పట్టులా మెరిసిపోయే కురులకు ధగధగలాడే అద్దాలు తోడైతే ఆ అందం ఎంత బాగుంటుందో అంటూ ఫ్యాషనిస్టులు చేసిన ఓ ఆలోచన అమ్మాయి సిగను తళుక్కుమనేలా చేసింది! అందుకే ఇప్పుడు మిర్రర్ బన్, మిర్రర్ హెయిర్ క్లిప్, హెయిర్ పిన్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. అసలైన అద్దాలు పొదిగిన ఈ యాక్సెసరీలు రకరకాల వెరైటీల్లో రూపొందుతున్నాయి. జడ విరబోసి, అందులోని కొన్ని వెంట్రుకలను కలుపుతూ పెట్టుకునే క్లిప్పులకు అద్దాలు, దారాలతో వర్క్ చేసి వస్తున్నవి ఒక మోడల్ అయితే, తల మీద కిరీటం పెట్టినట్టు వరుసగా అద్దాలను అమర్చి చేస్తున్నవి మరో మోడల్.
పూర్తి కొప్పు వేసుకునేవారి కోసం బన్ మొత్తం పూసలు, పువ్వులతో మిర్రర్ వర్క్ చేసి వచ్చే వాటితో పాటు, క్యాజువల్‌గా ఫ్యాషన్‌గా సిగను చుట్టినా ఓ అద్దపు పిన్ను పెట్టుకునే వీలుండే వాటిదాకా ఇందులో ఎన్నెన్నో వెరైటీలు తయారవుతున్నాయి. అసలే తళుకుల్ని ఇష్టపడే అమ్మాయిలు చమక్కుమనే అద్దాల యాక్సెసరీలకు తమ ఫ్యాషన్ పెట్టెలో చోటివ్వకుండా ఉంటారా!