నూనెల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతున్నది. ఆ నూనెలు జుట్టుకు రాసుకోవడం వల్ల కేశ సౌందర్యం పెరగడమే కాదు అందాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. నాలుగు రకాల నూనెల వల్ల జుట్టుకు రకరకాల లాభాలున్నాయి.
బాదం నూనె: చిట్లిపోతున్న వెంట్రుకలు, పొడిబారే వెంట్రుకలకు బాదం నూనె రాస్తే.. ఎంతో మేలు చేస్తుంది. ఈ నూనె కలిగించే తేమ వల్ల జుట్టు మెత్తబడి మృదువుగా తయారవుతుంది. జుట్టు చిట్లిపోవడం ఆగిపోతుంది. పొడిబారడం తగ్గుతుంది.
ఉసిరి నూనె: పెళుసుగా ఉండే వెంట్రుకలు తెగిపోతుంటాయి. నెత్తిన జుట్టు దట్టంగా ఉన్నా అంతగా పెరగదు. జుట్టు పెరిగే క్రమంలో తెగిపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఆమ్లా (ఉసిరి) నూనె రాసుకుంటే కేశసిరిని కాపాడుకోవచ్చు. ఉసిరి నూనెలో విటమిన్ సి, ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెళుసుబారుతనాన్ని తగ్గిస్తాయి. దృఢత్వాన్ని పెంచుతాయి.
కొబ్బరి నూనె: అన్ని రకాల వెంట్రుకలకు కొబ్బరి నూనె రాసుకోవచ్చు. ఇది పొడిబారిన, రంగు పోతున్న వెంట్రుకలకు బాగా మేలు చేస్తుంది. మందంగా ఉన్న వెంట్రుకలను మెత్తబడేలా చేస్తుంది. అలాగే ఉంగరాల జుట్టును కొద్దిగా సాఫీగా మారుస్తుంది. పొడిబారడం, ఫంగస్ సోకడం వల్ల మాడుపై కలిగే దురదను కూడా తగ్గిస్తుంది.
ఆవనూనె: ఇందులో విటమిన్లు, ఖనిజ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఆవనూనె వెంట్రుకలను పెరిగేలా చేస్తుంది. ఇది యాంటి ఫంగల్, యాంటి మైక్రోబియమ్గా పని చేస్తుంది. కాబట్టి చుండ్రు, ఇతర సమస్యలను నివారిస్తుంది.