. ఫలితంగా కనుబొమలు కూడా మళ్లీ పెరిగే అవకాశం ఉంటుంది.
మెనోపాజ్ సమయంలో హార్మోన్లలో వచ్చే మార్పులు.. కనుబొమల సాంద్రత, పెరుగుదలపై ప్రభావం చూపుతాయి.
అలసట, బరువులో హెచ్చుతగ్గులు, మానసిక స్థితిలో మార్పులు సంభవిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. థైరాయిడ్, హార్మోన్ల సమస్యలపై వైద్యులను సంప్రదించడం మంచిది.
కనుబొమలు రాలుతున్నాయంటే.. దీర్ఘకాలిక ఒత్తిడి, ఆటో ఇమ్యూన్ పరిస్థితులు కావొచ్చు. ‘అలోపేసియా అరేటా’ అనే ఆటో ఇమ్యూన్ డిసీజ్.. వెంట్రుకల కుదుళ్లపై దాడి చేస్తుంది. ఫలితంగా వెంట్రుకలు రాలిపోతాయి. ఆటో ఇమ్యూన్ వ్యాధులు, హార్మోన్ల సమస్యలు.. వెంట్రుకలు, కనుబొమలపై ప్రభావం చూపుతాయని జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ అండ్ క్లినికల్ రీసెర్చ్‌లో ప్రచురితమైన ఓ సమీక్ష వెల్లడించింది.