సోమవారం 19 అక్టోబర్ 2020
Yadadri - Sep 01, 2020 , 23:31:44

మరోసారి ఎల్‌ఆర్‌ఎస్‌

మరోసారి ఎల్‌ఆర్‌ఎస్‌

  • ఆగస్టు 26 కటాఫ్‌ తేదీ  
  • అక్టోబరు 15 వరకు అందుబాటులో స్కీం 
  • అక్రమ లేఅవుట్లు, భవనాల  క్రమబద్ధీకరణకు సర్కారు అవకాశం  
  • జిల్లాలో భారీగా అనుమతి లేని లేఅవుట్లు, భవనాలు 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. ఈ మేరకు లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) ప్రక్రియ ప్రారంభించినట్లు జీవో  నెంబర్‌:131ని విడుదల చేసింది. కొద్ది రోజుల క్రితం అక్రమ లే అవుట్‌లోని ప్లాట్ల అక్రమ నిర్మాణాలకు సర్కార్‌ రిజిస్ట్రేషన్‌ నిలిపివేసిన సంగతి తెలిసిందే.  లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం సౌకర్యం కల్పించడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఊరట లభించినట్లు అయింది. 26 ఆగస్టు 2020లోపు చేసిన లే అవుట్‌ ఓనర్లకు, రిజిస్ట్రేషన్‌ చేసుకున్న (సేల్‌ డీడ్‌) ప్లాట్‌ ఓనర్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి మున్సిపల్‌ శాఖ మార్గదర్శకాలను ప్రకటించింది. ఈ కింది మార్గదర్శకాలకు లోబడే లేఅవుట్లకు రెగ్యులర్‌ చేస్తామని అధికారులు పేర్కొన్నారు. అక్టోబర్‌ 15వ తేదీ వరకు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు..

 హెచ్‌ఎండీఏ పరిధిలోని ఏడు జిల్లాల పరిధిలోని గ్రామాలకు కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు కాంటిటెంట్‌ అథారిటీగా స్పష్టం చేసింది. ఈ సారి ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియలో కాంపిటెంట్‌ అథారిటీగా ప్రభుత్వం పొందుపర్చలేదు. సాధ్యమైనంత మేరలో ఈ పథకాన్ని పూర్తి చేసి వచ్చిన నిధులను సర్కారు ప్రణాళికబద్ధమైన అభివృద్ధికి ఖర్చు చేయనున్నది. రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, యాదాద్రి-భువనగిరి, సంగారెడ్డి, మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ జాతర కొనసాగనున్నది.  ఇది వరకు 2015లో ప్రభు త్వం ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించగా హెచ్‌ఎండీఏ పరిధిలో 1.75 లక్షల మంది దరఖాస్తు లు చేసుకోగా లక్షకు పైగా దరఖాస్తులకు క్రమబద్ధీకరణ పత్రాలను హెచ్‌ఎండీఏ అందజేసింది. తద్వారా రూ. 1050కోట్లు హెచ్‌ఎండీఏ ఖజానాలోకి సమకూర్చుకున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 1, 30 లక్ష దరఖాస్తులను స్వీకరించగా, 70 వేల దరఖాస్తుల అనుమతులు మంజూరు చేశా రు. 60వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపు రూ. 1000కోట్ల ఆదాయం వచ్చింది. 

   ఎల్‌ఆర్‌ఎస్‌లో ముఖ్యమైనవి...

l ఆగస్టు 25 వ తేదీ వరకు కటాఫ్‌ తేదీగా ప్రకటించింది.

l టీఎస్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తింపు. 

l అక్టోబర్‌ 15వ తేదీలోగా ఆన్‌లైన్‌లో ఎల్‌ఆర్‌ఎస్‌ ఆప్లికేషన్‌ నింపాలి. 

l ఎల్‌ఆర్‌ఎస్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ. 1000 (వ్యక్తిగత ప్లాట్‌ ఓనర్స్‌), లే అవుట్‌ ఓనర్స్‌ ఆప్లికేషన్‌ ఫీజు రూ. 10వేలు 

l రెగ్యులరైజేషన్‌ చార్జీలు 100 గజాల లోపు ప్లాట్లకు గజానికి 200 రూపాయల చొప్పున చెల్లించాలి.

l 101 నుంచి 300 గజాలు ఉన్న వాళ్లు గజానికి రూ. 400లు చెల్లించాలి.

l 301 నుంచి 500 గజాలు ఉన్న వాళ్లు గజానికి రూ. 600లు రెగ్యులరైజేషన్‌ చార్జీలు చెల్లించాలి

l 501 నుంచి 750 గజాలు ఉన్న వారంతా రూ. 750లు చెల్లించాలి. 

l  స్లమ్స్‌లో ఉన్న వారు 5శాతం చెల్లించాలి.

ఓపెన్‌ స్పేస్‌ లేకుంటే 14శాతం అదనం....

 అక్రమంగా ఏర్పాటుచేసిన లే అవుట్‌లో నిబంధనలకు అనుగుణంగా 10శాతం ఖాళీ జాగా వదలకపోతే రిజిస్ట్రేషన్‌ సందర్భంగా ప్లాటు విలువలో 14శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

l  నాలుగు పద్దతుల్లో ఫీజులు చెల్లించుకునే వీలు కల్పించారు.. హెచ్‌ఎండీఏ, పురపాలక సంఘాలు, పట్టణాభివృద్ధి సంస్థ, కార్పొరేషన్లకు వాటి అధికారిక వెబ్‌సైట్‌పోర్టల్‌, మీ సేవ సెంటర్లు, సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్స్‌ లోకల్‌ బాడీ, స్మార్ట్‌ఫోన్‌లో మొబైల్‌ యాప్‌ ద్వారా ఫీజులు చెల్లించవచ్చు. 

నిబంధనలు 

నాలాకు రెండు మీటర్ల దూరం ఉండాలి. 

 వాగుకు 9 మీటర్ల దూరం ఉండాలి. 

10 హెక్టార్లలోపు ఉన్న చెరువుకు 9 మీటర్ల దూరం ఉండాలి 

 10 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న చెరువుకు 30 మీటర్ల దూరం ఉండాలి.

 ఎయిర్‌పోర్టు, డిఫెన్స్‌ స్థలానికి 500 మీటర్ల దూరం ఉండాలి .

l  నీటి వనరులకు చెంతన ఉన్నవి, ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని శిఖం భూముల్లోని దరఖాస్తులను అనుమతించబడవు. జీవో 111 పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌, హుడా ప్రకారంగా ప్రభుత్వ ఆదేశాలు వర్తిస్థాయి. పరిశ్రమలకు కేటాయించిన, తయారీ ఉపయోగాల భూములకు, మాస్టర్‌ప్లాన్‌లో ఓపెన్‌ స్పేస్‌గా గుర్తించిన ప్రదేశాలకు ఎల్‌ఆర్‌ఎస్‌ పరిధిలోకి అనుమతించరాదని తెలిపింది. 

l   క్రమబద్ధీరణ చేసుకోని అనుమతి లేని లే అవుట్లలోని ప్లాట్లకు ఇంటి నిర్మాణ అనుమతులు, నల్లా కనెక్షన్లు, డ్రైనేజీ, మురుగునీటి కనెక్షన్లు మంజూరు చేయబడవు. అట్టి ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయబడవని హెచ్చరించింది. 

అక్రమ నిర్మాణాలకు ఫుల్‌స్టాప్‌ 

అనధికార లే అవుట్లు, అక్రమ నిర్మాణాలకు శాశ్వతంగా ఫుల్‌స్టాప్‌ పెట్టాలని సర్కార్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఇటీవల అక్రమ లే అవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయవద్దని రిజిస్ట్రేషన్‌ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. హెచ్చరికలు జారీ చేసినా నిర్మాణాలు చేపడుతుండటం, కూల్చివేతల ప్రక్రియతో ఎక్కువ శాతం మధ్య తరగతి వారే నష్టపోతారని భావించిన ప్రభుత్వం మరోమారు క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది. ప్రభుత్వానికి ఆదాయంతో పాటు యజమానులకు భారీ ఉపశమనం లభించనున్నది. 


logo