కలువరేకుల్లాంటి కండ్ల తర్వాత అతివ అందాన్ని అందనంత పెంచేవి అధరాలే! అందుకే పెదాల వైనాన్ని చెప్పడానికి మహామహా కవులకు సైతం పదాలు కరువవుతుంటాయి. బుంగమూతి పెట్టినప్పుడు రోజా మొగ్గలా ముడుచుకుంటాయివి. చిరునవ్వు వేళ గులాబీ రేకులను మరిపిస్తాయి. ధారాళంగా నవ్వినప్పుడు శతదళ కమలం విచ్చుకున్నట్టు కనిపిస్తాయి. ఇంతటి ఇంపైన పెదాలకు లిప్‌స్టిక్ పూస్తేనే ఇంతులకు ముచ్చట. అయితే, నాణ్యత కరువైన సాధనాలు ఎంచుకుంటే అందం ఇనుమడించకపోగా.. ఆరోగ్యమూ మందగించవచ్చు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. నాసిరకం లిప్‌స్టిక్ ఉపయోగించడం వల్ల సమస్యలు ఉత్పన్నం అవుతాయి. చాలా లిప్‌స్టిక్స్‌లో సీసం, పెట్రో రసాయనాలు, క్రోమియం, కాడ్మియం లాంటి ప్రమాదకర రసాయనాలు వాడుతుంటారు. ఇవి పెదవుల నుంచి శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. వీటివల్ల మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటుంది. సీసం నాడీవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. తద్వారా మెదడు పనితీరు మందగించవచ్చు. అంతేకాదు రక్తంలోకి సీసం చొరబడితే హార్మోన్ల అసమతుల్యత, వంధ్యత్వం ఏర్పడే ప్రమాదమూ ఉందని పలు నివేదికల సారాంశం. లిప్‌స్టిక్‌లో పారాబెన్స్, బిస్మత్ అక్సీ క్లోరైడ్ వంటి పదార్థాలు కూడా క్యాన్సర్ కారకాలే! చిరునవ్వులు చిందిస్తే పై పూతలు లేకున్నా పెదాలు అందంగానే ఉంటాయి. అంతగా వాడాలి అనుకుంటే నాణ్యమైన లిప్స్టిక్స్ ఎంచుకోండి. బీట్రూట్, గులాబీ వంటి సహజ పదార్థాలతో తయారుచేసిన నేచురల్ లిప్‌స్టిక్‌ని వాడితే మరీ మంచిది.