రంగురంగుల పూలలో అందంతోపాటు అపాయమూ దాగున్నది. అవి ఎక్కువ కాలం తాజాగా కనిపించేందుకు రకరకాల రసాయనాలను వాడుతుంటారు. ఇలా రసాయనాల వాడకం.. పూల వ్యాపారంలో సర్వసాధారణం. అయితే, వాటివల్ల ఆరోగ్యానికి తీవ్రమైన హానికలిగే అవకాశం ఉన్నది.
కొన్నిరకాల పూలలో ‘ఇథిలిన్’ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల పూలు త్వరగా ముడుచుకుపోతాయి. అలాకాకుండా ఉండేందుకు పూలపై సిల్వర్ థియోసల్ఫేట్తో పిచికారీ చేస్తారు. ఇక పూలపై బ్యాక్టీరియా చేరకుండా ఉండేందుకు ఫ్లోరల్ ప్రిజర్వేటివ్స్తో కోటింగ్ చేస్తారు. పూల రేకులపై తేమ ఆవిరి కాకుండా, పూలు చాలారోజులపాటు తాజాగా ఉండేందుకు సింథటిక్ వ్యాక్స్, సింథటిక్ పాలిమర్లను స్ప్రే చేస్తారు. ఇవన్నీ పూలపై చేరి.. వాటిని వాడినప్పుడు తీవ్రమైన దుష్ప్రభావాలు కలిగిస్తాయి.
రసాయనాలతో నిండిన పూలను ఎక్కువ సేపు పెట్టుకోవడం, పట్టుకోవడం వల్ల.. చర్మంపై దద్దుర్లు, దురద, అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. ఈ పూలను నేరుగా ముక్కు దగ్గర పెట్టుకొని వాసన పీలిస్తే.. తలనొప్పి, మైకం వచ్చేస్తుంది. మరికొందరిలో తుమ్ములు, దగ్గుతోపాటు శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు ఏర్పడతాయి. పూలు వాడిపోయిన తర్వాత వాటిని పారేసినప్పుడు.. ఈ రసాయనాలు మట్టిలో, నీటిలో కలుస్తాయి. ముఖ్యంగా ‘సిల్వర్’ లాంటి లోహాలు జలచరాలకు హాని కలిగిస్తాయి.
కాబట్టి, బజార్లో కొనుగోలు చేసిన పూలను వాడే ముందు మంచి నీటిలో కొద్దిసేపు నిల్వ ఉంచి, తీసి ఆరబెట్టాలి. దీనివల్ల రసాయనాల ప్రభావం కొంతమేర తగ్గుతుంది. ఒకవేళ రైతుల నుంచి స్వచ్ఛమైన పూలు సేకరిస్తే.. వాటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి కొన్ని సంప్రదాయ పద్ధతులు పాటించాలి. లీటర్ నీటిలో ఒక టీస్పూన్ చక్కెర, రెండు టీస్పూన్ల నిమ్మరసం కలిపి.. ఆ నీటిలో పూలను కొద్దిసేపు ఉంచాలి. దీనివల్ల పూలు కొన్నిరోజుల పాటు తాజాగా ఉంటాయి.