e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home జిందగీ చిన్నదొర.. బంగుల కాడ సీటీ కొట్టకురో!

చిన్నదొర.. బంగుల కాడ సీటీ కొట్టకురో!

చిన్నదొర.. బంగుల కాడ సీటీ కొట్టకురో!

కొందరు పాడితే జీవం కనిపిస్తది. మరి కొందరు పాడితే జీవితం కనిపిస్తది. జీవం, జీవితం రెండూ కలగలిపి పాడే గాయని లావణ్య . ‘సిట్ట సిట్టెండా కొట్టె’ అని అమ్మగారింటి గురించి పాడుతుంది. అంతలోనే, ‘సిన్నదొర బంగుల కాడ సీటీ కొట్టకురో’ అని కొంటెపాట పాడుతుంది. ‘దచ్చన్నా వారింట్లో ధనమున్నాగానీ’ అని కట్టుకున్నోడి గురించి పాడుతుంది. అంతే స్వచ్ఛంగా ‘జాలి కురులాది జాలాది బండా’ అంటూ కష్టాన్ని గుర్తు చేసుకుంటుంది. జనం కోరే, జనం మెచ్చే పాటలను సేకరిస్తూ జానపద జాతరలో దూసుకుపోతున్నది.. పోతరాజు లావణ్య.

లావణ్య పాటల్లో పాత సాహిత్యం ఉంటుంది. రెండు తరాల వెనక్కి తీసుకుపోయే సన్నివేశాలుంటాయి. ‘ఏదో పాడుతున్నాం’ అని కాకుండా జానపదం ఉన్నంత వరకూ నిలిచిపోయే చక్కని పాటలను ఎంచుకుంటున్నది. యూట్యూబ్‌లో ‘జానపదం’ అని సెర్చ్‌ చేస్తే లావణ్య పాటలు ముందువరుసలో ఉంటాయి. నెలకు పది జానపదాలు విడుదలైతే, వాటిలో ఐదు పాటలు లావణ్యవే. జానపదం అంటే లావణ్య, లావణ్య అంటే స్వచ్ఛమైన జానపదాల నిధే అని పేరు తెచ్చుకుంటున్న పోతరాజు లావణ్య పాట ముచ్చట…

- Advertisement -

మాది సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల. అమ్మానాయన వ్యవసాయం చేస్తరు. అమ్మపేరు సాలవ్వ, నాయన కిష్టయ్య. జానపదాలు పాడటం చిన్నతనం నుంచే అలవాటుగా మారింది. మా నాయనకు కూడా జానపదాలంటే ఇష్టం. ఒకరకంగా ఆయన జానపద గని. మేం ముగ్గురు అక్కాచెల్లెండ్లం. నేను చిన్నదాన్ని. అక్కలు కూడా పాడుతరు. నాన్న పాడుతుంటే విని మేం నేర్చుకున్నం తప్పితే, మాకు మేముగా పాటల రంగాన్ని ఎంచుకోలేదు. 8వ తరగతిలో స్కూల్‌ ఆవరణలో జరిగిన ఒక సాంస్కృతిక వేడుకలో తొలిసారి పాట పాడిన. అందరూ మెచ్చుకున్నరు. ‘పాడాలె.. జనం చేత చప్పట్లు కొట్టించాలె’ అనే ఆలోచనే తప్ప మనమేదో స్టార్‌ అవుతామనే ఆలోచన లేకుండె. కానీ, నా గొంతు విన్నవాళ్లు మాత్రం ‘నువ్వు పాటను విడువకు పొల్లా. పాటలు అందరికీ పాడటంరాదు. నీకు మంచి పేరొస్తది’ అనేటోళ్లు.

నాయనే నా గురువు
స్కూల్‌ స్టేజీమీద పాడుతూ ఉండగా ‘నీకు మంచి టాలెంట్‌ ఉంది. చదువుతో సమానంగా పాటలపైకూడా శ్రద్ధ పెట్టు’ అని మా సార్‌ రమేశ్‌రెడ్డి అంటుండె. సార్‌ అంత సీరియస్‌గా చెప్తుంటే నాకూ నిజమే అనిపించేది. ‘పాడితే తప్పేముంది? మనం చదువునైతే పక్కన పెట్టి పాడుతలేం కదా?’ అని సీరియస్‌గానే తీసుకున్నా. టెన్త్‌కు వచ్చేసరికి శ్రీనివాస్‌ సార్‌ ఏ అవకాశం వచ్చినా నన్ను ప్రోత్సహించిండ్రు. 10వ తరగతి తర్వాత పాట మరింత పదునెక్కింది. బయట పాడటమూ మొదలువెట్టిన. మొదట్లో ‘ఎందుకు బిడ్డా ఈ పాటలు, మనకు ఇవి కొత్తనా? చదువుకు ఇబ్బంది కలుగుతది కావచ్చు’ అని అమ్మ, నాయన అన్నరు. కానీ, నా అభిరుచిని గమనించి, ‘పాడితే పాడుగానీ చదువునైతే ఆగం జేసుకోకు’ అని చెప్పిండ్రు. నేను పాడితే ముచ్చట పడిండ్రు. నాయన పాటగాడే కాబట్టి, ‘ఏ పాట బాగుంటది? ఏది నేను బాగ పాడ గలుగుతా’ అనేది చెప్పేటోడు. నాకు నాయనే గురువు. నేను పాడే పాటలన్నీ ఆయన సేకరించినవే.

కోరస్‌ కోసం వెళ్లి ..
చిన్నగొండలి పరమేశన్న మంచి కళాకారుడు. మా అక్కవాళ్లదీ, వాళ్లదీ ఒకటే ఊరు. అక్క ‘మా చెల్లె బాగా పాడుతది’ అని చెప్పిందో ఏమో తెల్వదిగానీ, పరమేశన్న నా పాట విన్నడు. ‘నీ గొంతు బాగుంది. ఒక పాట ప్లాన్‌ చేద్దాం’ అన్నడు. అట్లా మొదాలు వైష్ణవి రికార్డింగ్స్‌లో ‘కంకర గొట్టె’ పాట పాడిన. నాకొక రూట్‌ దొరికింది. కొన్ని మెలకువలు తెలుసుకున్నా. ఏ సందర్భంలో ఎట్లా పాడాల్నో అర్థం చేసుకున్న. ముక్కపల్లి శ్రీనన్న పాట ‘బాలన్న గారిలో’ కోసం కోరస్‌ పాడేందుకు జీఎల్‌ నాందేవన్న స్టూడియోకు పోయిన. నా గొంతు విన్న నాందేవన్న ‘ఏదైనా మంచిపాట ఉంటె చెప్పురా, చేద్దాం’ అన్నడు. ‘బుద్ది బుద్ది బుద్దిగల్లా.. లవ్‌ బద్దీ గల్ల ల్యాగె’ పాట పాడిన. అన్నకు నచ్చింది. వెంటనే రికార్డింగ్‌ చేసి విడుదల చేసినం. మంచి స్పందన వచ్చింది. ‘గొంతు కొత్తగా ఉంది. ఎవరీ అమ్మాయి’ అని నా గురించి వెతుకులాట మొదలైంది. ‘మా చానెల్‌కు పాడురా చెల్లె’ అని చానామంది అడిగిండ్రు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటూ మంచి, మంచి పాటలు పాడుతున్నా.

ఎల్‌ఎల్‌ ఫోక్స్‌ చానల్‌
‘కాలా కాలాలా కాడ నాయిదొరో’ అనే నా పాట యూట్యూబ్‌ ట్రెండింగ్‌ జాబితాలో చేరింది. అది వ్యూస్‌ పరంగా చానెల్‌కు, అవకాశాల పరంగా నాకు బాగా ఉపయోగపడింది. అంత మంచిగా హిట్‌ అయిన తర్వాత నాపై బాధ్యత మరింత పెరిగింది. ఏది పడితే అది కాకుండా, మంచిగా ఉన్న పాటలే పాడుతున్నా. దాని తర్వాత ‘సిట్ట సిట్టెండా కొట్టె.. సెట్టిగురు పెట్టె’ పాడిన. ఇది మూడు నాలుగు వెర్షన్‌లలో తీసిండ్రు. అన్ని వెర్షన్‌లలోనూ అనూహ్య స్పందన వచ్చింది. ఈ పాట డీజే వెర్షన్‌ 40 మిలియన్‌ వ్యూస్‌ క్లబ్‌లో చేరింది. ‘నాటెయ్య నేనువొయ్యె బాటలో’, ‘చెల్లెరో లావణ్య’, ‘దచ్చన్నా వారింట్లో ధనమున్నగానీ’, ‘జిమ్మెదారి కోయిల’, ‘బంగారు బావయ్య’, ‘కురుమ గొల్ల బావయ్యా’, ‘జాలి కురులాది జాలాది బండా’, ‘కులవృత్తి మన దైవమన్నా’ వంటి 200కు పైగా జానపదాలు పాడిన. నా అదృష్టమో, ప్రేక్షకుల ఆదరణోగానీ నేను పాడిన ప్రతీ పాట హిట్టయింది. తాజాగా ‘సిన్నదొరా బంగుల కాడ సీటీ కొట్టకురో’ పాట జనాలకు బాగా రీచ్‌ అయ్యింది. నేను పాడినవాటిలో చాలావరకు సేకరణ పాటలే. ఇంతమంచి పాటలను నేనే విడుదల చేస్తే బాగుంటదిగా అని ‘ఎల్‌ఎల్‌ ఫోక్స్‌’ చానెల్‌ పెట్టిన.

జనం మెచ్చే పాటలే
నా సొంత చానెల్‌లో తొలుత ‘వయ్యారాల సిన్నవాడ’ పాట విడుదల చేసిన. మంచి ఆదరణ పొందింది. తాజాగ ‘పురిసేడూ నీళ్లళ్ల పుట్టినా జెనిగే.. ఓ జెనిగే’ పాట విడుదల చేసిన. అన్నీ ఒకెత్తయితే ఇదొక ఎత్తు. మంచి స్పందన వస్తున్నది. ‘ఓ రెండు తరాలకు ముందు చిన్న పిల్లలకు జోలపాడే పాటలెక్క ఉంది. నా బాల్యం గుర్తుకొచ్చింది’ అని చానామంది ఫోన్లు చేసి చెప్తున్నరు. ఇది ఒక జెనిగెను ముద్దు చేస్తూ పాడిన పాట. వెనకట జానపదాలు ఇట్లనే ఉంటుండె. మనుషులపైనే కాదు. చెట్టు, పుట్టపైనా, పశుపక్ష్యాదుల పైనా ఉంటుండె. ఇది అట్లనే వచ్చిందని మెచ్చుకుంటున్నరు. ఇసొంటి పాటలన్నీ నేను మా నాయన దగ్గర సేకరిస్తా. ఆయనే నాకు కొండంత బలం. ప్రస్తుతం సిద్దిపేట డిగ్రీ కాలేజీలో ఫైనలియర్‌ చదువుతున్నా. ఒకవైపు జానపద జాతరలో నా సత్తా చాటుతూనే, మరోవైపు చదువులో రాణిస్తా. ఓ మారుమూల పల్లెనుంచి మొదలైన నా పాటల ప్రస్థానం ఇప్పుడు ప్రపంచ దేశాలను చేరింది. గల్ఫ్‌లో మన అన్నలు నా పాటలను బాగా ఇష్టపడుతరు. ఇట్లా అందరి ఆదరాభిమానాలతో, మరింత ఉత్సాహంగా జనం మెచ్చే జానపదాలు తీసుకొస్తూ అలరిస్తా.

… దాయి శ్రీశైలం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చిన్నదొర.. బంగుల కాడ సీటీ కొట్టకురో!
చిన్నదొర.. బంగుల కాడ సీటీ కొట్టకురో!
చిన్నదొర.. బంగుల కాడ సీటీ కొట్టకురో!

ట్రెండింగ్‌

Advertisement