గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Nov 30, 2020 , 00:31:01

ఆశల సాగు. . .

 ఆశల సాగు. . .

  • జిల్లాలో జోరందుకున్న యాసంగి సాగు
  • 2,43,173 ఎకరాల్లో పంటలు సాగు చేయవచ్చని వ్యవసాయ శాఖ అంచనా
  • అత్యధికంగా 2,25,814 ఎకరాల్లో వరి సాగు
  • సమృద్ధిగా కురిసిన వర్షాలతో గణనీయంగా పెరిగిన భూగర్భ జలం
  • జిల్లాలో నిండు కుండలను తలపిస్తున్న 1,382 జలాశయాలు
  • ఇప్పటికే దుక్కులు దున్ని నార్లు పోసుకుంటున్న రైతాంగం
  • విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచిన తెలంగాణ ప్రభుత్వం

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతాంగం యాసంగి సాగుకు సిద్ధమవుతోంది. దుక్కులు దున్ని నార్లు పోసుకుంటున్నారు. జిల్లాలోని 17 మండలాల పరిధిలో 2,43,173 ఎకరాల్లో పంటలను సాగు చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేస్తూ ప్రణాళికలు రూపొందించింది. గతేడాది యాసంగిలో జిల్లా రైతాంగం 2,00,350 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తే... ప్రస్తుత యాసంగిలో రైతులు అదనంగా 42,823 ఎకరాల్లో పంటలను సాగు చేయనున్నారు. ఇందులో అత్యధికంగా వరిని రైతులు 2,25,814 ఎకరాల్లో సాగు చేయనున్నారు. గత యాసంగిలో సాగు చేసిన 1,99,067 ఎకరాల వరి కంటే ఈసారి  26,747 ఎకరాల్లో అధికంగా వరిని సాగు చేయనున్నారు. వరి తర్వాత అత్యధికంగా 3,907 ఎకరాల్లో జొన్నలు, ఆ తర్వాత 3వేల ఎకరాల్లో పల్లీని, 2,092 ఎకరాల్లో శనగలను రైతులు సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే జిల్లా ఉద్యానవన శాఖ సైతం యాసంగి సాగు ప్రణాళికను రూపొందించింది. 4,696 ఎకరాల్లో కూరగాయలను, మరో 1,622 ఎకరాల్లో పండ్ల తోటలను సాగు చేసేలా ఆ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు.


నిండుగా చెరువులు..

గత పదేండ్లతో పోలిస్తే జిల్లాలోని చెరువులు, కుంటల్లోకి ఈ ఏడాది సమృద్ధిగా నీరు వచ్చి చేరింది. వానకాలం ఆరంభం నుంచే పుష్కలంగా వర్షాలు కురిశాయి. సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలలో రికార్డు స్థాయిలో వర్షాలు విస్తారంగా పడ్డాయి. ఎటు చూసినా మూసీ నీరు పరవళ్లు తొక్కడం.. ఈ ఏడాది బొమ్మలరామారం, తుర్కపల్లి మండలాలకు కొత్తగా గోదావరి జలాలు అందుబాటులోకి వచ్చాయి. వీటికితోడు వర్షాలు సైతం జోరుగా కురవడంతో వానకాలం సాగుకు ఆయకట్టులోని రైతులు చెరువులు, కుంటల్లోని నీటిని పెద్దగా వినియోగించుకునే అవసరం రాలేదు. దీంతో ఎటు చూసినా జలాశయాలు నిండుగా కన్పిస్తున్నాయి. జిల్లాలో ఉన్న 1,382 చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో జలకళను సంతరించుకున్నాయి. ఈ కారణంగానే యాసంగి సాగుపై పూర్తి భరోసాతో రైతులు వివిధ రకాల పంటలను సాగు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. వానకాలంలో వచ్చిన వరదల కారణంగా రైతులు అక్కడక్కడ నష్టాలను చవిచూడగా.. ఈ యాసంగిలో పంటలను సమృద్ధిగా పండించి గత నష్టాల నుంచి గట్టెక్కాలన్న ఆలోచనలో రైతులు ఉన్నారు.


ఎరువులు, విత్తనాలు సిద్ధం


యాసంగిలో పంటల సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలను అధికార యంత్రాంగం సిద్ధం చేసి ఉంచింది. ప్రాథమిక సహకార కేంద్రాలు, ఎరువుల డీలర్ల వద్ద రైతులకు అవసరమైనన్నీ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. జిల్లాలో అత్యధికంగా 2,25,814 ఎకరాల్లో వరి సాగవ్వనుండగా, అందుకనుగుణంగా 53,692 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధంగా ఉంచారు. 987 క్వింటాళ్ల పల్లి విత్తనాలను, 272 క్వింటాళ్ల శనగ విత్తనాలను, 105క్వింటాళ్ల జొన్న విత్తనాలతోపాటు మొక్కజొన్న, ఉలువలు, మినుములు, పెసర్లు, పొద్దుతిరుగుడు, నువ్వులు, సజ్జలు, చిరు ధాన్యాల సాగుకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచారు. 

అలాగే సాగు అంచనాలకు సరిపోయే విధంగా అధికారులు ఎరువులను అందుబాటులో ఉంచారు. 15,894 మెట్రిక్‌ టన్నుల యూరియాను, 6,550 మెట్రిక్‌ టన్నుల డీఏపీని, 10,480 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులను, 2,620 మెట్రిక్‌ టన్నుల మోనో ఫాస్పేట్‌,  803 మెట్రిక్‌ టన్నుల సూపర్‌ ఫాస్పేట్‌ ఎరువులను నెల వారీగా అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేశారు.

VIDEOS

logo