కంటికి సరిపడా నిద్ర.. కడుపు నిండా తిండికి భారతీయులు నోచుకోవడం లేదు. ఆధునిక జీవనశైలి పేరుతో ప్రశాంతమైన నిద్రకు దూరమవుతున్నారు. ‘ద గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్‌కార్డ్ – 2024’ ఎడిషన్ ప్రకారం.. దాదాపు 50 శాతం మంది భారతీయులు నిద్రలేమితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన ఓ మహిళ.. కమ్మటి నిద్రతో రూ.9లక్షల బహుమతిని గెలుచుకొని ‘ఔరా!’ అనిపించారు. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన సాయీశ్వరి పాటిల్.. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా పనిచేస్తున్నారు. ‘వేక్‌ఫిట్’ సంస్థ ఏటా నిర్వహించే ‘స్లీప్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్’ మూడో సీజన్లో మరో 11మందితో కలిసి పాల్గొన్నారు. ఈ పోటీలో భాగంగా ప్రతి ఒక్కరూ రోజూ ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సంపూర్ణ నిద్రను అనుభవించాలి. పగటిపూట కూడా 20 నిమిషాలపాటు కమ్మటి నిద్ర పోవాలి. కొన్ని ప్రత్యేకమైన పరికరాల ద్వారా వీరి నిద్రను నిర్వాహకులు ట్రాక్ చేస్తారు. ఎవరెవరు ఎన్ని గంటలు గాఢంగా నిద్ర పోయారో తెలుసుకుంటారు. అన్ని పరీక్షల్లో నెగ్గినవారికి ‘స్లీప్ చాంపియన్’ టైటిల్‌తోపాటు రూ.9 లక్షల భారీ మొత్తాన్ని బహుమతిగా అందజేస్తారు. ఈ పోటీలో సాయీశ్వరి పాటిల్ గెలుపొంది.. నగదు బహుమతిని కైవసం చేసుకున్నారు.