ఆరోగ్యానికి తాజా పండ్లే కాదు.. వాటి తొక్కలూ ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా, నారింజ తొక్కల్లో అందానికి మెరుగులద్దే సుగుణాలు ఎన్నో ఉంటాయి. చర్మ సంరక్షణలో ఎంతగానో సహకరిస్తాయి. ఇందులోని పోషకాలు.. మచ్చలు, ముడతలను తగ్గించి, చర్మాన్ని కాంతిమంతంగా మార్చడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అందుకే.. నారింజ తొక్కలను ఎన్నో రకాల సౌందర్య ఉత్పత్తుల్లో వాడుతుంటారు. అయితే, ఇంట్లోనే నారింజ తొక్కలతో సహజసిద్ధమైన బ్యూటీ ప్రొడక్ట్స్‌ను తయారుచేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం నారింజ తొక్కలను నీడలో ఆరబెట్టి.. పొడి చేసుకొని గాలి చొరబడని డబ్బాలో భద్రపరచుకోవాలి.
ఒక గిన్నెలో టేబుల్ స్పూన్ నారింజ తొక్కల పొడిని తీసుకోవాలి. దీనికి టమాటా రసం, పెరుగు, పాలు, ఆలివ్ ఆయిల్, తేనె.. వీటిలో దేన్నయినా టేబుల్ స్పూన్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ఫేస్‌ప్యాక్‌లా వేసుకొని, 20-30 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే.. చర్మం కాంతిమంతంగా తయారవుతుంది.
టేబుల్ స్పూన్ నారింజ తొక్కల పొడిలో చక్కెర, తేనె, ఆలివ్ ఆయిల్ ఒక్కో టీ స్పూన్ చొప్పున తీసుకోవాలి. వీటిని బాగా కలిపి.. ముఖానికి స్క్రబ్ చేసుకుంటే.. చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోతాయి. వైట్‌హెడ్స్, బ్లాక్‌హెడ్స్‌ను నివారించడంలోనూ ఈ స్క్రబ్ సమర్థంగా పనిచేస్తుంది. చర్మం మృదువుగా మారుతుంది.
ఒక టేబుల్ స్పూన్ నారింజ తొక్కల పొడిలో కొద్దిగా ముల్తానీ మట్టి, చిటికెడు పసుపు, పాలు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని.. పది నిమిషాల తర్వాత కడిగేయాలి. జిడ్డు తొలగిపోయి, ముఖం నిగారిస్తుంది.
ముఖంపై ట్యాన్‌ను తొలగించడంలోనూ ఈ పొడి ముందుంటుంది. ఒక టేబుల్ స్పూన్ నారింజ తొక్కల పొడిలో.. ఒక టీస్పూన్ బియ్మం పిండి, రోజ్‌వాటర్‌ను కలపాలి. దీన్ని మెత్తటి పేస్ట్‌గా చేసి.. ముఖానికి మాస్క్‌లాగా అప్లయి చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే.. ముఖంపై ఉండే ట్యాన్ తొలగిపోతుంది.