మారుతున్న జీవనశైలి.. మహిళలను డిమెన్షియా బారిన పడదోస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా డిమెన్షియా బాధితుల సంఖ్య పెరగడం.. ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో.. 60 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారిలో 5 నుంచి 8శాతం మంది డిమెన్షియాతో బాధపడుతున్నారని తేలింది. 85 ఏండ్లు పైబడిన వారిలో ఈ సమస్య 30 నుంచి 50 శాతం వరకూ కనిపిస్తున్నది. ఆసక్తికరంగా.. అల్జీమర్స్‌తో బాధపడుతున్న వారిలో దాదాపు మూడింట రెండొంతుల మంది మహిళలు.. డిమెన్షియా వల్ల ప్రభావితం అవుతున్నారని సర్వే వెల్లడించింది.
హార్మోన్ మార్పులు: మెనోపాజ్ దశకు చేరుకున్న మహిళల్లో ఈస్ట్రోజెన్, న్యూరోప్రొటెక్టివ్ లాంటి హార్మోన్లు క్షీణించడం ప్రారంభమవుతుంది. ఇది మహిళల్లో జ్ఞాపకశక్తి తగ్గడానికి కారణం అవుతున్నది. ఈస్ట్రోజెన్ హార్మోన్.. మెదడు కణాలను రక్షించడంలో సాయపడుతుందనీ, కణాల మధ్య కమ్యూనికేషన్‌కు ఉపయోగపడుతుందనీ పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి, ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గే మహిళల్లో చిత్తవైకల్యం పెరిగే అవకాశం ఉన్నది.
ఆరోగ్య పరిస్థితులు: ఆటో ఇమ్యూన్ వ్యాధులు, మానసిక సమస్యలు కూడా చిత్తవైకల్యానికి దారితీసేవే! డిప్రెషన్ కూడా డిమెన్షియా ప్రమాదాన్ని పెంచుతాయి.
మార్పులతోనే సాధ్యం.. మెదడు ఆరోగ్యాన్ని పెంచడంతోపాటు డిమెన్షియా ప్రమాదాన్ని తగ్గించడానికి జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం అనివార్యం అంటున్నారు నిపుణులు.
ఆరోగ్యకరమైన ఆహారం: ఆహారంలో ఆకు కూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్‌తోపాటు తృణధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. జంక్‌ఫుడ్‌కు వీలైనంత దూరంగా ఉండాలి. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తరచుగా తీసుకుంటే.. మెదడు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
సరైన నిద్ర: పడుకున్న సమయంలోనే మెదడుకు కాస్తంత విశ్రాంతి దొరుకుతుంది. నిద్ర లేకపోవడం జ్ఞాపకశక్తిని కోల్పోయేలా చేస్తుందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నిర్వహించిన ఓ పరిశోధనలో తేలింది. కాబట్టి.. మెదడు చురుగ్గా ఉండాలంటే.. కంటినిండా నిద్ర పోవాల్సిందే!
వ్యాయామం: రోజూ వ్యాయామం.. మెదడును నిత్యనూతనంగా ఉంచుతుంది. వ్యాయామంతో మెదడుకు రక్త ప్రవాహం పెరుగుతుంది. తగిన స్థాయిలో ఆక్సిజన్, పోషకాలు అందుతాయి. కొన్ని రకాల వ్యాయామాల వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. అందుకే, వారంలో కనీసం 150 నిమిషాలైనా వ్యాయామం చేయాలి.
ఒత్తిడికి చెక్: పని భారం, కుటుంబ సమస్యలతో ఒత్తిడికి గురవడం కూడా డిమెన్షియాకు కారణమే! ఒత్తిడి వల్ల మెదడులో ‘కార్టిసాల్’ అనే హార్మోన్ స్థాయులు పెరిగి.. మెదడు ఆరోగ్యానికి చేటుచేస్తాయి. దీర్ఘకాలంలో మెదడు కణాలను కూడా దెబ్బతీస్తాయి. కాబట్టి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి నిత్యం యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకోవాలి.