సినిమా స్టార్స్ ఉంటారు. స్పోర్ట్స్ స్టార్స్ కూడా ఉంటారు. కానీ, ఆ రెండు ప్రపంచాల్లో ఓ వెలుగు వెలిగిన ఒకే ఒక్కడు రాహుల్ బోస్. హైదరాబాద్‌లో సబ్ జూనియర్ నేషనల్ రగ్బీ ఛాంపియన్ షిప్ ప్రారంభోత్సవానికి వచ్చిన రాహుల్‌తో ‘జిందగీ’ ముచ్చట్లు..
రగ్బీ కంటే ముందు నాకు క్రికెటే పరిచయం. మంచి బౌలర్‌ను. ‘క్రికెట్ అంటే బ్యాటింగే’.. క్రికెట్లో బ్యాట్స్‌మన్, బౌలర్ మాత్రమే ఆడతారు. మిగతా ఆటగాళ్లంతా ఒకరకంగా ప్రేక్షకుల్లా ఉంటారు. అందుకే క్రికెట్ మీద ఇష్టం పోయింది. ఆ రోజుల్లో.. ముంబయి జింఖానా క్లబ్‌లోనే రగ్బీ ఆడేది. ఆ క్లబ్ ప్లేయర్స్ మా బడిలో నేర్పించేవాళ్లు. అలా, 13 ఏండ్లప్పుడు రగ్బీ ఆడటం మొదలుపెట్టాను. రగ్బీ ఆడాలంటే నలుగురితో కలవాల్సిందే. ఈ ఆట భయాన్ని అధిగమించడం నేర్పిస్తుంది. టీమ్‌లో ఆడటం వల్ల జీవితంలో సాధించడం నేర్పిస్తుంది. సత్తా ఉంటే మారథాన్ ఆడొచ్చు. వేగం ఉంటే పరుగు పందెంలో పోటీపడొచ్చు. బలం ఉంటే వెయిట్ లిఫ్టింగ్ చేయొచ్చు. నైపుణ్యం ఉంటే ఆర్చరీ ఆడొచ్చు. రగ్బీ ఆడాలంటే మాత్రం ఇవన్నీ ఉండాలి. నేను అంతర్జాతీయ రగ్బీ ఆడుతున్న రోజుల్లో సినిమా షూటింగ్స్‌కి ఇబ్బంది వచ్చేది. ఆటలో చాలాసార్లు దెబ్బలు తగిలేవి. ఆ కారణంగా షూటింగ్స్ వాయిదాపడ్డ సందర్భాలూ ఉన్నాయి. ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ క్యాలెండర్ చూసుకుని, రగ్బీ ఈవెంట్స్ లేనప్పుడే సినిమాలు చేశాను. సినిమాల్లో డబ్బు, ఆటలో సంతృప్తి మిగిలాయి నాకు.