ఒకప్పుడు ఎంబ్రాయిడరీదే హవా. మగ్గం వర్క్ రాగానే ఈ కళ పక్కనపడిపోయింది. దాంతో హ్యాండ్ ఎంబ్రాయిడరీ యంత్రాలకే పరిమితమైంది. తాజాగా 3డీ ఎంబ్రాయిడరీపై మహిళలు ఆసక్తి చూపుతున్నారు. సాధారణ ఎంబ్రాయిడరీలో దారాలతో బట్టపై డిజైన్‌గా కుడతారు. కానీ త్రీ డైమన్షనల్ (3డీ) విధానంలో మాత్రం బట్టపై ఫోమ్ షీట్ (మృదువుగా, దళసరిగా ఉండే వస్త్రం) పెట్టి, దాని పైనుంచి రంగురంగుల సిల్క్ దారాలతో డిజైన్ చేస్తారు. ఈ డిజైన్ ఉబ్బెత్తుగా ఉంటుంది. అందుకే త్రీడీ ఎంబ్రాయిడరీని ‘పఫ్ ఎంబ్రాయిడరీ’ అని కూడా అంటారు. దీనికోసం ముందుగా ఫోమ్ షీట్‌ను నచ్చిన అక్షరాలు లేదా పువ్వుల ఆకారాల్లో కత్తిరించుకోవాలి. తర్వాత వాటిని బట్టపై పెట్టి, దాని మీదుగా ఎంబ్రాయిడరీ చేయాలి. స్పోర్ట్స్ టోపీలు, బ్రాండెడ్ బట్టలపై ఉబ్బెత్తుగా కనిపించే డిజైన్లు త్రీడీ ఎంబ్రాయిడరీతో చేసినవే.