మంగళవారం 27 అక్టోబర్ 2020
Yadadri - Aug 12, 2020 , 02:42:23

ఏకదంతాయా..

ఏకదంతాయా..

యాదాద్రి, నమస్తేతెలంగాణ : కొవిడ్‌ నేపథ్యంలో ఊరికి ఒక్కటే గణేశ్‌ విగ్రహం ప్రతిష్ఠించాలని పోలీసులు సూచిస్తున్నారు. కొవిడ్‌-19 విస్తరిస్తున్న నేపథ్యంలో గణేశ్‌ వేడుకలు నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని పేర్కొన్నారు. కాగా పల్లెపల్లెల్లో వీధివీధినా గణపతులను ప్రతిష్ఠించి సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకోవడం  ఆనవాయితీగా వస్తున్నది. మూడు నాలుగు దశాబ్దాల క్రితం పల్లెకు ఒకటి రెండు విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహించేవారు. కాలక్రమంలో పట్టణాలతో పాటు పల్లెల్లోనూ ఎక్కువ సంఖ్యలో విగ్రహాలు నెలకొల్పుతున్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోనూ ప్రతివీధిలో విగ్రహాలు నెలకొల్పుతారు. తొలినాళ్లలో చిన్న సైజు విగ్రహాలనే ప్రతిష్ఠించగా రానురాను చిన్న చిన్న వీధుల్లోనూ ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో తయారు చేసిన భారీ విగ్రహాలు ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం పల్లెల్లోనూ కరోనా కేసులు నమోదవుతుండటంతో గణేశ్‌ ఉత్సవాలపై పోలీసులు ఆంక్షలు విధించాలని యోచిస్తున్నారు. తొలి రోజు విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు తొమ్మిది రోజులు పూజలు, నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించడం సంప్రదాయబద్ధంగా వస్తున్నది. ఉత్సవాల్లో పాల్గొనే భక్తుల్లో ఎవరికైనా కరోనా ఉంటే వారినుంచి ఎక్కువ మందికి విస్తరించే అవకాలు ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఊరికి ఒక్కటే విగ్రహాన్ని ప్రతిష్ఠించి భౌతికదూరం పాటిస్తూ వేడుకలు చేసుకోవాలని సూచిస్తున్నారు. సామూహికంగా జరుపుకునే ఇలాంటి వేడుకల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా కరోనా విస్తరించే అవకాశాలు ఉంటాయని పోలీసులు పేర్కొంటున్నారు.

పల్లెకు ఒక్కటే..

ఊరికి ఒక్క విగ్రహాన్ని మాత్రమే ఏర్పాటు చేయాలి. విగ్రహం ఏర్పాటుకు కచ్చితంగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలి. భక్తులందరూ భౌతికదూరం పాటించేలా ఉత్సవ కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలి. పల్లెల్లోనూ కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలి. గణేశ్‌ మండపాల వద్ద శానిటైజేషన్‌ అందుబాటులో ఉంచాలి.

-నర్సింహారెడ్డి, ఏసీపీ, యాదగిరిగుట్ట

 అప్రమత్తతే ఆయుధం..

గణేశ్‌ ఉత్సవాల నేపథ్యంలో ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలి. గుంపులుగుంపులుగా తిరుగొద్దు. బలవంతంగా చందాలు వసూలు చేయొద్దు. గణేశ్‌ వేడుకల్లో పాల్గొనే భక్తులు నిబంధనలు పాటించాలి. మనిషికి మనిషికి సుమారు మీటరున్నర దూరం ఉండేలా జాగ్రత్త వహించాలి. చిన్న పిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతేనే వారు బయటకు రావాలి.    

-జానకీరెడ్డి, సీఐ, యాదగిరిగుట్ట టౌన్‌

తాజావార్తలు


logo