e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home జిందగీ ఆ ముగ్గురూ.. నా గురువులు!

ఆ ముగ్గురూ.. నా గురువులు!

వేసవి సెలవుల్లో ఆ చిచ్చర పిడుగు అల్లరిని తట్టుకోలేక అమ్మానాన్న సమ్మర్‌ క్యాంప్‌లో జాయిన్‌ చేశారు. ఆ వేసవి శిబిరమే తనను సినీ పరిశ్రమకు పరిచయం చేసి కెరీర్‌కు బాటలు వేసిందని అంటున్నారు నటి కరుణ భూషణ్‌. స్టార్‌ హీరోలు, డైరెక్టర్లతో పనిచేసిన కరుణ. అటు వెండి తెరపై, ఇటు బుల్లి తెరపై విభిన్న పాత్రల్లో రాణిస్తున్నారు. ‘ఆహా’ అంటూ అందరినీ పలుకరించిన కరుణ తన పాతికేళ్ల అనుభవాలను ‘జిందగీ’తో పంచుకున్నారిలా..

మాది మరాఠీ కుటుంబం. పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. నాన్న ఈసీఐఎల్‌లో ఉద్యోగి. అమ్మ గృహిణి. వేసవి సెలవుల్లో నా అల్లరికి తట్టుకోలేక, బాల భవన్‌ సమ్మర్‌ క్యాంప్‌లో చేర్పించేవారు. సింగింగ్‌, స్విమ్మింగ్‌ నేర్చుకొనేదాన్ని. అప్పుడే, సినిమాల్లో పనిచేసే ఒకాయన అక్కడికి వచ్చారు. ఓ సినిమాలో చేయడానికి పిల్లలు కావాలంటూ మమ్మల్ని తీసుకెళ్ళారు. అలా 1997లో జగపతిబాబుగారి ‘ఆహా’ సినిమాతో కెమెరా ముందుకొచ్చాను. తర్వాత బాలనటిగా, సహాయనటిగా దాదాపు ముప్పై సినిమాల్లో నటించాను. ప్రతి సినిమా నుంచి ఎంతో కొంత నేర్చుకొన్నా. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘మాస్‌’, ‘మంత్ర’, ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’, ‘నమో వెంకటేశా’,‘ఆగడు’, ‘చాణక్య’, ‘శ్రీమంతుడు’ తదితర చిత్రాలు నన్ను నిలబెట్టాయి.

- Advertisement -

సీరియల్స్‌వైపు..
బాలనటిగా గుర్తింపు రావడంతో చాలా అవకాశాలు వరించాయి. నాగార్జున గారి ‘మాస్‌’లో చేస్తున్నప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిస్తున్న ఓ సీరియల్‌ కాన్సెప్ట్‌ చాలా బాగుందని, తప్పక చేయమనీ సలహా ఇచ్చారు అక్కడ పనిచేసే రవిగారు. సీరియల్‌ అనగానే కొంత భయం వేసింది. పుట్టి పెరిగింది ఇక్కడే అయినా నాకు తెలుగు పూర్తిగా రాదు. అప్పటికి సినిమాల్లో బిజీగా ఉన్నాను. కానీ కాన్సెప్ట్‌ విన్నాక, ఓసారి ప్రయత్నించి చూద్దామని ఆడిషన్‌కి వెళ్ళాను. అంతమందిలో నన్నే ఎంపిక చేశారు. అలా అన్నపూర్ణ ప్రొడక్షన్స్‌లో వచ్చిన ‘యువ’ సీరియల్‌తో బుల్లితెరపై కనిపించా. ఆ తర్వాత దాదాపు అన్ని చానళ్ళకూ పనిచేశా. పసుపు కుంకుమ, అభిషేకం, శ్రావణ సమీరాలు, మొగలిరేకులు, నాతిచరామి, నీలి కలువలు, చిట్టితల్లి.. ఇలా దాదాపు పదిహేను సీరియళ్లలో నటించా. ఈటీవీలో వచ్చిన ‘శ్రావణ సమీరాలు’ సీరియల్‌కు ఏడు అవార్డులు అందుకున్నా. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుగారి ప్రశంసలూ లభించాయి.

‘విహారి’గా పద్నాలుగేండ్లు
సినిమాలు చేస్తూనే రకరకాల ప్రోగ్రామ్స్‌కు యాంకర్‌గా వ్యవహరించాను. ‘విహారి ది ట్రావెలర్‌’ షో 14 ఏండ్లు చేశాను. షోలో భాగంగా దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలనూ చుట్టొచ్చాను. మన సంస్కృతి, సంప్రదాయాలను లోతుగా తెలుసుకునేందుకు ఆ షో ఉపయోగపడింది. ‘రంగస్థలం’, ‘సై సై సయ్యారే’ డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌లు కూడా చేశాను. అరడజను సినిమాల్లో హీరోయిన్‌గా చేశాను. అవన్నీ లోబడ్జెట్‌ సినిమాలు కావడంతో అంతగా గుర్తింపు రాలేదు. అప్పట్లో ఇంత సోషల్‌మీడియా లేదు. సామాజిక మాధ్యమాల్లో చిన్నచిన్న వీడియోలు చేసినా చాలా గుర్తింపు వస్తున్నదిప్పుడు.

లాక్‌డౌన్‌లో..
లాక్‌డౌన్‌ కారణంగా సినిమాలు, సీరియళ్ళ షూటింగ్‌లన్నీ ఆగిపోవడంతో దాదాపు ఏడాదిన్నర బ్రేక్‌ తీసుకున్నా. మధ్యలో షూటింగ్స్‌ జరిగినా వెళ్ళలేదు. అనుకోకుండా దొరికిన సమయాన్ని పూర్తిగా కుటుంబంతో గడపడానికి వినియోగించా. ఆ సమయంలోనే జీ తెలుగు నుంచి ‘వైదేహీ పరిణయం’ అవకాశం వచ్చింది. ఇప్పటివరకు అన్నీ పాజిటివ్‌ రోల్స్‌లోనే చేశా. ఇది నెగెటివ్‌ రోల్‌, కాన్సెప్ట్‌ కూడా కొత్తగా ఉండటంతో ఒప్పుకొన్నా. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నాకు స్పూర్తినిచ్చే మహిళలు ముగ్గురు. కాజోల్‌, భానుప్రియ, నయనతార. ముగ్గురూ కెరీర్‌ను మలుచుకొన్న తీరు చాలా గొప్పది. నాకు చిన్నప్పటినుంచీ సేవ అంటే ఇష్టం. అందుకే బాగా చదివి డాక్టర్‌ కావాలనుకొన్నా. ఉచిత వైద్యం అందించాలనేది నా కల. సినిమా, నటన గురించి ఆలోచించింది లేదు. కానీ, అనుకోకుండా యాక్టర్‌నయ్యా. డాక్టర్‌ కాలేకపోయాననే బాధ వెంటాడుతూనే ఉంది. ఓ స్థాయికి చేరుకొన్నాక సమాజానికి నా వంతు సేవ చేయాలన్నదే లక్ష్యం.

హైదరాబాద్‌తో అనుబంధం

హైదరాబాద్‌ అంటే నాకు ఇష్టం. ఎక్కడికెళ్ళినా తిరిగి వచ్చేవరకు నేను నేనులా ఉండలేను. బెంగ పట్టుకుంటుంది. ఇక్కడి వాతావరణం, ఆహారం, సంప్రదాయాలు బాగా ఇష్టం. అందుకే బాలీవుడ్‌లో దర్శకుడిగా, రచయితగా పనిచేస్తున్న వ్యక్తిని పెండ్లి చేసుకున్నా ఇక్కడే సెటిలయ్యా. పాటలన్నా ఇష్టం. చిన్నప్పుడు క్లాసికల్‌, ఫోక్‌ డాన్స్‌ కూడా నేర్చుకున్నా.

… ప్రవళిక వేముల

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana