Cinema news | తెలుగింటి సీతమ్మగా కొత్త ఘనత వహించిన నటి ఆలియా భట్. బాలీవుడ్లో ఈ అమ్మడుకు బోలెడంత క్రేజ్ ఉంది. ట్రిపుల్ ఆర్ వచ్చి రెండేండ్లు గడిచిపోయినా ఇప్పటికీ అంతే ఆదరణ పొందుతున్నది. అమ్మయ్యాక కూడా సినిమాల వేగం తగ్గించలేదు. గత నెల విడుదలైన ‘రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ’ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లే సాధించింది. మరో మూడు భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నది. వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఆలియా అంతరంగం..
బర్త్ సర్టిఫికెట్ చూసినప్పుడు నా వయసు 30 ఏండ్లు అని తెలుస్తుంది. నాకైతే పదేండ్లే! మరీ అలా చెప్పేస్తోందేంటీ అనుకోకండి!! నేను ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం అయింది. అందుకే పదేండ్లు అని ఫిక్సయ్యా! ఈ దశాబ్దం నాకు పదినెలల్లా అనిపిస్తుంటుంది. ఈ తక్కువ సమయంలోనే నా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఈ పదేండ్ల డైరీలో ప్రతి పేజీ ఒక చాప్టరే! కాలం భారంగా సాగితే.. ఒకపూట గడవాలన్నా కష్టంగానే అనిపిస్తుంది. ఇలా వేగంగా కరిగిపోతుంటేనే మజాగా ఉంటుంది!!
డెస్టినీని బలంగా నమ్ముతా! మనం వెంటపడ్డంత మాత్రాన అన్నీ దక్కవు. ఏమీ చేయకుండా కూర్చుంటే ఏదీ దొరకదు. మానవ ప్రయత్నాన్ని నమ్ముకొని ముందుకు వెళ్లడమే! ఫలితం అంటారా, మన కష్టంలో నిజాయతీ ఉంటే అదే వస్తుంది. అంతేకానీ, ప్రతి చిన్న విషయానికీ అతిగా ఆలోచించి, ఒత్తిడి పెంచేసుకొని, మూతి ముడుచుకొని కూర్చోవడం అంటే నాకు చిరాకు. ప్రతి క్షణాన్నీ
విలక్షణంగా ఆస్వాదిస్తేనే జీవితం ఆనందంగా ఉంటుంది.
మగువలు మల్టీటాస్కింగ్ చేయడంలో మహారాణులే! లైఫ్, పనులను బ్యాలెన్స్ చేయడంలో వాళ్లకు మంచి పట్టు ఉంటుంది. అలాగని చెప్పినంత తేలికైతే కాదనుకోండి. ఏ పని చేయడానికైనా సంసిద్ధంగా ఉండటమే అసలు టాస్క్. నేను చేయగలనన్న నమ్మకం ఉంటే, ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతాయి. నటన, నిర్మాణ వ్యవహారాలు, కుటుంబం, మాతృత్వం ఇవన్నీ బ్యాలెన్స్ చేయగలను అనుకుంటే భేషుగ్గా చేసేస్తాం. ‘అమ్మో!’ అనుకుంటే అక్కడితో ఆగిపోవాల్సిందే!!
క్షణక్షణానికీ కాలం ఎలాగైతే మారిపోతుందో, దాంతోపాటూ మనమూ మారిపోతాం. రకరకాల అనుభవాలు ఎదురయ్యే కొద్దీ జీవితం కొత్తదనం సంతరించుకుంటూ ఉంటుంది. కొన్ని మధురమైన రోజులు ఆనందాన్ని పంచుతాయి. కఠినమైన రోజులు కొత్త పాఠం నేర్పుతాయి. కొన్ని నిర్ణయాలు మన ప్రత్యేకతను చాటుతాయి. మరికొన్ని పక్కదారి పట్టిస్తాయి. వీటిని ఎప్పటికప్పుడూ విశ్లేషించుకుంటూ, కాలానుగుణంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. గడిచిన పదేండ్లుగా నేను ఫాలో అవుతున్నది అదే! ఈ ప్రస్థానంలో కొన్నిసార్లు ఊహించని విజయాలు అందుకున్నవీ ఉన్నాయి. దారుణంగా దెబ్బతిన్నవీ ఉన్నాయి. ప్రతి అనుభవమూ గొప్పదనే భావిస్తా.
నాలా ఆలోచించేవారితో త్వరగా కలిసిపోతా! నెగెటివ్ ఆలోచనలు ఉన్నవారితో అంతగా కలవలేను. ప్రశాంతంగా ఉండే వాళ్లంటే నాకు ఇష్టం. వారితో సమయం గడిపితే మనమూ ప్రశాంతంగా ఉండగలం. అంతేకానీ, కుయుక్తులు పన్నేవారితో స్నేహం చేస్తే, మనకూ అవే బుద్ధులు వస్తాయనిపిస్తుంది. అందుకే, అలాంటివారికి కొంత దూరంగా ఉండే ప్రయత్నం చేస్తాను.