తాడ్వాయి, జూన్ 15 : ప్రభుత్వ పథకాల అమలులో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అక్రమాలను అరికట్టాలని బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి, జడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి డిమాండ్ చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్‌లో ఆదివారం ఆమె గ్రామస్తులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టి రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ.. మంత్రి సీతక్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు మరోమాట మాట్లాడుతున్నదన్నారు.
మాట ఇచ్చి తప్పడమే కాంగ్రె స్ పార్టీ నైజమని, ప్రజాపాలన అని చెబుతూనే పేదలకు తీరని అన్యాయం చేస్తున్నదన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో జిల్లా వ్యాప్తంగా జరిగిన అవినీతి, అక్రమాలను అరికట్టాలన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని, రైతులకు సకాలంలో రైతుభరోసా చెల్లించి సన్న ధాన్యం బోనస్ డబ్బులను ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు డబ్బులు ఇచ్చినోళ్లకే ఇందిరమ్మ ఇండ్లు కట్టబెట్టారన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓటర్లను మభ్యపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో పేదలకు జరిగిన అన్యాయంపై నిలదీస్తామని నాగజ్యోతి హెచ్చరించారు. కార్యక్రమంలో మేడారం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ కాక లింగయ్య, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గోవింద్‌నాయక్, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, మండలాధ్యక్షుడు దండుగుల మల్లయ్య పాల్గొన్నారు.