e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home జిల్లాలు ఉద్యానం లాభాలు ఘనం

ఉద్యానం లాభాలు ఘనం

ఉద్యానం లాభాలు ఘనం

జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ
గత యేడాది వానకాలంలో 1,677 ఎకరాల్లోనే పండ్ల తోటలు, కూరగాయల సాగు చేపట్టిన రైతులు
ప్రతి గ్రామంలోనూ అదనంగా 50 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేసేలా జిల్లా ఉద్యాన శాఖ కసరత్తు
ఉద్యాన పంటల సాగు ఊసేలేని 119 పల్లెల్లోనూ సాగు చేసేలా ప్రణాళిక
రాయితీ పథకాలతో ప్రోత్సాహం కలిగించేలా చర్యలు
ప్రభుత్వ చొరవతో రాబోవు రోజుల్లో తీరనున్న పండ్లు, కూరగాయల కొరత

యాదాద్రి భువనగిరి, జూన్‌ 13(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ప్రభుత్వం నియంత్రిత సాగు విధానానికి అధిక ప్రాధాన్యతనిస్తూనే ఉద్యాన పంటల సాగుకు కూడా ప్రోత్సాహం కల్పిస్తోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న నేలలు, నీటి లభ్యత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏ ఏ పంటలకు ఏ నేలలు అనుకూలమో నిర్ణయించి ఆ దిశగా అధికార యంత్రాంగం రైతులను చైతన్యపరుస్తోంది. ఇప్పటివరకు ఉన్న సాగు విస్తీర్ణాన్ని మరింతగా పెంచేందుకు చర్యలు చేపట్టి.. ప్రస్తుత వానకాలం సీజన్‌లో ప్రతి మండలంలో అదనంగా 50 ఎకరాల్లో పండ్లు, కూరగాయలు, ఆకు కూరలను సాగు చేసేలా కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నారు. ఉద్యానసాగు విస్తీర్ణం పెంపులో భా గంగా ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలను అం దించి రైతులను అటువైపు మళ్లించేందుకు సంబంధిత అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వానకాలం సాగు చేయాల్సిన పండ్లు, కూరగాయల పంటల సాగులో రైతులు అవలంభించాల్సిన సస్యరక్షణ చర్యలను ఈ సందర్భంగా ఉద్యాన వనశాఖ అధికారులు వివరిస్తున్నారు.
మండలానికి 50 ఎకరాల సాగు విస్తీర్ణం పెంచేలా కార్యాచరణ..
సాధారణంగా జిల్లాలో అక్టోబర్‌ నుంచి మార్చి వరకు కూరగాయల సాగు ఎక్కువగా ఉంటుండగా, ఆ సమయంలోనూ 50 శాతం కూరగాయలు ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు దిగుమతి అవుతున్నాయి. ఎండాకాలంలో.. అన్‌ సీజన్‌లో దిగుమతి 60 నుంచి 70 శాతం వరకు ఉంటుంది. అయితే గతంతో పోలిస్తే జిల్లాలో కూరగాయల సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాలు సమృద్ధిగా కురవడంతోపాటు మూసీ, గోదావరి జలాలు పుష్కలంగా అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా బోరు బావుల్లో సైతం నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు మార్కెట్లో డిమాండ్‌ ఉన్న కూరగాయలను పండిస్తే లాభాలు గడించవచ్చని ఉద్యానవన శాఖ అధికారులు అంటున్నారు. మూస పద్ధతులకు స్వస్తి పలికి కొత్తకొత్త పద్ధతుల్లో సాగు చేపట్టాలని వారు సూచిస్తున్నారు. జిల్లాలో గతంలో సాగు చేసిన దానికంటే మండలానికి 50 ఎకరాల్లో అదనంగా కూరగాయల సాగును చేపట్టాలని ఉద్యానవన శాఖ ప్రణాళికలను రూపొందించి రైతులను చైతన్యపర్చే పనిలో నిమగ్నమైంది. కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచి, అన్ని రకాల కూరగాయలను ఇక్కడే పండించడం వల్ల జిల్లా ప్రజలకు తక్కువ ధరకే అందించగలుగుతామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. తద్వారా రైతులు కూడా లాభపడవచ్చని అంటున్నారు.
నీటి యాజమాన్యం..
మల్చింగ్‌ విధానంలో మెలకువలు..
నీటి సౌకర్యం ఉన్న దగ్గర డ్రిప్‌ స్ప్రింక్లర్‌ పద్ధతిలో నీటిని అందించుకోవాలి. అలాగే వర్షాధారంగా సాగు చేసేటప్పుడు పొలంలో పల్లపు ప్రాంతాల్లో పాంపాండ్లు ఏర్పాటు చేసుకొని నీటి ఎద్దడిని తగ్గించుకోవచ్చు. అలాగే నీటిని ఆదా చేసుకుని.. కలుపు, తెగుళ్లు తగ్గించేందుకు 25-30 మైక్రాన్‌ మందం గల మల్చింగ్‌ షీట్‌ను వాడుకోవాలని అధికారులు రైతులకు సూచిస్తున్నారు.
శాశ్వత పందిర్ల నిర్మాణం…అవగాహన చర్యలు
సాధారణంగా తీగజాతి కూరగాయలు శాశ్వత పందిర్లపై పెంచడం వలన వంకరలు లేని నాణ్యమైన కాయలు పొందవచ్చు. అదే విధంగా టమాట, చిక్కుడు కీరదోస పంటలకు నిలువుగా ఉండే ట్రేలపైకి పాకించడం ద్వారా నాణ్యమైన దిగుబడి పొందవచ్చు.
పందిరి సాగుకు మరింత ఊతం ఇవ్వాలనుకున్నప్పుడు ముందుగా సాళ్ల మధ్యలో ప్రతి 5-6 మీటర్ల దూరంలో వెదురు బొంగులు/సిమెంట్‌ స్తంభాలను 5-6 అడుగుల ఎత్తు ఉండేలా నాటుకోవాలి. 8-10 గేజ్‌ మందం గల జీతీగను సాలుకు సమాంతరంగా పైకి పాకిం చి పురికోస సాయంతో కొమ్మలను పాకించాలి.
సమగ్ర సస్యరక్షణ చర్యలు..
టమాట, వంగ పంటల్లో కంచె పంటలుగా జొన్న, మొక్కజొన్నలను.. బంతి, క్యాబేజీ, కాలిఫ్లవర్లతో ఎర పంటలుగా ఆవాలు, చైనీస్‌ క్యాబేజీ పంటలు వేసుకోవాలి. నులిపురుగుల బెడద ఎక్కువగా ఉంటే బంతి పంటలతో పంట మార్పిడి చేయాలి. లింగార్షక బుట్టలను, దీపపు ఎరలను ఏర్పాటు చేసుకోవాలి. ట్రైకోగ్రామా బదనికలను ఎకరాకు 20 వేల చొప్పున వదలాలి. ఎండ తెగులు ఆశించుకుండా బెడ్‌లను 1 శాతం ఫార్మాలి ద్రావణంతో శుద్ధి చేయాలి. బ్యాక్టీరియా ఎండు తెగులు రాకుండా ఎకరాకు 6 కిలోల బ్లీచింగ్‌ పౌడర్‌ను బెడ్‌లపై చల్లి నేలలో కలపాలి. బెండ-అలసంద-మొక్కజొన్న పంటల మార్పిడితో/మొక్కజొన్న-బెండ-ముల్లంగితో బ్యాక్టీరియా తెగులను తగ్గించుకోవచ్చు. రసం పీల్చే పురుగులు ఆశించకుండా ఎకరానికి 10 కిలోల కార్చోవ్యూరాన్‌ గుళికలు వేయాలి.
ప్రతి గ్రామంలో సాగు పెంచేలా చర్యలు
ఆధునిక పద్ధతుల్లో ఉద్యాన పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం. ఉద్యాన పంటల సాగుకు యోగ్యమైన భూములు చాలా వరకు జిల్లాలో ఉన్నాయి. గతంతో పోలిస్తే నీటి లభ్యత కూడా పెరిగింది. ఈ పరిస్థితుల్లో గతంలో సాగు చేసిన దానికంటే ఎక్కువ విస్తీర్ణంలో పండ్లు, కూరగాయలు, ఆకు కూరలను సాగు చేసేలా రైతులను చైతన్యపరుస్తున్నాం. ఇప్పటికే చాలా మంది రైతులు ఉద్యాన పంటల సాగు పెంపు దిశగా ఉపక్రమించారు. ప్రస్తుత వానకాలం సీజన్‌లో ప్రతి గ్రామంలోనూ అదనంగా 50 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగును పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించే అవకాశం రైతులకు కలుగడంతోపాటు తక్కువ ధరకే నాణ్యత గల పండ్లు, కూరగాయలు జిల్లా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.
అన్నపూర్ణ, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి,
యాదాద్రి భువనగిరి జిల్లా
వానకాలం సాగుకు అనువైనవి ఇవే..

జిల్లా రైతాంగం ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని ఉద్యానవన శాఖ అధికారులు సూచిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు వచ్చే కూరగాయల సాగు ఎంచుకోవాలని, మే నెల చివరి నుంచి జూన్‌ నెలలో నాటుకోవడానికి వంగ, మిరప, బెండ, తీగ జాతి కూరగాయలైన బీర, కాకర, సోర, దోసలను ఎన్నుకోవచ్చని చెబుతున్నారు. గోరు చిక్కుడు, పొద చిక్కుడుతోపాటు ఆకుకూర పంటల సాగును చేపట్టవచ్చు. దుంప కూరలైన ముల్లంగి, చేమగడ్డ, చిలగడదుంప, కంది పంటలను వానకాలం మొదట్లో వేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
సస్యరక్షణ చర్యలు
టమాట, వంగ, మిరప పంటల నారును ఎత్తైన మళ్లలో పెంచాలి. కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోట్రిడ్‌/8 గ్రాముల ట్రైకోడైర్మవిరిడితో విత్తనశుద్ధి చేయాలి. నారుకుళ్లు తెగులు నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌ కలిపి నారుమళ్లను తడపాలి. ప్రధాన పొలంలో అక్కడక్కడ బంతి మొక్కలు పెంచి నులిపురుగులు ఆశించకుండా కాపాడుకోవాలి.
బెండ, చిక్కుడు జాతి, తీగజాతి కూరగాయల పంటలో విత్తనం పెద్దగా ఉంటుంది కాబట్టి నేరుగా ప్రధాన పొలంలో నాటుకోవాలి. తీగజాతి కూరగాయల విత్తనాలను ప్రో ట్రేలలో నాటుకొని 25 రోజుల వయస్సు మొక్కలను నేరుగా నాటుకోవడం ద్వారా సీజన్‌ తప్పిపోకుండా ముందుగా పంట తీసుకోవచ్చు. ఈ పద్ధతి బాగా రైతులకు ఉపకరిస్తుందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు.
ఆకుకూర పంటలను చిన్న చిన్న మళ్లలో నేరుగా విత్తుకొని 25 రోజుల్లో కోసుకోవాలి. శ్రమ తక్కువ ఉండటమే కాకుండా తక్కువ కాలంలో లాభాలు పొందవచ్చు. విత్తనం చల్లే విధానంతో ఎకరానికి 2 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. విత్తనాలను అలికే ముందు భూమిని ఎక్కువసార్లు కలియదున్ని ఎకరానికి 5 టన్నుల పశువుల ఎరువును వేసి దున్నితే మంచిది.
నేల తయారీ… ఎరువుల యాజమాన్యం
వేసవిలో లోతు దుక్కిదున్నిన తర్వాత నేలవాలుకు అడ్డంగా బోదెలు, కాలువలు చేసి బోదెకు ఒకవైపు దిగువ భాగంలో నాటుకోవాలి. వాలుకు అడ్డంగా బోదెలు తోలినట్లయితే వర్షపు నీరు నేలలోకి బాగా ఇంకుతుంది. ఈ పద్ధతి వర్షాధార పంటకు బాగా అనుకూలం. చివరగా దుక్కిలో పశువుల ఎరువు, సేంద్రియ ఎరువులను ఎక్కువగా వాడుకొన్నట్లయితే నేల భౌతిక, రసాయన లక్షణాలు మారి నీటిని పట్టి ఉంచే అవకాశం కలుగుతుంది.
అజటోబాక్టర్‌ ఎకరానికి 2 కిలోలు, పాస్ఫరస్‌ సాల్యబ్లైజింగ్‌ బ్యాక్టీరియా 2 కిలోలు చొప్పున.. పశువుల ఎరువు, వేప పిండి మిశ్రమంలో బాగా అభివృద్ధి చేసి పొలంలో వేసుకోవాలి. జీవన ఎరువు వాడినప్పుడు సిఫారసు చేసిన రసాయన ఎరువులు వేసేటప్పుడు పూర్తి భాస్వరంతో పాటు నత్రజని, పొటాష్‌ ఎరువులను కూడా ఆఖరి దుక్కిలో వేయాలి. పూత పిందె సమయంలో పంటపై పొటాషియం నైట్రేట్‌ లీటర్‌ నీటికి 5 గ్రాముల చొప్పు 10 రోజుల వ్యవధిలో రెండుమూడు సార్లు పిచికారీ చేసి నత్రజని, పొటాషియం లభ్యతను పెంచవచ్చు. వర్షాధారంగా పెంచే కూరగాయ పంటల్లో వర్షాభావ పరిస్థితుల్లో ఈ పద్ధతి మేలు చేస్తుంది. అదే విధంగా సూక్ష్మదాతు మిశ్రమాన్ని లీటర్‌ నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి పిందె దశలో రెండుసార్లు 1-10 రోజుల వ్యవధిలో పిచికారి చేసినట్లయితే దిగుబడి పెరుగుతుందని అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఉద్యానం లాభాలు ఘనం
ఉద్యానం లాభాలు ఘనం
ఉద్యానం లాభాలు ఘనం

ట్రెండింగ్‌

Advertisement