మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే.. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయాలి. ముఖ్యంగా.. పెద్దపేగు ఆరోగ్యం బాగుండాలి. అప్పుడే.. తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. ఫలితంగా.. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీర్ఘకాలిక అలసట, చర్మ సమస్యలనూ దూరం చేస్తుంది. ఇందుకోసం పెద్దపేగును
ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. దీనికి కొన్ని చిట్కాలను పాటించాలి.
ఆహారంతోపాటు నిత్యం ఎన్నో రకాల విష వ్యర్థాలు పెద్దపేగులోకి వచ్చి చేరుతుంటాయి. వీటిలో కొంతవరకు టాక్సిన్ల రూపంలో బయటికి వెళ్లినప్పటికీ.. జీర్ణంకాని ఆహారం, రసాయన అవశేషాలు, ఇతర విషపదార్థాలు అక్కడే తిష్టవేస్తాయి. దాంతో, హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు, పరాన్నజీవులు కడుపులోనే నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. దీర్ఘకాలంలో పెద్దపేగు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ వ్యర్థాలను క్రమం తప్పకుండా తొలగించకపోతే.. కాలేయంతోపాటు శరీరంలోని వివిధ వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. కాబట్టి, పెద్దపేగును ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే.. అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.
పెద్దపేగును శుభ్రం చేసుకోవడానికి కొందరు పరిశోధకులు ‘ఇంటర్నల్ బాడీ వాష్’ అనే పద్ధతిని అభివృద్ధి చేశారు. ఎలాంటి ఖరీదైన మందుల అవసరం లేకుండానే పెద్దపేగుతోపాటు చిన్నపేగులనూ సులభంగా శుభ్రం చేసుకోవచ్చు.
పెద్దపేగును శుభ్రం చేసుకున్న తర్వాత.. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మరింత మెరుగుపడేందుకు జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. పేగుల కదలికలను ప్రోత్సహించడానికి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారంతోపాటు నీటిని ఎక్కువగా తీసుకోవాలి. చియా గింజలు పేగుల్లోంచి వ్యర్థాలను తరలించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
మెగ్నీషియం, విటమిన్ సి.. ఈ ప్రక్రియను మరింత మెరుగుపరుస్తాయి. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి అసౌకర్యాలను తగ్గించడానికి.. నెమ్మదిగా తినాలి. ఆహారాన్ని పూర్తిగా నమిలి మింగాలి. భోజనం చేసే సమయంలో నీటిని తక్కువగా తీసుకోవాలి. గట్ బ్యాక్టీరియాను పునరుద్ధరించడానికి ప్రోబయోటిక్ అధికంగా ఉండే పెరుగు, పులియబెట్టిన ఆహారం తీసుకోవాలి. నిత్యం కనీసం ఒక అరగంటైనా వ్యాయామం చేయడం అలవాటుగా మార్చుకోవాలి. బరువులు ఎత్తడం, మెట్లు ఎక్కడం లాంటివి కూడా జీవక్రియలను మెరుగుపరుస్తాయి.